రాహుల్‌పై ముగ్గురు గాంధీల పోటీ.. వయనాడ్‌లో ఆసక్తికర పోరు

రాహుల్‌పై ముగ్గురు గాంధీల పోటీ.. వయనాడ్‌లో ఆసక్తికర పోరు
x
Highlights

రాహుల్‌‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడే కాకుండా భారత ప్రధానమంత్రులకు కుమారుడు, మనవడు, మునిమనవడు. అందుకే ఆయనపై గాంధీ ఇమేజ్‌ ఎక్కువగానే ఉంటుంది. అంతవరకు...

రాహుల్‌‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడే కాకుండా భారత ప్రధానమంత్రులకు కుమారుడు, మనవడు, మునిమనవడు. అందుకే ఆయనపై గాంధీ ఇమేజ్‌ ఎక్కువగానే ఉంటుంది. అంతవరకు దాని వల్ల ఉపయోగమే. కానీ వారసత్వ రాజకీయాలను ద్వేషించే వారి విషయంలో అది ప్రతికూల అంశం. గాంధీకున్న పేరును దెబ్బతీయాలనో, వాడుకోవాలే అనో, తద్వారా అంతోఇంతో పేరు పొందాలనే ఉద్దేశంతోనో కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌ గాంధీపై ముగ్గురు గాంధీలు పోటీకి దిగారు. వారెవరో చూద్దాం.

ఒకప్పుడు ఓటర్లను గందరగోళానికి గురి చేయడానికి ఒకే పేరుగల వ్యక్తులను పోటీలోకి దింపేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. పేర్ల పక్కన గుర్తులతోపాటు ఫొటోలు కూడా వచ్చాయి. పేరు కోసమే కావచ్చు. రాహుల్‌ గాంధీపైన రాహుల్‌‌గాంధీ కేఈ, రఘుల్‌‌గాంధీ, కేఎం శివప్రసాద్‌‌గాంధీలు పోటీకి దిగారు. వీరిలో రాహుల్‌ గాంధీది హస్తం గుర్తుకాగా, రఘుల్‌ గాంధీది బకెట్, రాహుల్‌ గాంధీ కేఈది ఇసుక గడియారం, శివప్రసాద్‌ గాంధీది ఏర్‌ కండీషనర్‌ గుర్తులు. వీరిలో కాస్త పేరున్న వ్యక్తి రఘుల్‌ గాంధీ. ఆయన హిందుస్థాన్‌ జనతా పార్టీ మద్దతుతో అఖిల ఇండియా మక్కన్‌ కళగం పార్టీ తరఫున బరిలోకి దిగారు.

రాహుల్‌‌గాంధీ కేఈ కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. స్వతంత్య్ర సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. శివప్రసాద్‌ గాంధీ కేరళ త్రిసూర్‌ జిల్లాకు చెందిన స్కాలర్‌. ఆయన గాంధీయన్‌ పార్టీలో పనిచేస్తున్నారు. ఆ పార్టీలో చేరాకే తన పేరు చివరన గాంధీ ట్యాగ్‌ను తగిలించుకున్నారు. ఇద్దరు గాంధీలు, రాహుల్‌ గాంధీకన్నా ముందే నామినేషన్‌ వేయగా, రాహుల్‌ గాంధీ కేఈ మాత్రమే ఆ తర్వాత, అంటే ఏప్రిల్‌ 12న నామినేషన్‌ దాఖలు చేశారు.

కాస్త పేరున్న రఘుల్‌‌గాంధీకి ఆ పేరును జాతిపితపైనున్న గౌరవంతో ఆయన తండ్రి పెట్టారట. ఆయన రాజకీయాలకు కొత్త కాదు. గతంలో, 2014లో కోయంబత్తూరు నుంచి మేయర్‌గా, 2016లో తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. చిత్రంగా రఘుల్‌‌గాంధీ సోదరి పేరు ఇందిరా ప్రియదర్శిని. వారి తండ్రి కృష్ణన్‌. ఆయన 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఆయన తండ్రి పళనిస్వామి స్వాతంత్య్ర యోధుడు, కాంగ్రెస్‌ మద్దతుదారుడు.

అయినప్పటికీ రాహుల్‌‌గాంధీపై రఘుల్‌ గాంధీ పోటీ చేయడానికి ప్రధానంగా తన డిమాండ్లకు ప్రాచుర్యం కల్పించడం కోసమేనట. 33 రాష్ట్ర భాషలకు అధికార హోదా కల్పించాలని, ముఖ్యంగా ద్రావిడ భాషలకు జాతీయ హోదా కల్పించాలన్నది ఆయన మొదటి డిమాండ్‌ అయితే అన్ని పన్నుల నుంచి పౌరులకు విముక్తి కల్పించడం రెండవ నినాదమట. ఈ రెండు డిమాండ్ల పరిష్కారం కోసం రాహుల్‌‌గాంధీతోపాటు మోడీతో పోరాటం చేస్తానంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories