పాపం రణు మండల్.. మార్ఫింగ్ ఫోటోకి మర్యాద పోగొట్టుకుందిగా!
సింగర్ రణు మండల్ పై ఇటీవల ప్రచారంలో ఉన్న ఫోటో ఫేక్ అని తెలుస్తోంది.
సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే..ఇదిగో తోక అని తెలిసే లోపు తోక తో పాటు రకరకాల జంతువులు..అవసరమైతే తోక ఉన్న మనిషి లాంటి ఫోటోలు కూడా ప్రత్యక్షమయిపోయేంతగా. ఒక్క విషయం బయటకు వచ్చిన సెకన్ల వ్యవధిలోనే విశ్వవ్యాపితం అవడం మాట అటుంచి..దానిని చిలువలు వలువలుగా ట్రోలింగ్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది.
అత్యంత వేగంగా.. ఏది నిజం.. ఏది అబద్ధం తెలుసుకునే లోపే కోట్లాది మందికి చేరిపోతోంది ఏ విషయమైనా. దాంతో మసి పూసి మారేడు కాయ చేసినట్టు మామూలు విషయం కూడా వైరల్ అయిపోయి..సంబంధిత వ్యక్తుల తప్పు లేకపోయినా ట్రోలింగ్ కు గురికావడం..తద్వారా మానసికంగా క్షోభ అనుభవించడం ఎక్కువైపోయింది.
తాజాగా సింగర్ రణు మండల్ విషయంలో అదే జరిగింది. ఎవరో ఒకరు రైల్వే ప్లాట్ ఫాంపై పాడిన పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆమె పాటలకి వీపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆమెకు దేవుడు చాలా అందమైన గొంతుని ఇచ్చాడని చాలా మంది ప్రశంసలు గుప్పించారు. దీనితో ఆమెకి బాలీవుడ్ లో చాలా సినిమాలకి పాటలు పాడే అవకాశం వచ్చాయి. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆ పాపులారిటీతో పాటు ఆమెను రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు.
ఆధునిక సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలీని వెనుకబడిన స్థాయి నుంచి వచ్చిన ఆమె ప్రవర్తన విషయంలో ఈ ట్రోలింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఆమె మేకప్ విషయంలోనూ అదే జరిగింది. ఆమె చక్కగా ముస్తాబయిన ఫోటో సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రోడ్డు పక్కన ఉన్న ఆమెను సింగర్ ని చేస్తే ఓవర్ మేకప్ వేసుకుని ఫోజులు కొడుతోంది అంటూ నెటిజన్లు ఆమె తీరుపై విరుచుకు పడ్డారు.
అసలు నిజం ఇదీ...
రణు మండల్ ఒక కార్యక్రమం కోసం మేకప్ చేయించుకున్న మాట వాస్తవం. సంధ్యాస్ మేకోవర్ అనే మేకప్ సెలూన్ ఈ మేకప్ చేసింది. వారు రణు మండల్ కు మేకప్ చేసిన ఫోటోను భయంకరంగా మార్చి.. దెయ్యం లాంటి ముఖంలా ఆమె మొఖాన్ని తీర్చి దిద్ది సోషల్ మీడియాలో ఉంచారు. దీనిని చూసిన నెటిజన్లు ఇక రణు మండల్ ను నెట్టింట్లో ఉతికి ఆరేశారు. నిజానికి సింగర్ గా ఆమె ఎన్నో వేదికలపైకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆమె మేకప్ వేసుకోవడం జరిగి ఉంటుంది. దానిని మార్చి.. భయంకరంగా చేసి ఆమెను నెట్టింట బజారుకు ఈడ్చేశారు.
ఈ విషయంపై స్పందించిన సంధ్యాస్ మేకోవర్ తన ఇంస్టాగ్రామ్ లో అసలు ఫోటో ఉంచింది. దాంతో పాటు నెటిజన్లను ఉద్దేశించి కొన్ని వాక్యాలూ పంచుకున్నారు. ''మీరు ఫేక్ ఫోటోను సృష్టించడం మాకు నవ్వు తెప్పిస్తోంది. అయితే, ఇటువంటివి చేసినపుడు వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న విషయం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏదిఏమైనా మీరంతా నిజానిజాలు తెలుసుకోవాలని ఈ పోస్ట్ పెడుతున్నాము'' అంటూ రాసుకొచ్చారు.


