Health Tips: వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Health Tips
x

Health Tips: వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Highlights

Health Tips: వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి.

Health Tips: వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి. వీటి వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మొదలైన వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. వర్షంలో చలి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా కలరా, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. తేమ పెరగడం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బయటి ఆహారాన్ని నివారించండి

రోడ్డు పక్కన చాట్స్, సలాడ్లు చాలా ఆకర్షణీయంగా ఉండవచ్చు కానీ వాటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా వంటి వ్యాధులు వస్తాయి. ఈ ఆహారాలు ఆరోగ్యానికి మంచివి కావు. అంతేకాకుండా ఇవి పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. అలాగే, వాతావరణం తడిగా లేదా తేమగా ఉన్నప్పుడు బహిరంగంగా ఉంచిన ఆహారాలు సూక్ష్మక్రిములు, పురుగులకు మంచి సంతానోత్పత్తి ప్రదేశంగా మారతాయి. కాబట్టి, వర్షాకాలంలో బయట ఫుడ్స్ అస్సలు తినకండి. ఇంటి భోజనం తింటూ ఆరోగ్యంగా ఉండండి.

ఆయిల్ ఫుడ్ & సీ ఫుడ్ మానుకోండి

తేమ కారణంగా మన జీర్ణక్రియ మందగిస్తుంది. దీని వలన కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. సమోసాలు, పకోడీలు వంటివి తినడం వల్ల ఇప్పటికే బలహీనమైన జీర్ణవ్యవస్థపై మరింత ప్రభావం ఉంటుంది. అలాగే, సముద్ర ఆహారం విషయానికి వస్తే వర్షాకాలం సాధారణంగా చేపలు, ఇతర నీటి జీవులకు సంతానోత్పత్తి కాలం. దీని కారణంగా తాజా చేపలు దొరకడం కష్టం. అందువల్ల, పాత చేపలను తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

హైడ్రేటెడ్ గా ఉండండి

విష పదార్థాలను బయటకు పంపడానికి, మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి నీరు ఎక్కువగా తాగండి. వర్షాకాలం.. కలరా, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు సీజన్ కాబట్టి సురక్షితమైన, శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగండి. అవసరమైతే నీటిని మరిగించి తాగండి. ఐస్డ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం కూడా మంచిది. కార్బోనేటేడ్ పానీయాలు తాగడం వల్ల మీ శరీరంలోని ఖనిజాల పరిమాణం తగ్గుతుంది. తద్వారా మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బదులుగా, ఒక కప్పు గ్రీన్ టీ లేదా అల్లం టీని ఆస్వాదించండి. ఇది ఆరోగ్యకరమైనది.

వ్యక్తిగత పరిశుభ్రత

భోజనానికి ముందు మీ చేతులను బాగా కడుక్కోండి. వర్షంలో తడిసినప్పుడల్లా వెంటనే స్నానం చేయండి. ఈ కాలంలో బూట్లు ధరించడం మంచిది. అలాగే, అదనపు నూనెను తొలగించడానికి మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నివారించడానికి పగటిపూట మీ ముఖాన్ని క్రమం తప్పకుండా కడగడం మర్చిపోవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories