పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్! ఢిల్లీ లో 72 కుటుంబాలు క్వారంటైన్ లోకి!!

K V D Varma
Updated on: 16 April 2020 1:20 PM IST
పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్! ఢిల్లీ లో 72 కుటుంబాలు క్వారంటైన్ లోకి!!
X
pijja delivery boy having covid positive in delhi (representational image)

ఒక్క పిజ్జా తినాలనే కోరిక 72 కుటుంబాలను భయం గుప్పెట్లోకి నెట్టేసింది. సరదాపడిన ఆహారం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దిల్లీలో పిజ్జాలను డెలివరీ చేసిన యువకునికి కరోనా పాజిటివ్ తేలడంతో ఆరోజు ఆ సంస్థ నుంచి పిజ్జా తెప్పించుకున్న 72 కుటుంబాలు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎబీపీ లైవ్ న్యూస్ వెబ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ దక్షిణ జిల్లాకు చెందిన ఒక పిజ్జా డోర్ డెలివరీ సంస్థ నుంచి కొందరు మంగళవారం పిజ్జాలు తెప్పించుకున్నారు. పిజ్జాలు డెలివరీ బాయ్ కు ఆ తరువాత కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ దక్షిణ జిల్లా మేజిస్ట్రేట్ బీఎం మిశ్రా ఈ వివరాలను తెలిపినట్టు ఆ కథనం పేర్కొంది. దాని ప్రకారం కరోనా పాజిటివ్ తేలిన డెలివరీ బాయ్ తో సహా ఆ సంస్థలో డెలివరీ బాయ్ లు గా పని చేస్తున్న 16 మందిని క్వారంటైన్ కు తరలించారు. మంగళవారం వారు ఢిల్లీలో 72 కుటుంబాలకు పిజ్జా డెలివరీ ఇచ్చినట్టు గుర్తించారు. వారందరినీ కలిసిన అధికారులు ఆ 72 కుటుంబాలనూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా చెప్పారు. దీంతో ఆ కుటుంబాలన్నీ ప్రస్తుతం తమమంత తామే క్వారంటైన్ లోకి వ వెళ్ళిపోయారు. అధికారులు ఈ కుటుంబాలకు సంబంధించి అన్ని వివరాలనూ సేకరించి ఎప్పటికప్పుడు వారితో టచ్ లో ఉంటున్నారని మిశ్రా తెలిపారు.

అయితే, ఇది అంత భయపడాల్సిన విషయం కాదనీ, డెలివరీ బాయ్ లు అందరూ మాస్క్ లు ధరించడం తో సహా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారనీ అయన చెప్పారు. అయినా సరే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆ కుటుంబాలను క్వారంటైన్ లో ఉండమని సూచించామన్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన డెలివరీ బాయ్ ను ఇసోలేషన్ లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. మిగిలిన వారిని రోజూ వారి ఆరోగ్య పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తూ అప్రమత్తంగా ఉన్నారని మిశ్రా వివరించారు.

భయపడాల్సింది ఏమీ లేదు..

సాధారణంగా కరోనా వైరస్ ఉడికించిన ఆహారపదార్థాల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గతంలోనే తెలిపింది. గత అనుభవాలను చూస్తే, సార్స్ లేదా మేర్స్ వైరస్ లు ఆహార పదార్థాల ద్వారా ఎక్కడా వ్యాప్తి చెందిన ఆనవాళ్ళు లేవనీ, అదే తరహా వైరస్ అయిన కోవిడ్ తో కూడా ఇదే పరిస్థితి ఉంటుందనీ డబ్ల్యుహెచ్వో తెలిపింది.

ఇలా చేస్తే మేలు..

- శుభ్రతను పాటిస్తాయని నమ్మకమున్న రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఆహారాన్ని తెప్పించుకోవాలి.

-జోమాతో, స్విగ్గీ లాంటి డెలివరీ సంస్థలు తమ యాప్ లో పూర్తి శుభ్రత పాటించే రెస్టారెంట్ల వివరాలను తమ యాప్ లలో అందుబాటులో ఉంచుతున్నాయి. అటువంటి రెస్టారెంట్ లను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

- ఇప్పుడు ఆహారాన్ని డెలివరీ చేసే సంస్థలు no contact delivery విధానాన్ని పాటిస్తున్నాయి. అటువంటి సంస్థలను ఎన్నిక చేసుకోవాలి. ఆ సంస్థలు ఏ దశలోనూ ఆహార పదార్ధాలను తాకే పరిస్థితి రాకుండా చూసుకుంటాయి. ఇక డెలివరీ కూడా ఆయా వినియోగదారుల ఇంటి గుమ్మం వద్ద ఉంచి డెలివరీ బాయ్ లు వెల్లిపోయేలా చూస్తారు. తరువాత వాటిని తగిన జాగ్రత్తలతో వినియోగదారులు ఇంటిలోపలికి తీసుకువెళ్ళవచ్చు.

- అలాగే ఆహార పదార్ధాలున్న ప్యాకెట్ ను చేతితో పట్టుకున్న తరువాత అదే చేతిని ఎత్తి పరిస్థితిలోనూ శుభ్రం చేసుకునే వరకూ ముఖానికి తాకించకుండా జాగ్రత్త వహించాలి.

K V D Varma

K V D Varma

Next Story