హేమకు బిగ్‌బాస్‌ షాక్!

హేమకు బిగ్‌బాస్‌ షాక్!
x
Highlights

రెండోరోజే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లతో ఎలా ఆడుకుంటాడో చూపించాడు. పైకి ఎత్తి కింద పాడేయడంలో బిగ్‌బాస్‌ గేమ్ ఎలా వుంటుందో అందరికీ రుచి చూపించాడు....

రెండోరోజే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లతో ఎలా ఆడుకుంటాడో చూపించాడు. పైకి ఎత్తి కింద పాడేయడంలో బిగ్‌బాస్‌ గేమ్ ఎలా వుంటుందో అందరికీ రుచి చూపించాడు. మొదటిరోజు హేమను కెప్టెన్ గా చేసేలా కంటెస్టెంట్‌ లకి పరిస్థితులు కల్పించిన బిగ్‌బాస్‌ వారితోనే హేమను ఎలిమినేషన్ కి నామినేట్ చేయించాడు. ఇదీ బిగ్‌బాస్‌ మజా అంటే..

సింపుల్ గా బిగ్‌బాస్‌ 3 సీజన్ రెండో రోజు జరిగిందిదే.. మొదటిరోజు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఆరుగురిలో ఐదుగురిని మిగిలిన వాళ్ళతో (కెప్టెన్ గా ఉన్న హేమను తప్పించి) రీప్లేస్ చేసుకోవచ్చనీ..దానికి న్యాయనిర్నేత హేమ అనీ, ఆమె ఈ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అనీ చెప్పాడు బిగ్‌బాస్‌. రాహుల్ కు మొదటి అవకాశం వచ్చింది. తీన్మార్ సావిత్రిని తనకు బదులుగా రీప్లేస్ చేయాలని కోరాడతాను. దానికి రాహుల్ చెప్పిన కారణాలు సరిగాలేవంటూ తిరస్కరించింది హేమ. తరువాత వంతు వరుణ్‌ సందేశ్‌ ది. అతను వచ్చి.. పునర్నవిని నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పాడు. దానికి హేమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆపై వితికా షెరు వచ్చి.. అషూ రెడ్డిని నామినేట్ చేస్తున్నానంది. దీనికి హేమ ఒప్పుకోలేదు. సో వితిక నామినేటెడ్ లిస్టులో ఉండిపోయింది.

ఇప్పటివరకూ షో సాఫీగా చక్కగా సాగింది. నాలుగో నామినేషన్ వచ్చేటప్పటికి పటాస్ మోగింది. అదేనండీ.. శ్రీముఖి వంతు వచ్చింది. తన స్టైల్ లో హిమజను నామినేట్ చేసింది. మరి కారణం చెప్పాలికదా.. ఇక్కడ హేమను ఇరికించింది. హేమ హిమజకు ఇచ్చిన రెడ్ మార్క్ కారణంగానే తనని నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. అంతే.. హిమజకు.. శ్రీముఖికి మధ్య వాదోపవాదాలు.. ఎమోషనల్ సీన్లు నడిచిపోయాయి. చివరకు శ్రీముఖిని సేవ్ చేస్తూ హేమ నిర్ణయం తీసుకుంది. ఇక ఐదో ప్లేస్ లో జాఫర్ వచ్చాడు. తనకు బదులుగా మహేష్‌ విట్టాను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి కారణాలు సరిగా చెప్పలేకపోయాడు. అయితే, ఇక్కడ మహేష్ విట్టా తాను హౌస్ లో ఉంటే ఏవిధంగా అందరినీ ఎంటర్టైన్ చేయగలనో వివరించాడు. దీంతో హేమ జాఫర్ తో ఏకీభవించలేదు. జాఫర్ నామినేషన్ లో మిగిలిపోయాడు.

ఇక్కడితో ఐదుగురు ఎవరెవరు నామినేట్ అయ్యారో తేలిపోయింది. వారెవరెవరంటే .. రాహుల్, పునర్నవి, వితిక షేరు, హిమజ, జాఫర్. ఇక మిగిలింది బాబా భాస్కర్. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపు బిగ్‌బాస్‌ హౌస్ మేట్స్ కొందరితో కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడాడు. తరువాత బాబా భాస్కర్ నామినేషన్ విషయం ప్రస్తావన వచ్చింది. అక్కడిచ్చాడు బిగ్‌బాస్‌ ట్విస్ట్. బాబా భాస్కర్.. హేమలను స్వైప్ చేయాలని చెప్పాడు. అంటే.. భాస్కర్ హౌస్ లో ఉండాలనుకుంటున్నారా.. హేమ హౌస్ లో ఉండాలనుకుంటున్నారా అనేది హౌస్ మేట్స్ అందరూ కలసి డిసైడ్ చేసుకుని, చెప్పాలన్నాడు. దీంతో హౌస్ మొత్తం సైలెంట్ అయిపొయింది. కొద్ది సేపటి తరువాత అందరూ చర్చించుకుని నిర్ణయం శ్రీముఖితో చెప్పించారు. అది హేమను నామినేట్ చేస్తున్నట్టుగా.. ఇదీ బిగ్‌బాస్‌ ఆటలోని అసలు కోణం. దీంతో హేమ షాక్ అయింది. ఇక మరి మూడోరోజు అసలు హేమను ఎందుకు నామినేట్ చేశారు.. బాబా భాస్కర్ ను ఎందుకు సేవ్ చేశారు? ఇక నామినేట్ అయినవాళ్లలో సేవ్ అయ్యేది ఎవరు? అన్నట్టు మూడోరోజు టాస్క్ కూడా ఉంటుంది.. ఇవన్నీ చూడడానికి సిద్ధం అయిపోండి మరి..

రెండోరోజు ఎలావుందంటే..

బిగ్‌బాస్‌ హౌస్ లో రెండోరోజే కామెడీ..యాక్షన్..ఎమోషన్..ట్విస్ట్ లతో ఓ తెలుగు సినిమా కనిపించింది. పర్టిసిపెంట్స్ ఒక్కొక్కరి లోనూ ఉన్న అసలు కోణాలను బయటకు తీయడానికి తెరలేపినట్టుంది. హిమజ అందరికంటే ముందు నిద్రలేచి హౌస్ క్లీన్ చేస్తున్న దృశ్యాలు ప్రధానంగా షో ప్రారంభం లోనే చూపించారు. అప్పుడు ఎవరూ అంచనా వేయలేదు ఆ సీన్ చుట్టూ మూడోరోజు కథ నడుస్తుందని. దానితో పాటు బాబా భాస్కర్ అందరికీ దిష్టి తీస్తూ చేసిన కామెడీతో షో సందడి మొదలైంది. ఇక వరుసగా నామినేషన్ ల విషయంలో డ్రామా నడిచింది. వరుణ్ సందేశ్, వితికా షేరు ఇద్దరూ ఎవరిని నామినేట్ చేస్తే బావుంటుంది అని చర్చించుకోవడం.. చివరికి ఒకరు సేవ్ అయి, ఒకరు నామినేటెడ్ జోన్ లో ఉండిపోవడం జరిగింది. ఇక అసలు ఎపిసోడ్ మాత్రం హిమజ..శ్రీముఖిల మధ్య జరిగిందే. ఇది చాలా ఎమోషనల్ గా మారిపోయింది. హిమజ పలుసార్లు కంటతడి పెట్టింది. శ్రీముఖి హిమజ ను నామినేట్ చేస్తూ, తనతో కలసి సినిమాను కూడా చేశానని, తన గురించి తెలుసని హిమజ తన లైఫ్‌లో అన్నీ లైట్‌గా తీసుకుంటుందని చెప్పింది. దీనికి హిమజ్..తన గురించి శ్రీముఖికి ఏం తెలుసని అన్నీ లైట్‌గా తీసుకుంటానని చెప్పిందంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖికి తాను కెరీర్‌పరంగానే తెలుసని, వ్యక్తిగతంగా తన గురించి ఆమెకు ఏం తెలుసని ప్రశ్నించింది. తానేదీ లైట్‌గా తీసుకోనని.. అందుకే తనపై ఉన్న రెడ్‌ మార్క్‌ను తొలగించుకునేందుకు ఉదయాన్నే లేచి పని చేశానని, ఆ సమయానికి ఎవరూ నిద్రలేవలేదని.. ఆ విషయం వేరే ఎవరూ చెప్పలేరని, అందుకే తానే హేమతో చెప్పానని, ఆ విషయంలో తప్పేముందంటూ ప్రశ్నించింది. అటు తరువాత బిగ్‌బాస్‌ కన్ఫెషన్ రూమ్ లో కూడా ఇదే విషయంపై కన్నీటిపర్యంతం అయింది హిమజ. ఇక చివరికి వచ్చేసరికి అటుతిరిగీ ఇటు తిరిగీ హేమ ఎలిమినేషన్స్ కి నామినేట్ అవడం అనుకోని విషయంగా మారింది. బహుశా హేమకి కూడా ఇది షాక్ అయివుంటుంది. హౌస్ లో అందరూ తనని ఎందుకు వ్యతిరేకించారో అర్థం అయి ఉండకపోవచ్చు. ఫైర్ బ్రాండ్ గా బయట కనిపించే హేమ.. హౌస్ లో మాత్రం అందుకు విరుద్ధంగా కనిపించడాన్నిహౌస్ మేట్స్ బహుశా గేమ్ ప్లాన్ గా భావించి ఉండవచ్చు. మొదటి రోజు ఎంతో ప్రేమగా ఉన్న అందరూ బాబా భాస్కర్ ని రక్షించడానికి తనని నామినేట్ చేయడం హేమకు కొంచెం కష్టం కలిగించి ఉండవచ్చనడంలో సందేహం లేదు.

మొత్తమ్మీద ఆరుగురు ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. ఆ ఒక్కరు ఎవరనేది మరో మూడు రోజులు ఓపిక పట్టాల్సిందే. షో చూస్తూ బిగ్‌బాస్‌ హౌస్ మేట్స్ తో కలసి మనమూ జర్నీ చేయాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories