పెనుకొండలో అంతుచిక్కని ఓటరు నాడి...పెనుకొండ ఈసారి ఎవరికి అండ?

పెనుకొండలో అంతుచిక్కని ఓటరు నాడి...పెనుకొండ ఈసారి ఎవరికి అండ?
x
Highlights

పెనుకొండ విజయనగర సామ్రాజ్య కోశాగారంగా విరాజిల్లిన క్షేత్రం. అచ్యుతరాయల రెండో రాజధానిగా వర్ధిల్లిన ప్రాంతం. రాయల రాజసానికీ, నాటి చారిత్రక కట్టడాలకూ...

పెనుకొండ విజయనగర సామ్రాజ్య కోశాగారంగా విరాజిల్లిన క్షేత్రం. అచ్యుతరాయల రెండో రాజధానిగా వర్ధిల్లిన ప్రాంతం. రాయల రాజసానికీ, నాటి చారిత్రక కట్టడాలకూ నెలవైన కోట. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన, బాబయ్య దర్గా ఉన్న పుణ్యక్షేత్రం. రాయల కోటలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరబోతోంది పెనుకొండ ప్రజలు ఎవరిని ఆదరించారు ఎవరిని పక్కనపెట్టారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోకజవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. విజయనగర రాజుల కాలంలో పెనుకొండ కోశాగారంగా ఉందని చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయల అనంతరం వచ్చిన అచ్యుత రాయలు పెనుకొండను రెండో రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న పెనుకొండలో జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎలాగైనా కోటపై ఈసారి జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్‌ సీపీ, టీడీపీ తలపడ్డాయి. అంతిమంగా ఎవరు విజేత కాబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.

పెనుకొండ నియోజకవర్గంలో పెనుకొండ, గోరంట్ల, సొమందెపల్లి, రొద్దం, పరిగి మండలాలున్నాయి. మొత్తం 2,20,383 మంది ఓటర్లు. అందులో పురుషులు 1,11,970 మంది, స్త్రీలు 1,08408 మంది, ఇతరులు ఐదుగురు. ఈ ఎన్నికల్లో 86.98 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 82.99 శాతం రికార్డయ్యింది. అంటే ఈసారి 3.99 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పోటీచేశారు. వైఎస్ఆర్ సీపీ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ బరిలో నిలిచారు. శంకరనారాయణపై పార్థసారథి 17,415 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాజాగా ఇద్దరూ మరోమారు తలపడ్డారు. ఇద్దరూ బీసీలే. కురుబ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ఆ వర్గానికి చెందిన ఓట్లు ఈసారి ఎవరికి పడ్డాయన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ ఆర్ సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో ఉండటం, అతనూ కురుబ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఈసారి నియోజకవర్గంలో శంకరనారాయణ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ఈసారి కూడా విజయం తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పెనుకొండ నుంచి బీకే పార్థసారథి విజయం సాధిస్తారని, హ్యాట్రిక్ విజయాలతో ముందుకు వెళతామని విశ్వాసంగా చెబుతున్నారు.

పెనుకొండలో ఎవరు గెలువబోతున్నారు ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టారు అన్న విషయంలో క్లారిటీ లేదు ఓటరు నాడి ఏంటన్నది అంతుచిక్కడం లేదు. గెలుపుపై ఎవరికి వారుపైకి ధీమా వ్యక్తం చేస్తున్నా, ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల్లో కొందరు ఆందోళనలో ఉన్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈసారి టీడీపీ తరఫున హిందూపురం నుంచి బరిలో నిలిచారు. గోరంట్ల మండలానికి చెందిన కిష్టప్ప పెనుకొండ నియోజకవర్గంలోనే ఉండడంతో టీడీపీ గెలుపుకు ఢోకా లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గతంలో 1994 నుంచి 2004 వరకూ జరిగిన ఎన్నికల్లోనూ అప్పటి టీడీపీ అభ్యర్థిగా పరిటాల రవీంద్ర ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో ఈసారి ఎవరు విజేత కాబోతున్నారు తొలిసారి రాయలవారి కోటలో వైసీపీ జెండా ఎగరనుందా టీడీపీకే మరోమారు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారా అన్నది ఉత్కంఠగా మారింది. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారన్నది మాత్రం సుస్పష్టం.

Show Full Article
Print Article
Next Story
More Stories