Top
logo

ఆ షో నాగబాబుకు తలనొప్పిగా మారిందా?

ఆ షో నాగబాబుకు తలనొప్పిగా మారిందా?Adirindi representational image (screenshot of adirindi youtube video)
Highlights

ఏడేళ్ల అనుబంధాన్ని వదిలిపెట్టేశారు..తనకెంతో పేరు తెచ్చిన కార్యక్రమం వద్దనుకున్నారు..కారణాలేమైనా కానీ, పక్కకు...

ఏడేళ్ల అనుబంధాన్ని వదిలిపెట్టేశారు..తనకెంతో పేరు తెచ్చిన కార్యక్రమం వద్దనుకున్నారు..కారణాలేమైనా కానీ, పక్కకు తోలిగిపోయారు. తనతో పాటూ సంస్థలోని కొంత మందినీ తీసుకుని వచ్చేశారు. అక్కడ నుంచి కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఆ హడావుడిలో పాత సంస్థ పైన లెక్కలేనన్ని ఆరోపణలూ చేశారు. ఇప్పుడు కొత్తగా వెళ్ళిన చోట పరిస్థితి ఆశావహంగా లేదు. మరిప్పుడు ఏం చేయాలి? కొత్తదాన్ని అక్కడితో వదిలేయాలా? కొన్నాళ్ళు వేచి చూడాలా? వదిలేస్తే తనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? వేచి చూస్తే కరిగిపోయే కాలంతో పాటూ ఆ ప్రయాణంలో ముందు ముందు మరిన్ని ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏమిటి? ఇదంతా నాగబాబు గురించే. అవును.. జబర్దస్త్ ను వదిలేసి..అదిరింది అంటూ కొత్త బాట పట్టినా.. అక్కడ ఎదురవుతున్న సవాళ్లు నాగబాబును పునరాలోచనలో పడేసిందని అనుకుంటున్నారు.

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు నేతృత్వంలో అదిరింది షో ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. నాలుగు ఎపిసోడ్ లు ప్రసారమూ అయ్యాయి. కానీ, ఒక్క ఎపిసోడ్ కూడా జబర్దస్త్ దరిదాపుల్లోకి పోలేదు. కనీసం యూ ట్యూబ్ లో కూడా అనుకున్న స్పందన దొరకలేదు. ఇదీ అదిరింది పరిస్థితి. నాగబాబు జబర్దస్త్ లో ఉన్నపుడు జస్ట్ అలా వెళ్లి.. న్యాయనిర్ణేతగా నాలుగు నవ్వులు నవ్వేసి.. రెండు పంచ్ లు పేల్చేసి వచ్చేస్తే సరిపోయేది. కానీ, జబర్దస్త్ ను వదిలేసి, అదిరింది షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ షో సక్సెస్ ఫెయిల్యూర్ లలో కచ్చితంగా ఆయనకు సంబంధం ఉన్నట్టే. బాధ్యత మరింత ఎక్కువే అయింది.

జబర్దస్త్ షో నిర్వాహకులకు ఏడేళ్ళ అనుభవం వుంది. కామెడీ షో నిర్వహణలో అన్ని రకాల ఎత్తు పల్లాలనూ వాళ్ళు చూసేశారు. అదిరింది షో నిర్వాహకులకు ఇటువంటి షో లపై అంత అవగాహానా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే, మక్కీకి మక్కీ..జబర్దస్త్ లానే ఉన్న సెట్.. అదే రకమైన పెట్రాన్ తీసుకున్నారు. జబర్దస్త్ క్వాలిటీ అదిరింది సెట్లలో కనిపించడం లేదు. ఇక జబర్దస్త్ షో ఆడియో, వీడియో క్వాలిటీ ముందు అదిరింది షో క్వాలిటీ వెలవెల బోతోందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు..

కంటెంట్ విషయంలో జబర్దస్త్ స్కిట్ లనుంచి ప్రేరణ పొంది చేసిన స్కిట్ ల లా ఉన్నాయి తప్పితే కొత్తదనం దాదాపుగా శూన్యం. అదీకాకుండా, అదిరింది షో సమయంలోనే జబర్దాస్త్ పాత స్కిట్లను రీ ఎడిట్ చేసి యాడ్స్ లేకుండా ప్రసారం చేస్తున్నారు. ఒకసారి చూసిన కంటెంట్ అయినా కానీ, జబర్దస్త్ స్కిట్లకు ఉన్న ఆదరణ వేరు. వాటిని చూడడం అలవాటు పడిన ప్రేక్షకులు అదిరింది షో కు షిఫ్ట్ కావడం కష్టంగా మారిందని చెప్పాలి. జబర్దస్త్ షో లాంటి షో తో పోటీపడాలంటే, సాధారణ కంటెంట్ సరిపోదు. కానీ అదిరింది స్కిట్లు చాలా సాదా సీదాగా వున్నాయని టీవీల ముందు కూచున్న వాళ్ళ అభిప్రాయం..

ఇప్పడు ఇదంతా నాగబాబుకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. అదిరింది షో నాలుగు వారాలు దాటినా గాడిన పడకపోవడం ఆయనకు ఆందోళన కలిగిస్తోందని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అదిరింది షో వదిలేయాలని నాగబాబు అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాల దృష్ట్యా జనసేన పార్టీలో కీలకంగా నిలవాల్సిన అవసరం కూడా నాగబాబుకు కలిగింది. ఈ షో ల వలన ఆంధ్ర రాజకీయాల్లో జనసేన తరపున వెళ్లి పాల్గొనే అవకాశమూ పోతోంది. దీంతో అదిరింది షో కు కాస్త విరామమివ్వలనీ, వీలైతే పూర్తిగా వదిలేయాలనీ నాగబాబు భావిస్తున్నట్టు సమాచారం.

అయినా..ఒక సూపర్ హిట్ సినిమాని చూసి దాని లాంటి మరో సినిమా తీయాలంటే.. అంతకంటే మంచి కథా..కథనం..నటీనటులు..దర్శక నిపుణుల వంటివి కావాలి గానీ.. అదే హిట్టు సినిమా కథను పట్టుకుని.. అందులోంచి పుట్టుకొచ్చిన నటుల్ని పక్కన పెట్టుకుని.. మళ్ళీ సినిమా తీస్తే ఎవరు చూస్తారండీ.. మరి నాగబాబు ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారో..అని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తమ్మీద అదిరింది షో పై అప్పుడే ఇబ్బందికర వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరిప్పుడు నాగబాబు ఏం చేస్తారో.. అయన అదిరింది వదిలేసి జనసేన అంటూ వెళ్ళిపోతే.. ఆయనను నమ్ముక్ని వచ్చిన ఆర్టిస్టుల మాటేమిటి? (అన్నట్టు ఆ ఆరిస్టులు నాగబాబును నమ్ముకుని వచ్చారా? వారిని నమ్ముకుని నాగబాబు వెళ్ళరా?) ఏమో ఎన్నో అనుమానాలు..అన్నీ కాలం తీర్చాల్సిందే!

Web TitleIs Nagababu struggling with adirindi show
Next Story


లైవ్ టీవి