'సర్లే..ఎన్నో అనుకుంటాం గానీ'.. 'జబర్దస్త్' రెబల్స్ మామూలుగా రెచ్చిపోలేదుగా!
'జబర్దస్త్' నుంచి జంప్ అయి వచ్చిన వారితో జీ తెలుగు ఆదివారం (24-11-2019) ప్రసారమైన కార్తీక మాసం ప్రత్యేక షో కామెడీతో అలరించింది.
టీవీ మాధ్యమంలో కొన్ని రోజులుగా 'జబర్దస్త్' చర్చే నడుస్తోంది. టీవీ షోలకు తలమానికంలా నిలిచినా షో జబర్దస్త్ నుంచి ప్రముఖులు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారన్న చర్చలే ఎటు చూసినా నడిచాయి. ఇలా అట.. అలా అట అంటూ వార్తలు రెక్కలు కట్టుకుని మరీ చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా జబర్దస్త్ నాగబాబు ఆ షో వదిలేస్తున్నారన్న వార్తా సంచలనం గా మారింది. జబర్దస్త్ షో తో తన రేటింగ్ ను అమాంతం పెంచుకున్న ఈటీవీ కి చెక్ పెట్టాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఇతర ఛానెల్స్ కి జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్ళిపోతున్నారన్న వార్త జోష్ ఇచ్చింది. ఇక దాగుడుమూతల తర్వాతా నాగబాబు.. ఆయనతో పాటు మరికొంత మంది జబర్దస్త్ నుంచి జంప్ అయిపోయారు. వీళ్లంతా కల్సి ఈ ఆదివారం 'సరె.. సర్లే ఎన్నో అనుకుంటాం కానీ.. అన్నీ అవుతాయా ఏంటీ' అంటూ జీ టీవీలో సందడి చేశారు.
కార్తీక మాసం సందర్భంగా మూడు గంటల ప్రత్యేక వినోద కార్యక్రమం ప్రసారం చేసింది జీటీవీ. మామూలుగా ఇటువంటి షోల గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోరు. కానీ, జబర్దస్త్ కార్యక్రమం నుంచి జీ తెలుగు కి వచ్చిన వారందరితో కర్టెన్ రైసర్ గా ఈ కార్యక్రమమాన్ని చేస్తున్నట్టు ప్రోమోలలో చూపించడం తో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ షో ఆద్యంతం నాగబాబు చుట్టూ తిప్పారు. అంతే కాదు.. జబర్దస్త్ వదిలి వచ్చేసినందుకు అందరూ చాలా సంతోషిస్తున్న అర్థం వచ్చేలాంటి పంచ్ లు వేసి నవ్వించే ప్రయత్నం చేశారు.
ఇక ఇందులో ఆర్ఫీ అయితే, జబర్దస్త్ మీద ఒక రేంజిలో పంచ్ లు వేశాడు. అక్కడ నుంచి వచ్చేసాం కదా.. జీ..వితం మొదలవ్వబోతోంది.. కూడా వస్త్తానన్న ఆడదాన్ని.. వెనకే వస్తాను పదా అన్న మగాడ్ని నమ్మకూడదంటూ నర్మగర్భంగా జీ కి నాగబాబు తో రాకుండా ఉండిపోయిన ఎవరికో గట్టి పంచ్ వేశాడు ఆర్ఫీ. ఇక జబర్దస్త్ లో ఒక వెలుగు వెలిగి బయటకు వచ్చేసిన ధన్ రాజ్, వేణులు చేసిన స్కిట్ అయితే పూర్తిగా జబర్దస్త్ మీద పంచ్ లతో నిండిపోయింది. బాబుగారూ నేను చెప్పనా.. అక్కడ నుంచి ఇక్కడకు వస్తారని వచ్చేసారు.. మూడేళ్ళ నుంచి శని పట్టుకుంది నాగేంద్రుడి దయ తో అది వదిలేస్తుంది అంటూ వేణు వేసిన పంచ్ లు బాగా పేలాయి. ఇక ధన్ రాజ్ నా స్కిట్ లు చూడటానికి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేశారు అంటూ నాగబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
ఇదంతా సరే.. ఒక షో నుంచి వేరే షో లేదా వేరే చోటికి మారినపుడు గతంలో పనిచేసిన ప్రదేశంపై ఇంత జోకులు వేసుకుని వీధిన పెట్టి మరీ నవ్వుకోవడం ఎక్కడైనా జరుగురుందా అనేది ప్రేక్షకులను తొలిచేస్తున్న సందేహం. పైగా నాగబాబు లాంటి వ్యక్తి ఆ జోకులకు విరగపడి నవ్వుతూ.. ఆ పంచ్ లు ఎంకరేజ్ చేయడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది అందర్నీ.
మొత్తమ్మీద ఒక్క విషయం మాత్రం ఈ 'సరె.. సర్లే ఎన్నో అనుకుంటాం కానీ.. అన్నీ అవుతాయా ఏంటీ' స్పష్టం చేసింది. జబర్దస్త్ కి గట్టి పోటీ ఇచ్చేలా జీ తెలుగు లో కామెడీ షో రాబోతుందని స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చింది. చమ్మక్ చంద్ర, ఆర్ఫీ, ధన్ రాజ్, వేణు ఇలా అందరూ కామెడీ పంచేవారు ఇక్కడ కనిపించారు. ప్రదీప్, రవి యాంకర్ లుగా కనిపించడమూ కొంత ఆసక్తి కలిగిస్తోంది. ఇక రాబోయే కార్య్కర్మాలు ఎలా ఆకట్టుకుంటాయి.. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ ని మించే కామెడీ షో చేయాలని ప్రయత్నిస్తున్నజీ తెలుగు కు ఈ షో ఎంత బాసటగా నిలుస్తుంది అనేది వేచి చూడాల్సిందే!


