మెగా సినీ ప్రస్థానానికి 41 ఏళ్లు!

మెగా సినీ ప్రస్థానానికి 41 ఏళ్లు!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాది రాళ్ళు. అయితే, విడుదలైన మొదటి చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఆ సినిమా సెప్టెంబర్, 22, 1978 లో విడుదలైంది. అది విడుదలై ఈరోజుతో 41 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

శివ శంకర వరప్రసాద్ గా తెలుగు చిత్ర సీమలోకి పునాదిరాయి వేసుకుని .. అందరివాడుగా అభిమాన ధనంతో సినీ వినీలాకాశంలో మెగా నక్షత్రంగా మెరుస్తున్న చిరంజీవి తన సినీజీవితంలో 41 సంవత్సరాలు ఈరోజుతో పూర్తి చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే రోజు 1978 లో చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయన పునాదిరాళ్ళు సినిమాలో మొదటి సారి నటించినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది.

అక్కడ నుంచి ఇంతై వటుడింతై అన్నట్టుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా ఎదిగారు చిరంజీవి. అయన నట జీవితం గురించి ఎన్ని విశేషాలు ఎన్ని రకాలుగా చెప్పుకున్న తరగవు. 150 సినిమాల్లో నటించి 151 వ సినిమాగా ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా నిర్మితమైన చిత్రం సైరా తొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిరంజీవి. అయన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో రికార్డులు, రివార్డులకు కొదువ లేదు. ముఖ్యంగా 90వ దశకంలో తెలుగు సినిమాలో నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకూ ఆయనే అని చెప్పుకునేవారు. ఎవరైనా సరే 11 వ స్థానం గురించే ఆలోచించాలి అని అయన సహనటులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు చిరంజీవి లోని నటుడి గురించి ఇంకో మాట చెప్పే అవసరం లేకుండా చేస్తాయి.

ప్రాణం ఖరీదు నుంచి సైరా వరకూ చిరంజీవి నట జీవితంలో ఎన్నో హిట్లు.. సూపర్ హిట్లు ఉన్నాయి. కమర్షియల్ హీరోగా ఎంత ఉధృతంగా అభిమానులను సంపాదించుకున్నా.. తనలోని నటనా తృష్ట తీర్చుకోవడానికి కె.విశ్వనాద్, జంధ్యాల, భారతీరాజా వంటి క్లాసిక్ డైరెక్టర్ల సినిమాల్లో నటించడానికి వెనుకడుగు వేయలేదు. ఇంకా చెప్పాలంటే ఇమేజీ చట్రాన్ని బద్దలు కొట్టాలని అవకాశం దొరికిన ప్రతిసారీ ప్రయత్నించారు. ఆ కోవలోనే స్వయంకృషి, ఆపద్భాందవుడు, ఆరాధన, రుద్రవీణ, చంటబ్బాయ్ వంటి సినిమాలు చేశారు. మాస్ హీరో ఇమేజీ ఆకాశమంత ఎత్తుగా ఉన్న తరుణంలో ఆఫ్ బీట్ వంటి సినిమాలు చేయడానికి ఎక్కడా చిరంజీవి సందేహించలేదు. నిజానికి చిరంజీవి లోని నటుడిని మాస్ ఇమేజి డామినేట్ చేసిందని చెప్పవచ్చు. చిరంజీవి తొలినాళ్ళలో చేసిన మనవూరి పాండవులు, పున్నమినాగు, ఊరికిచ్చినమాట, చట్టానికి కళ్లులేవు, న్యాయం కావాలి, మంచుపల్లకి, పట్నం వచ్చిన పతివ్రతలు, శుభలేఖ, అభిలాష, చాలెంజ్ వంటి సినిమాలు అయన లోని అద్భుతమైన నటుడిని మనకు ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయి. కానీ, ఖైదీ తరువాత అయన ఇమేజీ చట్రం లో చిక్కుకుపోయారు. అయినప్పటికీ.. ఆ ఇమేజీ చట్రంలో కూడా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి నిత్యం తపించారు. అందులో భాగంగా వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయి ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టాయి.

ఎత్తూపల్ల్లాలు ఎన్నున్నా చిరంజీవి నటుడిగా మాత్రం ఎప్పుడూ ఆకాశం అంత ఎత్తులోనే ఉంటారు. అయన చలన చిత్ర జీవితంలో 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ వర్గాలు ఆయనకు శుభాకాంక్షలు అందించాయి. అయన అభిమానులు అయితే, సోషల్ మీడియాలో అయన నటించిన సినిమా విశేషాల్ని పంచుకుంటూ పండగ చేసుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories