Imanvi: ఇమాన్వికి ప్రభాస్ ఇంటి భోజనం .. ఆమె రిప్లై ఏంటో తెలుసా?

Imanvi Tastes Prabhas Home Food
x

ఇమాన్వికి ప్రభాస్ ఇంటి భోజనం .. ఆమె రిప్లై ఏంటో తెలుసా?

Highlights

హీరో ప్రభాస్ భోజన ప్రియుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్‌లో ఉంటే అక్కడ ఉన్న వారందరికీ ప్రభాస్ ఇంటి నుంచే భోజనం వస్తోంది.

Imanvi: హీరో ప్రభాస్ భోజన ప్రియుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్‌లో ఉంటే అక్కడ ఉన్న వారందరికీ ప్రభాస్ ఇంటి నుంచే భోజనం వస్తోంది. ఈ విషయం పలు సందర్భాల్లో చాలామంది చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ కొత్త హీరోయిన్ ఇమాన్వికి తన ఇంటి వంటను రుచి చూపించారు. ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన ఇమాన్వి తన ఇన్‌స్టా వేదికగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.

ప్రభాస్ ఇంటి నుంచి చికెన్ ఫ్రై, చేపల కర్రీ సహా పలు రకాల వంటకాలతో ఇమాన్వికి బాహుబలి భోజనం పంపించారు. అయితే వాటన్నింటిని టేబుల్‌పై ఉంచిన ఇమాన్వి ఆ వీడియోను షేర్ చేస్తూ "రుచికరమైన మంచితనానికి ధన్యవాదాలు ప్రభాస్" అని క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేశారు. ఇమాన్వి ఇన్‌స్టా పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్... "మా హీరో ఆతిథ్యం అంటే అలా ఉంటుంది మరి" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రభాస్ సినిమా సెట్లో ఉన్న సమయంలో తన సహోద్యోగులకు రుచికరమైన, విలాసవంతమైన భోజనం పెట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. తన గొప్ప ఆతిథ్యాన్ని రుచి చూపించడంలో ప్రభాస్‌కి సాటెవ్వరూ లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ ఇంటి భోజనానికి చాలామంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి కూడా ఆ జాబితాలో చేరిపోయారు.

ప్రభాస్‌తో హను రాఘవపూడి తెరకెక్కించనున్న ఫౌజీ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా ఆమె నెటిజన్లకు పరిచయమే. ఇన్‌స్టాలో ఆమె డ్యాన్స్ రీల్స్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఆమెకు సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమానే ఆమెకు తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం.

ఇక ఫౌజీ సినిమా విషయానికొస్తే.. 1970ల నాటి వార్ పీరియాడ్ డ్రామాగా రూపొందుతోంది. రజాకార్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories