సంతనూతలపాడులో వైసీపీ కథేంటి?

సంతనూతలపాడులో వైసీపీ కథేంటి?
x
Highlights

మొన్నటి వరకూ కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్‌కు పెట్టని కోట. పసుపు జెండాకూ తిరుగులేని కోట. కమ్యూనిస్టులు పోయారు, కాంగ్రెస్‌ పడిపోయింది....

మొన్నటి వరకూ కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్‌కు పెట్టని కోట. పసుపు జెండాకూ తిరుగులేని కోట. కమ్యూనిస్టులు పోయారు, కాంగ్రెస్‌ పడిపోయింది. వీటి స్థానంలో వైసీపీ జెండా ఎగిరింది. అటు టీడీపీ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ కోటలో పాగా వేసేందుకు ఈ రెండు పార్టీలే సకల అస్త్రాలూ సంధించాయి. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా, పార్టీలో అసంతృప్తి స్వరాలు, అపశ్రుతి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎందుకా అపశ్రుతి?

ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఒక ఎత్తయితే సంతనూతలపాడు నియోజకవర్గం రాజకీయం మరొక ఎత్తు. కాకలు తీరిన పాలిటిక్స్‌కు నెలవు సంతనూతలపాడు. నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి కమ్యూనిస్టుల కంచుకోటగా గుర్తింపు తెచ్చుకుంది సంతనూతలపాడు. ఈ సెగ్మెంట్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చీమకుర్తి గ్రానైట్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌, రామతీర్థం జలాశయంతో పాటు సహజ సిద్దమైన ప్రకృతి వనరులున్నాయి. అయినా చెప్పుకోదగ్గ అభివృద్ధి మాత్రం జరగలేదు. ప్రధానగా నియోజకవర్గంలో రానురాను కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గి పోవడంతో టీడీపీ, కాంగ్రెస్‌లు, ఆ తర్వాత కాంగ్రెస్ స్థానంలో వైసీపీలు గణనీయంగా పుంజుకున్నాయి.

మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యే హోరాహోరి పోరు సాగింది. తెలుగుదేశం నుంచి బీఎన్‌.విజయ్‌కుమార్‌ పోటీలో నిలువగా, వైసీపీ నుంచి టీజేఆర్‌ సుధాకర్‌ బరిలో ఉన్నారు. ప్రచారపర్వంలో ఘాటు విమర్శలతో చెలరేగిపోయారు ఈ ఇద్దరు అభ్యర్థులు.

టీడీపీ అభ్యర్థి విజయకుమార్ నియోజకవర్గంలో ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలుపొందగా, మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి పోటీలో నిలిచారు. ప్రధానంగా సీనియర్ నేతగా, నియోజకవర్గంలో మంచి పట్టున్న లీడర్‌గా విజయ్ కుమార్‌కు గుర్తింపు ఉంది. అయితే నియోజకవర్గలోని నాలుగు మండలాల్లో విజయకుమార్‌కు వ్యతిరేకంగా పార్టీలోనే అసమ్మతి నేతలు సహాయనిరాకరణ చేశారన్నది స్థానికంగా చర్చ. ఈ ఎన్నికల్లో విజయకుమార్‌కు టిక్కెట్ కేటాయిస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్టామని తేల్చిచెప్పేశారు. ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం రంగంలోకి దిగడంతో అప్పటికప్పుడు సద్దుమణిగినా, అసంతృప్తి మాత్రం అలానే ఉంది. అది పోలింగ్‌లోనూ ప్రతిఫలించిందన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు వైసీపీ నుంచి సుధాకర్‌ ప్రచారాన్ని హోరెత్తించారు. నియోజకవర్గంలో పెద్దగా ముఖ పరిచయం లేకపోయినా, వైసీపీ నేతలందర్నీ కలుపుకుని ముందుకెళ్లారు. అయితే ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోవడం కొంత ఇబ్బంది కలిగిందని నేతలు చెబుతున్నారు. కేవలం బూచేపల్లి కుటుంబం అండతోనే సుధాకర్ ముందుకు సాగారు. జగన్‌పై జనం అభిమానం, నవరత్నాలే తమను గెలిపిస్తాయన్న ధీమా వైసీపీ అభ్యర్థిది. అటు టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ కూడా, ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories