Top
logo

క్లైమాక్స్‌కు చేరుకున్న పోల్‌ సినిమా...సర్వేలు ఏం చెబుతున్నాయి?

క్లైమాక్స్‌కు చేరుకున్న పోల్‌ సినిమా...సర్వేలు ఏం చెబుతున్నాయి?
Highlights

కేంద్రంలో వచ్చేది ఎన్డీయేనా? యూపీయేనా? సర్వేలు ఏం చెబుతున్నాయ్‌? పీఠంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నా అంతిమ విజయం...

కేంద్రంలో వచ్చేది ఎన్డీయేనా? యూపీయేనా? సర్వేలు ఏం చెబుతున్నాయ్‌? పీఠంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నా అంతిమ విజయం ఎవరిది? ఎన్నికల ఫలితాలు రావడానికి సమయం సమీపిస్తుండటంతో మారే అంకెల్ని, జరిగే పరిణామాలను ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే బేరీజు వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీయే-3 ప్రభుత్వం రావడం ఖాయమంటూ హస్తం బీజేపీ సారథ్యంలోనే ఎన్డీయే కొలువుదీరడం ఖరారంటూ కమలం ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరగబోతోంది?

సార్వత్రిక ఎన్నికల సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసింది. అధికార పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గనుందన్న సరికొత్త ఆంచనాలు కమలనాథుల్లో ఎంతో కొంత గుబులు రేపుతున్నాయి. బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 50 సీట్లు కోల్పోనుందని ఒక సర్వే చెప్పేసింది. దేశం మొత్తమ్మీద 543 సీట్లలో అధికార పార్టీ గెలుచుకోగల స్థానాలు 210 పదికి మించవని పలు సర్వేలు ఇప్పటికే చూచాయగా చెప్పేశాయి. మరోసారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలకు ఉత్తర ప్రదేశ్‌ ఫలితాలు గండికొట్టవచ్చునని 2014లో గెలుచుకున్న 71 స్థానాల్లో గరిష్టంగా 35 మాత్రమే దక్కుతాయని ఒక సర్వే సంస్థ తాజాగా ప్రకటించింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లతో ఏర్పాటైన మహాగఠబంధన్‌ ప్రభావం బీజేపీపై ఉండనుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఒకవేళ ఈ అంచనాలే నిజమైతే ఫలితాల తరువాత బీజేపీ కనీసం నాలుగు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండదు. అదే జరిగే బీజేపీ బీఎస్పీ జట్టు కట్టినా ఆశ్చర్యం లేదన్నది ఓ అంచనా. బీజేపీ అభ్యర్థులు నేరుగా అఖిలేష్‌ను మాత్రమే విమర్శిస్తూండటం మాయావతిపై పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని భవిష్యత్‌ పరిణామాలకు సూచికగా చెబుతున్నారు విశ్లేషకులు.

ఇక్కడ ఇంకో రకమైన లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీయే అగ్రస్థానంలో ఉన్నా మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చన్నది ఎన్నికల పండితుల అభిప్రాయం. యూపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదన్న వారి అంచనాల్లో కాంగ్రెస్‌కు వంద సీట్లు దాటవని, యూపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది మరో అభిప్రాయం. ఇక ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనాలు కూడా వినిపిస్తున్నాయ్.

ఎన్డీయేకు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపీఏ ప్రజలను ఒప్పించలేకపోయిందన్న విమర్శలున్నాయి. 2014 నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ పార్టీ కొంత బలపడ్డప్పటికీ ఆ పార్టీకి 100 సీట్లు దాటవని, కూటమికి వచ్చే మొత్తం సీట్లు 150 లోపేనని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న నిపుణులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కేరళలో కాంగ్రెస్‌ నాయకత్వంలో యూడీఎఫ్‌ 16 సీట్లు గెలుచుకుంటుందని, తమిళనాడులో డీఎంకే ఫ్రంట్‌తో కలిసి 30కి పైగా స్థానాలు దక్కించుకుంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఇక ఉత్తరాదిన గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో హస్తగతం చేసుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది పరిశీలకుల మాట. మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని విశ్లేషకులు చెపుతున్నారు. మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్‌తో జత కట్టిన కాంగ్రెస్‌ కూటమికి 10–15 సీట్లు లభించే అవకాశం ఉందంటున్న ఎన్నికల నిపుణులు యూపీలో ఆ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుందని, బీహార్‌లో పెద్దగా మార్పు ఉండదేమోనని చెబుతున్నారు. దక్షిణాది, ఉత్తరాదిన కలిపి ఆ పార్టీ 100 లోపు స్థానాలకే పరిమితం అవుతుందని ఒక అంచనా. కాంగ్రెస్‌ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్, టీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్ప్‌ ఇతర చిన్నా చితక పార్టీలను కలుపుకుంటే 150 స్థానాలకు మించి రావన్నది తాజా అంచనా.

ఎన్డీయే 240 సీట్లకే పరిమితమవుతుందన్న సంకేతాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ కొత్త భాగస్వాముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు ప్రాంతీయ పార్టీల నేతలతో తెరవెనుక మంత్రాంగం నడుపుతోంది. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలు కొన్నింటిని తమ వైపునకు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, మెజారిటీకి 120 కంటే ఎక్కువ సీట్ల దూరంలో ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్‌తో జత కట్టేందుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఆసక్తి చూపకపోవచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం.

ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు కోసం కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు కనపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ తరువాత అతిపెద్ద పార్టీలుగా అవతరించనున్న తృణమూల్, వైసీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్‌తో పాటు ప్రస్తుతం యూపీయేలో ఉన్న డీఎంకే, ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న జనతాదళ్‌ యునైటెడ్‌ వంటి పార్టీలతో పాటు వామపక్షాలను కలుపుకుని పోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా అంచనాలు మొదలయ్యాయి.

తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో జరిపిన సమావేశం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశంలో చేసిన ప్రయత్నం ఇలాంటి ఆలోచనలకు తెరలేపింది. అటు ఎన్డీయే, ఇటు యుపీయేతో సంబంధం లేని పార్టీలు 150 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని సర్వే పండితులు అంచనా వేస్తున్నారు.

తృణమూల్, వైసీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్, బీజేడీ పార్టీలు 120–135 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీయే మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోతే ఈ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు వచ్చి చేరే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ ఎన్‌డీయేకు 250 దాటితే ఈ పక్షాల్లోనే కొన్ని పార్టీలు షరతులతో కూడిన మద్దతిచ్చే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. అప్పుడు ఈ పార్టీలు కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశముంటుంది.

రాష్ట్రాల ప్రయోజనాల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ను తెరమీదకు తెచ్చారు. రాష్ట్రాలకు నిధుల మంజూరు విషయంలో వివక్షను విడనాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌‌రెడ్డి డిమాండ్‌. ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి ముందుకు వచ్చిన వారికే ఆయన మద్దతిస్తానని ఇప్పటికే ఆయన చెప్పేశారు కూడా. దీంతో ఎన్‌డీయే మెజారిటీకి 20–30 సీట్ల మధ్య ఆగిపోతే దేశంలో అందరి చూపు ఈ పక్షాల వైపే ఉంటుందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.

Next Story