డార్లింగ్ ప్రభాస్ కి పుట్టినరోజు జేజేలు!

డార్లింగ్ ప్రభాస్ కి పుట్టినరోజు జేజేలు!
x
Highlights

విజయం వచ్చినపుడు పొంగిపోడు.. అపజయం వచ్చినపుడు కుంగిపోడు.. ఏది జరిగినా తను అనుకున్న వారిని విడిచిపెట్టడు.. ఒకసారి డార్లింగ్ అంటూ దగ్గరకు తీసుకుంటే ఎప్పుటికీ మరచిపోడు.. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినా.. తను నమ్మిన దానికోసం తన విలువైన కాలాన్ని మూల్యంగా భరించాల్సి వచ్చినా.. అనుకున్నది అనుకున్నట్టు పూర్తయేవరకూ వెనుతిరిగి చూడని బాహుబలి

విజయం వచ్చినపుడు పొంగిపోడు.. అపజయం వచ్చినపుడు కుంగిపోడు.. ఏది జరిగినా తను అనుకున్న వారిని విడిచిపెట్టడు.. ఒకసారి డార్లింగ్ అంటూ దగ్గరకు తీసుకుంటే ఎప్పుటికీ మరచిపోడు.. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినా.. తను నమ్మిన దానికోసం తన విలువైన కాలాన్ని మూల్యంగా భరించాల్సి వచ్చినా.. అనుకున్నది అనుకున్నట్టు పూర్తయేవరకూ వెనుతిరిగి చూడని బాహుబలి.. ఎవరో ఈపాటికే అర్థం అయిపోయుంటుంది. అవును డార్లింగ్ ప్రభాస్ గురించే ఇదంతా..

తెలుగు తెర పై హీరోలకు స్టైలింగ్ నేర్పిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా ఈ బాహుబలికి సాహో అంటూ జేజేలు చెబుతోంది తెలుగు ప్రేక్షక లోకం.

పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా.. వెండితెరకు ఈశ్వర్ అంటూ పరిచయం అయి.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అనే స్థాయికి చరిత్ర సృష్టించాడు. మామూలుగా ప్రారంభమైన ఈ బాహుబలి జైత్రయాత్ర తెలుగు రాష్ట్రాలను దాటి.. దక్షిణ భారతాన్ని ఆవరించి.. ఉత్తర భారతాన్ని ఉర్రూతలూగించి.. ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులతో సాహో అనిపించుకుంది.

మన స్టార్ హీరోలకు ఎవరికీ దక్కని రికార్డులు ప్రభాస్ కి దక్కాయి. ఆ రికార్డులు మామూలుగా దక్కినవి కాదు. గాలికి వచ్చి పడినవి అంతకంటే కాదు. ఇంతై వటుడింతై అన్నట్టుగా.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ రాజమౌళి అనే దార్శనికుడిని పూర్తిగా నమ్మి తన కాలాన్నీ.. శ్రమనీ పణంగా పెట్టినందుకు దక్కిన బహుమతులు. ఒక సినిమా కోసం అంత కాలం పనిచేసిన హీరో ఇంతవరకూ ఎవరూ లేరు. ఇదీ ఓ రికార్డే. ఈ రికార్డ్ ప్రభాస్ లోని కమిట్మెంట్ ని పరిచయం చేస్తుంది. ఎక్కడో ఒక సినిమా చేసి.. ఓ చిన్న లైన్ కథతో తన వద్దకు వచ్చిన యువ దర్శకుడిని నమ్మి కోట్లాది రూపాయల సినిమాలో మళ్లీ కాలానికి అతీతంగా నటించడం ప్రభాస్ లోని మంచితనాన్ని చూపిస్తుంది. అందరూ అనొచ్చు.. రాజమౌళి దర్శకుడు గా ప్రభాస్ కి అవకాశం ఇచ్చాడని.. బాహుబలి వెనుక రాజమౌళి కృషి ఉండడం వల్లే రికార్డులు వచ్చాయని.. నిజం కావచ్చు.. కానీ ఆ సినిమాలో చేసిన వారంతా మధ్యలో గ్యాప్ తీసుకుని రెండు మూడు సినిమాల్లో నటించి వచ్చారు. కానీ, తానిచ్చిన మాట కోసం సినిమా ఆలస్యం అయినా సరే ఆ సినిమా పూర్తయ్యే వరకూ మరే సినిమా కూ ఒప్పుకోలేదు ప్రభాస్. అందుకే బాహుబలి విజయం ప్రభాస్ విజయం అయింది.

ప్రభాస్ సినీ జీవితం అంతా పరుగులు తీయలేదు. అక్కడక్కడా పడ్డాడు.. పడి లేచాడు. పడిన ప్రతిసారీ కొత్తదనాన్ని పరిచయం చేశాడు. ఈశ్వర్ గా పరిచయం అయి.. రాఘవేంద్ర గా తరువాతి మెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు ప్రభాస్. కానీ అది ప్రభాస్ పరిచయాన్ని అలా ప్రేక్షకుల మదిలో ఉంచగలిగింది కానీ, మెట్టు మాత్రం ఎక్కింలేకపోయింది. సరిగా ఈ సమయంలో ఎం ఎస్ రాజు వర్షం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇది మొదటి మలుపు.. ఇక్కడ ఒక మెట్టు కాదు చాల మెట్లు ఎక్కేశాడు. డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని రంగాల్లోనూ తనకంటూ ఓ ఇమేజి సృష్టించుకోవడానికి పునాది వేసేసుకున్నాడు. అభిమాన దండును ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు వర్షంతో. తరువాత వెంటనే అడవి రాముడు, చక్రం రెండు సినిమాలు చేశాడు. రెండూ ప్రభాస్ అభిమానుల్ని నిరాశ పరచడంతో, తన గ్రాఫ్ అక్కడే ఆగిపోయింది సరిగ్గా ఇదే సమయంలో రాజమౌళి ఛత్రపతి వచ్చింది. ఇందులో మరో ప్రభాస్ కనిపించాడు. ఒక రేంజిలో బాక్సాఫీసును ఆదేసుకున్నాడు ప్రభాస్ ఈ సినిమా తో. ఇక అక్కడ నుంచి ప్రభాస్ గ్రాఫ్ ఇటు కమర్షియల్ గానూ.. అటు అభిమానుల పరంగానూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ప్రభాస్ కి ప్రత్యేకమైన అభిమాన గణం లేదు. అందరు హీరోల అభిమానులూ ప్రభాస్ అభిమానులుగా మారిపోయారు. ప్రభాస్ వ్యక్తిత్వానికి వచ్చిన కానుక ఈ అభిమాన ధనం.

ఛత్రపతి తరువాత పౌర్ణిమ, మున్నా చేశాడు ప్రభాస్. రెండూ నిరాశ పరిచాయి. ఈ టైములో పూరీతో చిట్టీ.. చిట్టీ అంటూ చెన్నై కుర్రాడిగా వచ్చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్.. ప్రేక్షకులను కట్టిపాదేసింది. ప్రభాస్ లోని మరో కోణాన్ని బయటకు తెచ్చింది. ఈ సినిమా తరువాత స్వంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ బేనర్ లో బిల్లా చేశాడు. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రభాస్ సరికొత్తగా కనిపించాడు. తెలుగు తెరపై సరికొత్త స్టైల్ ని ఆవిష్కరించిన సినిమా ఇది. ఇక్కడ నుంచి ప్రతి సినిమాకీ కొత్త రకం స్టైలింగ్ పరిచయం చేస్తూ ముందుకు దూసుకు పోయాడు ప్రభాస్. తర్వాత వెంటనే పూరీ తో ఏక్ నిరంజన్ చేశాడు. ఇది ప్రేక్షకులను నిరాశ పరిచినా.. సొమ్ములు కొల్లగొట్టింది.

ఇక మరో ప్రభాస్ ని పరిచయం చేసిన సినిమా మాత్రం డార్లింగ్! కాజల్ తో కలిసి వెండి తెరమీద డీసెంట్ వెలుగును నింపాడు. ఇటు నటన.. అటు యాక్షన్.. రెండూ సమ పాళ్ళలో రంగరించి అభిమానుల్ని రెట్టింపు చేసుకున్నాడు ప్రభాస్. ఇక్కడితో ఆగిపోలేదు.. వెంటనే కాజల్ తోనే మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా చేశాడు. దీంతో తెలుగు తెరకు పర్ఫెక్ట్ హీరో గా రికార్డు సృష్టించాడు. అభిమానుల్ని డార్లింగ్ లుగా మార్చేసుకున్నాడు. అయితే, చిన్న మిస్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. రెబల్ అనే సినిమా చేశాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ కి చాలా నష్టం చేసింది. అయినా ఆ నష్టం నుంచి సునామీ కెరటంలా బాక్సాఫీసు మీద విరుచుకు పడ్డాడు ప్రభాస్. రచయితగా ఉన్న కొరటాల శివను దర్శకుడ్ని చేస్తూ.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై స్వంతంగా స్నేహితులతో కల్సి మిర్చి సినిమా చేశాడు. ఇది బాక్సాఫీసుకు ప్రభాస్ రేంజి ఘాటును చూపించింది. ప్రభాస్ ఎంత వైవిధ్యమైన నటుడో పూర్తిగా ఎలివేట్ చేసింది ఈ సినిమా.

మిర్చిలాంటి సక్సెస్ ఫుల్ సినిమా వచ్చిన వెంటనే ఏ హీరో అయినా వరుసగా రెండు మూడు సినిమాలు చేసేసి తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం రాజమౌళి తో బాహుబలికి కమిట్ అయ్యాడు. ఇక్కడే ప్రభాస్ ఎంత పెర్ఫేక్తో కనిపిస్తుంది. ఆ కమిట్ మెంట్ ఇప్పుడు జాతీయస్థాయి నటుడిగా ప్రభాస్ ను నిలబెట్టింది. అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది. ఎంత గుర్తింపు అంటే.. మహా మహులైన ఏ దక్షిణాది నటులకూ అందని ఘనత తొలిసారిగా అందుకున్నాడు ప్రభాస్ప్ర. తిష్టాత్మక మేడమ్ టుసార్డ్ మ్యూజియంలో మొట్టమొదటి దక్షిణాది నటుని మైనపు బొమ్మ ప్రభాస్ దే!

ఎంత పడినా.. ఎంత లేచినా.. తన వాళ్లకు మిస్టర్ పెర్ఫెక్ట్! సినిమా పై మోజుతో.. సినిమాని ప్రేమించే వాడిగా.. అభిమానుల హృదయాల్లో డార్లింగ్! ఇంకా మరిన్ని చరిత్రలు సృష్టిస్తాడనడం లో ఏ మాత్రం సందేహం లేదు. పుట్టినరోజు జరుపుకుంటున్న డార్లింగ్ ప్రభాస్ కి జేజేలు!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories