సినీ పరిశ్రమలో దుమారం లేపుతున్న డ్రగ్స్ లింకులు

సినీ పరిశ్రమలో దుమారం లేపుతున్న డ్రగ్స్ లింకులు
x
Highlights

నిశ్శబ్దంగా ఆశలూ ఆకాంక్షల పీక నులిమి జాతి భవితను డ్రగ్స్‌ కుళ్లబొడుస్తోంది. వినాశకర మత్తు రక్కసి తన సహస్ర బాహువులతో మూలమూలలకు...

నిశ్శబ్దంగా ఆశలూ ఆకాంక్షల పీక నులిమి జాతి భవితను డ్రగ్స్‌ కుళ్లబొడుస్తోంది. వినాశకర మత్తు రక్కసి తన సహస్ర బాహువులతో మూలమూలలకు చొచ్చుకుపోతుంది. ఎక్కడికక్కడ తన ఉనికిని చాటుతూ కలకలం సృష్టిస్తోంది. తాజాగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ తుపాను పెనుకల్లోలం రేపుతోంది. వెండితెరపై మత్తుమరకలు పడటం గతంలో చూశాం ఆ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

గతంలో పెను సంచలనంగా మారి నీరుగారిపోయిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీనే కుదిపేస్తుంది. డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతున్నట్లు రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు విచారణలో బయటపతుండటం కలకలం రేపుతోంది. సంజయ్ దత్ కేసు నుంచి ఇప్పటి సుశాంత్ సింగ్ కేసు వరకు సినీ ఇండస్ట్రీ కి డ్రగ్స్ కేసులతో లింకులు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అయితే ఈ డ్రగ్స్ లోనూ చాలా రకాలుంటాయి. మొక్కల నుంచి లభించే పధార్థాలతో తయారయ్యే నార్కోటిక్ సబ్ స్టాన్కస్, ప్రయోగశాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్ సబ్ స్టాన్సస్, ఓపియం, కొకైన్ లతో పాటు గంజాయి నుంచి ఉత్పత్తి చేసే చెరస్, హఫీష్, ఓపియం, బ్రౌన్ షుగర్, హెరాయిన్ ఇవన్నీ నార్కోటిక్ కిందికి వస్తాయి. ఇక ఇవే కాకుండా కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్ మత్తుకోసం వాడే సైకోట్రోపిక్స్ కోవకు చెందుతాయి. అయితే సినీ ఇండస్ట్రీలో గాంజ, చెరస్, కొకైన్‌ను విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. డగ్స్ బిజినెస్ కు గోవా కేరాఫ్ కాగా ముంబై, ఢిల్లీ, ఛంఢీఘడ్ లు కేంద్రంగా కొందరు డీలర్లు డ్రగ్స్ సప్లైలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సుశాంత్ సింగ్ కేసులోనూ ఓ నైజీరియన్ పట్టుబడటమే కాకుండా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు కీలకమైన సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్‌ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్‌ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. చాలా మంది తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. క్షణకాలం సంతోషం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేస్తుంది. విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ డ్రగ్స్‌ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటోంది. మొత్తంగా సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు సినీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories