చిత్రపరిశ్రమకు చిరునామాగా విశాఖ మారనుందా?

చిత్రపరిశ్రమకు చిరునామాగా విశాఖ మారనుందా?
x
Highlights

పర్యాటక స్వర్గధామమైన విశాఖ చిత్ర పరిశ్రమకు చిరునామాగా మారనుందా అంటే, అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రకృతి రమణీయత సుందర సాగరతీరం సోయగాలు,...

పర్యాటక స్వర్గధామమైన విశాఖ చిత్ర పరిశ్రమకు చిరునామాగా మారనుందా అంటే, అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రకృతి రమణీయత సుందర సాగరతీరం సోయగాలు, ఆకర్షణీయమైన ఎర్ర దిబ్బలు ఇలా విశాఖ లో ప్రకృతి గీసీన చిత్రాలు ఎన్నో వున్నాయి. హైదరాబాద్ తరువాత విశాఖలోనే అత్యధిక శాతం చిత్రీకరణలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చు, షూటింగ్ ల కు అనువైన ప్రాంతం కావడంతో ఇండస్ట్రీని విశాఖకు తరలించాలనే ఆలోచనలో సినీపెద్దలు వున్నారు. స్టీల్ సీటీ కాస్తా సినిమా హబ్ గా మారుతున్న వైనం పై HM TV స్పెషల్ స్టోరీ.

ప్రంపచ పర్యాటక పటంలో విశాఖ అందాలకు మంచి స్థానం వుంది. దేశ, విదేశాల నుండి వైజాగ్ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి తీరం వెంబడి వున్నరుషికొండ, భీమిలి, యారడ ప్రాంతాలు షూటింగ్ స్పాట్ లు గా పేరొందాయి. భీమిలి ప్రత్యేకంగా రారమ్మంటూ సీని పరిశ్రమను ఆహ్వానిస్తుంది. పచ్చగా, ప్రశాంతంగా వుండే వాతావరణం, నీలి సముద్రం ఎంతో అందంగా వుంటాయి. అందుకే బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుండే భీమిలి చిత్రపరిశ్రమను ఆకర్షించింది. అలనాటి ప్రేమ కథా చిత్రం " మరో చరిత్ర " ఎక్కువ భాగం భీమిలిలోనే చిత్రీకరణ జరుపుకుంది.

ఇక విశాఖ అందాలకు ఎర్రని మణిహారంలా వుండే ఎర్రమట్టి దిబ్బలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఎర్రమట్టి దిబ్బలను ఎన్నో సినిమాలలో చిత్రీకరించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, బోజ్ పూరీ, బెంగాళీ చిత్ర పరిశ్రమలు కెమెరాలలో బంధించాయి. షూటింగ్ లకు విశాఖ సహజ అందాలు ఎంతో అనువుగా ఉంటాయి. సెట్టింగ్స్ వేయాల్సిన అవసరం వుండదు. తక్కువ ఖర్చుతో చిత్రనిర్మాణం ను పూర్తి చేయవచ్చు అంటున్నారు దర్శక నిర్మాతలు.

లాక్ డౌన్ నిబంధనలు సడలింపు నేపథ్యంలో ఇటీవల సీఎం జగన్ ను చిరంజీవి నేతృత్వంలోని సినీ పెద్దలు కలిశారు. టీవీ, సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని కోరగా, ఆయన అంగీకరించారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీని విశాఖ తరలించే అంశం ప్రస్తావనకు వచ్చింది.

గతంలో విశాఖ లో నెలకు 12 నుండి 20 సినిమాల షూటింగ్ లు జరుపుకునేవి. షూటింగ్ ల సంఖ్య మరింత పెరిగేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పించి ప్రోత్సహించాలని సినీ పెద్దలు కోరుతున్నారు. ఇప్పటికే పలు స్టార్ హోటళ్లు సినిమా వాళ్లకు డిస్కౌంట్ లు ఇస్తున్నాయి. షూటింగ్ లకు ప్రభుత్వ శాఖలు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు లోకేషన్ల అద్దెలు తగ్గించాలని కోరుతున్నారు.

ఇప్పటికే రుషికొండ ప్రాంతంలో డి. రామానాయుడు స్టూడియో నిర్మించారు. చిరంజీవి కూడా స్టూడియో నిర్మాణంకు దరఖాస్తు చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. సినీ పరిశ్రమ సాగరతీరంకు తరలి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా వుంది. ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ ని ప్రోత్సహించనుంది. విశాఖను సినిమా హబ్ గా మార్చాలంటే ఇండస్ట్రీ కోరుతున్న సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories