రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా టైటిల్ ఇదేనట!
రాజమౌళి సినిమా అంటేనే విపరీతమైన ఆసక్తి అందరికీ. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా ఎక్కడికో తీసుకువెళ్ళిపోయిన దర్శక ధీరుడు. ఇప్పుడు ఆ దర్శకరత్నం మరో సినిమా సిద్ధం చేస్తోంది. తెలుగు లో మునుపెన్నడూ లేని మల్టీ స్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ సినిమా పై అభిమానులకు మామూలు అంచనాలు లేవు. ఇక ఇటువంటి సినిమాకి టైటిల్ ఏం పెడతారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ జనాలకి బాగా రీచ్ అయిపొయింది కూడా.
అయితే, ఇప్పుడు సినిమాకి టైటిల్ వేపెట్టే విషయంలో అభిమానుల నుంచి బోలెడు సలహాలు అంతకు మించి ఆర్ ఆర్ ఆర్ అని కలిసి వచ్చేలా పేరు ఉండాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ఒకడుగు ముందుకు వేసి.. సినిమాకి రకరకాల టైటిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాకి ''రామ రౌద్ర రుషితం'' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ టైటిల్ పై చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఇతర భాషల్లో ''రైట్ రివోల్ట్ రివెంజ్'' అనే టైటిల్ పెట్టబోతున్నారట. ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా అభిమానులు మాత్రం టైటిల్ ఇదే అంటూ ఫిక్స్ అయిపోయారు.


