ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ దీపికా పదుకోణే!

K V D Varma
Published on: 29 Feb 2020 8:04 PM IST
ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ దీపికా పదుకోణే!
X
Deepika in Prabhas next (file image)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21 వ సినిమా పై రోజుకో వార్త ఆసక్తిని కలిగించేలా బయటకు వస్తోంది. ఎవరి అంచనాలకు అందని విధంగా అశ్వనీదత్ వైజయంతి బ్యానర్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని ప్రకటించినప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అందులోనూ రెండంటే రెండు సినిమాల అనుభవం అదీ.. క్లాసికల్ సినిమాలు చేసిన దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ అనగానే అందరిలోనూ ఒకింత ఆశ్చర్యం కనిపించింది. అయితే, ప్రభాస్ అనుభవం లేని దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసిన విషయం తెలిసిన వారు మాత్రం దీనికి పెద్దగా ఆశ్చర్య పడలేదు.

దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. చందమామ కథలాంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతందట. ఈ ఏడాది చివర్లో సినిమా లాంచ్ చేసి వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మహానటి విడుదల సమయంలోనే పాతాళ భైరవి తరహాలోనే మంత్రాలూ, మాయలూ అన్నీ ఉండే ఒక అందమైన కల్పిత కథను చెప్పాలని అనుకుంటున్నట్లు చెప్పిన నాగ్ అశ్విన్, అందుకు తగ్గట్టుగానే కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథను ప్రభాస్ కు వినిపించిన వెంటనే మరోమాట లేకుండా సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారట ప్రభాస్. ఆయనను కథ అంత ఇంప్రెస్ చేసిందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఈ సినిమాలో ప్రభాస్ సరసన కనిపించాబోతున్నట్టు టాలీవుడ్ టాక్. పాన్ ఇండియా సినిమాగా..బహు భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా హీరోయిన్ అయితే, బాలీవుడ్ లో ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావించినట్టు సమాచారం. ఈ సినిమాకి దీపికా ను కానీ, ప్రియాంక చోప్రాను కానీ తీసుకోవాలని నాగ అశ్విన్ మొదటినుంచీ ప్రయత్నిస్తున్నారట. అయితే, దీపికా పేరు చివరకు ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు నిజమైతే ప్రభాస్ సినిమాలో దీపికా హీరోయిన్ గా సినిమాకి మరింత హైప్ రావడం ఖాయం. దీపికాకు బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ అభిమానులు ఎక్కువే. ఇది సినిమాకు ప్లస్ అవుతుందని భావించవచ్చు.

K V D Varma

K V D Varma

Next Story