మణిరత్నం..ఏఅర్ రెహ్మాన్ ల మ్యాజిక్ 'బొంబాయి' సినిమాకి పాతికేళ్ళు!

మణిరత్నం..ఏఅర్ రెహ్మాన్ ల మ్యాజిక్ బొంబాయి సినిమాకి పాతికేళ్ళు!
x
maniratnam bombay movie poster (file image)
Highlights

అపురూపమైన సినిమా బొంబాయి. అపురూపం అని ఎందుకు అంటున్నామంటే ఒక అందమైన ప్రేమ కథ.. అచ్చమైన సామాజిక పరిస్థితుల నడుమ అద్భుతమైన కథనంతో ఈ సినిమా సాగుతుంది. ఈ బొంబాయి గురించి ఇప్పుడు ఎందుకంటే.. ఈ సినిమా విడుదలై సరిగ్గా 25 సంవత్సరాలు అయింది.

సినిమా అనగానే మనకు రకరకాల వినోదం గుర్తొస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రావడం మనదేశంలో చాలా తక్కువ. అందులోనూ తెలుగులో మరీ తక్కువ. కుటుంబ కథా చిత్రాలు.. ప్రేమ కథా చిత్రాలు.. కామెడీ సినిమాలు ఇలానే తెలుగు సినిమా ఉండేది. 90 వ దశకంలో సినిమా అంటే ఇంచుమించు ఇలానే ఉండేవి. కానీ మణిరత్నం ఆ మూస ధోరణి నుంచి ఒక్కసారిగా వాస్తవ ఘటనల ఆధారంగా దేశంలో తాజా పరిస్థితుల నేపధ్యంతో సినిమాలు తీశారు. వాటిలో అపురూపమైన సినిమా బొంబాయి. అపురూపం అని ఎందుకు అంటున్నామంటే ఒక అందమైన ప్రేమ కథ.. అచ్చమైన సామాజిక పరిస్థితుల నడుమ అద్భుతమైన కథనంతో ఈ సినిమా సాగుతుంది. ఈ బొంబాయి గురించి ఇప్పుడు ఎందుకంటే.. ఈ సినిమా విడుదలై సరిగ్గా 25 సంవత్సరాలు అయింది.

రెండు విభిన్న వర్గాలకు చెందిన యువతీ యువకుల మధ్య ప్రేమ.. తల్లిదండ్రులను ఎదిరించి వారి పెళ్లి.. పిల్లలు.. రెండు వర్గాల మధ్య జోరుగా అల్లర్లు.. వీటి మధ్య వారి జీవితం..ఇదీ ఈ సినిమా. నేపధ్యంగా 1992లొ జరిగిన ముంబయి అల్లర్లలో ప్రజల ఇబ్బందులని కళ్ళకు కట్టినట్టు చూపించారు మణిరత్నం.

నేపధ్యం ఇదీ..jubilee

1992-93 మధ్యలో ముంబాయిలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన తరువాత దేశంలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపధ్యంలో దేశంలోని రెండు ముఖ్యమైన వర్గాల మధ్య విపరీతమైన ఘర్షణలు జరుగుతూ వచ్చాయి. ముంబాయిలో ఒక వర్గం వారు ఆరుగురు వేరే వర్గం వారిని చంపివేశారు. వారిలో రాధాబాయి చావ్లా అనే దివ్యంగురాలు కూడా ఉంది. దీంతో రెండో వర్గం ప్రజలు ముంబైలో అల్లర్లకు దిగారు. అక్కడ నుంచి ప్రారంభం అయిన గొడవలు ప్రజల్లో విపరీతమైన అలజడి రేకెత్తించాయి.

బాబ్లీ మసీదు విధ్వంసం తరువాత జరిగిన అల్లర్లు ఒక్కరోజు తోనో ఒక్క వారంతోనో ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగినా.. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబాయిలో అవి చాలా తీవ్రంగా జరిగాయి. అందుకు అప్పట్లో ముంబాయిలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులే కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో రెండేళ్ళు అంటే 1992 నుంచి 1993 వరకూ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నిజానికి సామాన్య ప్రజానీకంలో ఈ అంశంపై పెద్దగా స్పష్టత లేకపోయినా..అనేక ఇతర కారణాలు..ఇదే అదనుగా పెట్రేగిపోయిన సంఘ వ్యతిరేక మూకలు చేసిన విధ్వంసం సామాన్య జనజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చేయని తప్పుకు వందలాది మంది గాయపడటం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

సినిమా కథ ఇలా..

ఈ నేపధ్యంలో ఆ రెండు వర్గాలకు చెందిన వారు భార్యాభర్తలుగా ఉంటె పరిస్థితి ఎలా ఉంటుంది? దీనినే చాలా హృద్యంగా చూపించారు మణిరత్నం. ముంబై కి చెందిన ఒక జర్నలిస్ట్ తన ఊరికి వెళతాడు. ఊరిలోకి అడుగు పెట్టడమే ప్రేమలో పడిపోతాడు. తాను వస్తూనే బురఖాలో ఉన్న యువతి కళ్ళను అనుకోకుండా చూస్తాడు. ప్రేమ ఎప్పుడు.. ఎలా పుడుతుందో చెప్పలేం అన్నట్టు ఒక్క కళ్ళను చూసే ఆమె పట్ల ఆకర్షితం అవుతాడు. సరిగ్గా అదే సమయానికి బెరుకుగా అతన్ని చూసిన ఆమె హృదయం కూడా గతి తప్పుతుంది. వీరిద్దరి రెండో కలయిక వీరి ప్రేమకు బలమైన పునాది వేస్తుంది. ఊరిలో ఒక పెళ్ళిలో ఇద్దరూ కలుసుకుంటారు. ఇద్దరి మనసూలూ చూపులతోనే ఒకటవుతాయి.

వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. దీంతో సహజంగానే రెండు వైపులా వారి పెళ్ళికి ఒప్పుకోరు. దీంతో ఇద్దరూ పారిపోయి ముంబై లొ పెళ్ళిచేసుకుంటారు. వారికి కవలపిల్లలు పుడతారు. వారికి ఐదేళ్ళ వయసు వచ్చేసరికి ముబాయిలో రెండు వర్గాల మధ్యా ఘర్షణలు తీవ్రం అవుతాయి. ఈ సమయంలో ఊరి నుంచి పిల్లల తాత లిద్దరూ మనసు మార్చుకుని పిల్లల కోసం ముంబాయి వస్తారు.

ఒకవైపు రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు.. మరోవైపు ఇంట్లో వీరిద్దరి చాదస్తం వీటి మధ్యలో మానవీయ కోణాలని స్పృశిస్తూ సినిమా సాగుతుంది. వాస్తవ పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు కాదు..కాదు..గుండెల్ని గుచ్చినట్టు చూపిస్తారు మణిరత్నం.

ఏ ఆర్ రెహ్మాన్ అద్భుతం..

సినిమా కథ కథనం ఎంత చక్కగా ఉంటాయో వాటిని మించి సంగీతం ఉంటుంది. అప్పట్లో బొంబాయి సినిమా పాటలు సూపర్ హిట్. ఇప్పటికీ ఆ పాటలకు చాలా క్రేజ్ ఉంది. పాటలు ఒక ఎత్తు.. సినిమాలో నేపధ్య సంగీతం ఒక ఎత్తు. విజువల్స్ ని మించి బైక్ గ్రౌండ్ మ్యూజిక్ మన హృదయాల్ని హత్తుకుంటుంది. ఇటువంటి ఎమోషనల్ లవ్ స్టోరీకి కావలసిన దృశ్య,సంగీత విభావరి సరిగ్గా ఈ సినిమాకి కుదిరాయి. ఒక అద్భుతమే జరిగింది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఇటు దృశ్యాన్ని..అటు సంగీతాన్ని ఒకేసారి మనసు పొరల్లోంచి ఆస్వాదిస్తాడు. రోజా సినిమా తరువాత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరో హీరోయిన్ల మొదటి రాత్రి సీన్లు చూపించే తప్పుడు సున్నితమైన రోమాన్స్ ని బలమైన అరబిక్ కడలందం పాటతో ఆవిష్కరించిన తీరు ఇప్పటికీ ఓ మధురమైన అనుభూతే!

అలర్లను సినిమాలో ఎలా..

ఇక అల్లర్ల నేపధ్యంలో వచ్చే చిన్న చిన్న కథలు.. సినిమాకి వాస్తవికతను అద్దాయి. ముంబాయి అల్లర్ల సమయంలో వెలుగులోకి వచ్చిన కథల్ని సినిమాలో భాగంగా ఇముడ్చుకుంటూ కథనాన్ని నడిపిస్తారు మణిరత్నం. ఇక అత్యంత కీలకమైన సన్నివేశం.. అప్పట్లో పరిస్థితులకు అద్దం పట్టే సన్నివేశం ఒకటుంటుంది. పిల్లలిద్దరూ బయట ఉన్న సమయంలో ఆందోళన కారులు చుట్టుముడతారు. వారు వాళ్ళిద్దర్నీ పట్టుకుని మీరు హిడువులా..ముస్లిం లా అని అడుగుతారు. పాపం వారికి ఆ మతాల గోలే తెలీదు. చుట్టూ విపరీతమైన ఘర్షణలు.. మధ్యలో పిల్లల్ని కత్తులతో బెదిరిస్తున్న ఆగంతకులు.. ఏ మతమో తెలీని అమాయక బాల్యం.. ఈ దృశ్యం సినిమా మొత్తానికే హైలైట్ గా ఉంటుంది. ఇదే సమయంలో పిల్లలు ఇద్దరూ విడిపోతారు. అందులో ఒక పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక హిజ్రా కాపాడతారు. ఆ సమయంలో ఆ పిల్లవాడు 'మతం అంటే ఏమిటి?' అంటూ ఆ హిజ్రాని ప్రశ్నిస్తాడు. దానికి హిజ్రా ఇచ్చే జవాబు అందర్నీ ఆలోచింప చేసేదిగా ఉంటుంది. ఈ హిజ్రా పాత్రని ప్రముఖ నటుడు రాళ్ళపల్లి పోషించారు.

నిజానికి సినిమా ఒక్కరోజు జరిగిన అల్లర్లను చూపించేలా తీసింది కాదు. బాబ్లీ మసీదు విధ్వంసం తరువాత రెండేళ్ళ పాటు జరిగిన సంఘటనల సమాహారాన్ని కథలో భాగంగా పేర్చుకుంటూ వెళ్ళారు మణిరత్నం. రెండు వర్గాల మధ్య ఏర్పడిన అగాధం.. వాటి మధ్యలో సంఘ విద్రోహశక్తులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఆ అగాధాన్ని అల్లర్లుగా మార్చడం. ఆ అల్లర్ల మధ్యలో వచ్చే మరణమృదంగం వీటన్నిటినీ కలగలిపి సినిమాటిక్ గా చూపించారు.

తమిళంలో తీసిన ఈ సినిమా తెలుగు, హిందీల్లో డబ్ చేసి విడుదల చేశారు. అయితే, ఎక్కడా కూడా సినిమా తమిళ సినిమాలా అనిపించదు. సినిమాలో అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా నటన ఒక రేంజిలో ఉంటుంది. ఇక మిగిలిన తారాగణం అంతా తమ బెస్ట్ ఇచ్చారు. మొత్తమ్మీద బొంబాయి సినిమా పాతికేళ్ళయినా ఇప్పటికీ భారత ప్రేక్షకుల మనసుల్ని వెంటాడుతూనే ఉంటోంది. లెక్కలేనన్ని అవార్డులు.. ప్రజల రివార్డులు గెలుచుకున్న ముంబాయి సినిమా వాస్తవ ఘటనలను చక్కని కథలో ఎలా ఇమడ్చవచ్చో చూపించిన దృశ్యకావ్యంగా చెప్పుకోవచ్చు..

మణిరత్నం అప్పటికే చాలా సినిమాలు చేశారు. దీనికి ముందే రోజా పేరుతో టెర్రరిజం నేపధ్యంలో ప్రేమకథను తీసి మొత్తం దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు ఆయన. ఈయన ప్రేమను ఎంత అందంగా వెండి తెరమీద ఆవిష్కరిస్తారో అంతే బలంగా సామాజిక అంశాల్ని సెల్యులాయిడ్ మీద పరిచే దర్శక దిగ్గజుడు. అయితే, రోజా సినిమాలో ప్రేమకథకు ఎంచుకున్న నేపధ్యం టెర్రరిజం ఈ అంశం మీద భారతీయులలో ఏకాభిప్రాయం ఉంది. రాజకీయంగానూ తీవ్రవాదం మీద అంతా ఏకమయ్యే పరిస్థితి. కానీ, బొంబాయి సినిమా నేపదయం చాలా సున్నితమైంది. రెండు వర్గాల్లో ఎవర్నీ నొప్పించకుండా.. విషయాన్నీ పక్కదారి పట్టించకుండా చెప్పాలి. ఇక్కడే మణిరత్నం పూర్తిగా విజయవంతం అయ్యారు.

విక్రం చేయాల్సిన సినిమా..

ఈ సినిమాలో విక్రం హీరో అనుకున్నారు. కానీ, డేట్స్ ఎడ్జస్ట్ కాపోవడంతో రోజా తో పాప్యులర్ అయిన అరవింద స్వామితో సినిమా చేశారు. గ్రామాలలో ఉండే ప్రజల మద్య ఉండే బాంధవ్యాలు.. వాటి మధ్య కనిపించీ కనిపించకుండా ఉండే కుల, మతాల అడ్డుగోడలూ.. వీటిని సినిమా మొదట్లో ఆవిష్కరించిన మణిరత్నం.. ముంబాయి లాంటి సిటీలో ఉండే ప్రజా జీవితంలో ఉండే వైరుధ్యాలను కళ్ళకు కట్టినట్టు ప్రతి ఫ్రేం లోనూ చూపించారు. ఈ సినిమాకి అదే బలం కూడానూ. ఇలా చెబుతూ పొతే ముంబాయి సినిమాలోని ప్రతి సన్నివేశం గొప్పతనమూ చెప్పుకోవాల్సిందే.

అందుకే బొంబాయి సినిమా ఇప్పుడు చూసినా అదే గిలిగింత..అంతే ఉద్వేగం..అంతకు మించి మంచి సినిమా చూసిన అనుభూతి మనకు కలిగి తీరుతుంది. వీలయితే కాదు కాదు.. వీలు చూసుకుని ఈ సినిమా చూడండి. మణిరత్నం, ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ కి మీరు ఫిదా అవడం ఖాయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories