వివేకా హత్య కేసులో ముగ్గురి అరెస్టు

వివేకా హత్య కేసులో ముగ్గురి అరెస్టు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా...

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా ముగ్గురిని నిందితులుగా చేర్చారు. వీరంతా వైఎస్ వివేకాకి సన్నిహితులు కావడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది.

ఈ నెల 15న దారుణహత్యకు గురైన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్‌‌ల పర్వం ప్రారంభమైంది. కేసులో వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డితో పాటు పీఏ కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య ఎవరు చేశారనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా హత్యానంతరం సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

ముగ్గురు నిందితులపై పోలీసులు వేర్వేరుగా అభియోగాలను నమోదు చేశారు. వివేకా హత్య విషయం తెలిసిన తరువాత బాత్‌రూంలో పడి ఉన్న మృతదేహాన్ని బెడ్‌పైకి చేర్చడం రక్తపు మరకలు తుడిచేయడం, ఆధారాలను చెరిపేయడంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇదే సమయంలో వివేకానంద హత్యపై ఫిర్యాదు చేసిన పీఏ కృష్ణారెడ్డి సంఘటనా స్థలంలో తనకు దొరికిన లేఖను పోలీసులకు ఇవ్వకపోవడంతో అరెస్ట్‌ చేశారు. కేసులో అత్యంత కీలకమైన సాక్షాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచినట్టు పీఏ కృష్ణారెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు.

వివేకా హత్య ప్రదేశంలో రక్తపు మరకలు కడగడంతో పాటు బెడ్‌రూంను శుభ్రం చేశారనే ఆరోపణలతో పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. అనంతరం వీరికి 12 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

మరో వైపు వివేకా హత్యపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేని స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించాలంటూ వైఎస్ జగన్‌తో పాటు , వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కోర్టును కోరారు. సిట్‌ పేరుతో తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కోర్టుకు విన్నవించారు. అయితే, చనిపోయిన వ్యక్తి మాజీ మంత్రి కావడంతో సిట్‌ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగే విచారణపై ఆరోపణలు చేయడం సరికాదంటూ వాదించారు.

కేసును వీలైనంత త్వరగా చేధించాలని భావిస్తున్న పోలీసులు తమ అదుపులో ఉన్న పలువురిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఇదే సమయంలో ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలను మాయం చేశారనే కోణంలో పోలీసులు ముగ్గురు నుంచి సమాచారం సేకరించారు. వీరిచ్చిన సమాచారంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories