అక్క బాటలోనే చెల్లి.. తనకూ తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందన్న ఖుషీ కపూర్

Khushi Kapoor Speaks About Janhvi Kapoor Wedding Plans
x

అక్క బాటలోనే చెల్లి.. తనకూ తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందన్న ఖుషీ కపూర్

Highlights

జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ కూతుర్లుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పలు సినిమాల్లో నటిస్తున్నారు.

Khushi Kapoor: జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ కూతుర్లుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పలు సినిమాల్లో నటిస్తున్నారు. మొదట హిందీలో సినిమాలు చేసిన జాన్వీ ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్దమవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

తనకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని జాన్వీ చెప్పారు. భర్తకు సేవ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తిరుపతిలోనే గడపాలని ఉందని అన్నారు. అయితే తాజాగా జాన్వీ కామెంట్స్ పై ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ స్పందించారు. తన తాజా సినిమా లవ్ యాపా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన అక్క జాన్వీ కపూర్ కామెంట్స్ పై కూడా స్పందించారు.

గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని తనకూ చిన్నప్పటి నుంచి ఉన్న కల అన్నారు. తన అక్క జాన్వీ చెప్పినట్టు తనకు కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు. తాను ముంబాయికి చెందిన అమ్మాయినని పెళ్లి తర్వాత తన తండ్రి బోనీ కపూర్ తమతోనే ఉండాలని కోరుకుంటానన్నారు. తాము ఉండే బిల్డింగ్‌లోనే తన తండ్రి ఉండాలన్నారు. తాను, తన భర్త, తన ఇద్దరు పిల్లలు, తన పెంపుడు కుక్కలు ఇలా జీవితాన్ని ఊహించుకుంటానని అన్నారు. జాన్వీలాగే మీరు మీ భర్త తలకు మసాజ్ చేస్తూ సేవ చేస్తారా అని అడగ్గా.. తాను అలాంటి సేవలు చేయనని ఖుషీ సరదాగా సమాధానమిచ్చారు. చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లల్లో తాను ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తానని చెప్పారు ఖుషీ.

ప్రస్తుతం జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి మాటలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ అక్కా, చెల్లెళ్లు ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పడంతో తమలోని భక్తిని చాటుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

2023లో ది ఆర్చిస్‌తో హీరోయిన్‌గా ఖుషీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు లవ్ యాపా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రం లవ్ టుడే. ఈ చిత్రానికి రీమేక్ గా వస్తున్న లవ్ యాపా సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

ఇక దేవర సినిమాతో జాన్వీ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఆర్సీ 16లో నటించబోతున్నారు. ఇక సినిమాను దసరా వరకు పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories