Top
logo

పెద్దాపురంలో చినరాజప్ప గెలుస్తాడా...వైసీపీ అభ్యర్థి తోట వాణికి...

పెద్దాపురంలో చినరాజప్ప గెలుస్తాడా...వైసీపీ అభ్యర్థి తోట వాణికి...
X
Highlights

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీలో రసవత్తరమైన పోటీ కొనసాగింది. చారిత్రక పెద్దాపురంలో విజయం ఎవరిది అనే ...

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీలో రసవత్తరమైన పోటీ కొనసాగింది. చారిత్రక పెద్దాపురంలో విజయం ఎవరిది అనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే డిప్యూటీ సిఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇదే. తెలుగుదేశం అభ్యర్ధిగా తిరిగి చినరాజప్పే పెద్దాపురంలో పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహాం సతీమణి తోట వాణి, వైసీపీ అభ్యర్ధినిగా రంగంలో నిలిచారు. దీంతో ఇక్కడ ఉత్కంఠ భరితమైన పోటీ జరిగింది. మరోవైపు జనసేన అభ్యర్ధిగా తుమ్మల బాబు నిలపడటంతో పెద్దాపురంలోనూ త్రిముఖ పోటీ తప్పలేదు. గెలుపుపై ఎవరి ధీమా వారికున్నాయి. అయితే పోలింగ్ సరళి, సమీకరణలు మాత్రం మరోలా ఉన్నాయి.

తూర్పు గోదావరి రాజకీయవర్గాల్లో అందరి దృష్టి ఇపుడు పెద్దాపురం అసెంబ్లీపైనే పడింది. తెలుగుదేశం అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఈ నియోజకవర్గంలో తిరిగి విజయం సాధిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే చినరాజప్పపై స్వపక్షంలోనే విపక్షం మొదలైంది. ఓవైపు మాజీ ఎమెల్సీ బొడ్డు భాస్కర రామారావు పార్టీలోనే వుంటూ ఈ ఎన్నికలలో చినరాజప్పకు వ్యతిరేకంగా పనిచేయడం, మరోవైపు చివరిక్షణం వరకూ తెలుగుదేశంలోనే వుంటూ, కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆఖరి నిమిషంలో తన పతీమణి తోట వాణికి వైసీపీ టిక్కెట్‌ తెచ్చుకుని చినరాజప్పపై ప్రత్యర్ధిగా నిలబెట్టడం, ఈ రెండు పరిణామాలతో చినరాజప్ప గెలుపు చాలా ఈజీ అనుకున్నారు. అంత ఈజీగా కాదని తేలిపోయింది. దీంతో అంతా అలర్ట్‌ అయ్యారు.

ప్రత్యర్థుల వ్యూహాలకు అనుగుణంగా తెలుగుదేశం అభ్యర్థి చినరాజప్ప తన ప్రచార వ్యూహాన్ని మార్చుకుని ముందుకు సాగారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట మునిసిపాలిటీతో పాటు పెద్దాపురం రూరల్‌, సామార్లకోట మండలాలు వున్నాయి. పట్టణ, గ్రామీణ ఓటర్లపై ఆధారపడిన నియోజకవర్గం ఇది. అయితే వైసీపీ ఈ నియోజకవర్గంలో అభ్యర్దులను రెండు సార్లు మార్పు చేసింది. 2014 ఎన్నికలలో చినరాజప్పపై వైసీపీ తరపున పోటీ చేసిన తోట సుబ్బారావునాయుడు తర్వాత ఐదేళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటూ తిరిగి తనదే టిక్కెట్‌ అనుకున్నాడు. అయితే చివరి క్షణంలో సుబ్బారావు నాయుడును తప్పించి ఎన్‌ఆర్‌ఐ దవులూరి దొరబాబుకు వైసీపీ నేత జగన్‌ టిక్కెట్‌ ఖరారు చేశారు. దొరబాబు కూడా భారీగా ఖర్చు చేసుకుని ముందుకువెళుతున్న తరుణంలో చివరి క్షణంలో తోటవాణి తెరమీదకు వచ్చారు. తోట వాణికి టిక్కెట్‌ ఖరారు అయింది. కొద్దిరోజులు దొరబాబు అసంతృప్తిగా వున్నప్పటికీ, తిరిగి బుజ్జగింపులతో పార్టీ కోసం పనిచేశారు. అంతకు ముందే వైసీపీ నేత తోట సుబ్బారావునాయుడు తన టిక్కెట్ మార్చినందుకు అసంతృప్తి చెంది వైసీపీకి గుడ్‌ చెప్పేశారు.

ఇలాంటి పరిణామాలలో పెద్దాపురం నియోజకవర్గం అభివద్ధే ధ్యేయంగా పనిచేసిన చినరాజప్ప అభివృద్దిని, చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నియోజకవర్గంలో తిరిగి చినరాజప్ప తన ప్రచారం ఒక దఫా పూర్తిచేసుకున్నారు. వైసీపీ రెండుపర్యాలు అభ్యర్ధును మార్చడం, జనసేన అభ్యర్ధిగా తుమ్మ బాబును చివరి క్షణంలో ప్రకటించడం తెలుగుదేశం అభ్యర్ధికి కలిసొచ్చిన అంశాలుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

వైసీపీ అభ్యర్ధిని తోట వాణికి మద్దతుగా పూర్తిస్థాయిలో కాకినాడ ఎంపీ తోట నరసింహం ఎన్నికల ప్రచారంలో తిరగలేకపోయారు. నరసింహం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పైగా చినరాజప్ప మీద వ్యక్తిగత అజెండాతో వాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోనసీమకు చెందిన మాజీ మంత్రి స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు కుమార్తె అయిన తోట వాణి బంధువులూ, చినరాజప్పకూ బంధువులు కావడంతో కొందరు వాణి తరపున వచ్చి బాహాటంగా ఎన్నిక ప్రచారం చేయలేకపోయారు. ఇదిలా వుంటే తెలుగుదేశం అభ్యర్ధి చినరాజప్పకు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఎన్నిక ప్రచారంలో మద్దతు ఇవ్వలేదు. తన వర్గంచేత కూడా ప్రచారం చేయనివ్వలేదని,పైగా పరోక్షంగా వైసీపీకి ప్రచారం చేశారనే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్‌ తనకే కావాలని బొడ్డు భాస్కరరామారావు చివరివరకూ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద పట్టుపట్టారు. చినరాజప్పకు టిక్కెట్‌ రానీయకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయినా చినరాజప్పకే అధిష్ణానం టిక్కెట్‌ తిరిగివ్వడంతో బొడ్డు భాస్కరరామారావు అసంతృప్తితో ఎన్నికలలో పార్టీ ప్రచారానికి దూరంగా వుండిపోయారు.

ఇక పెద్దాపురం అసెంబ్లీ బరిలో నిలిచిన జనసేన అభ్యర్థి తుమ్మల రామస్వామి తొలిసారి తన రాజకీయ భవిత్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈనియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం గెలిచిన నేపథ్యంలో, జనసేన కాస్త బలం వున్నట్టేనని రాజకీయవర్గాలలో అంచనాలున్నాయి. అయితే జనసేన చీల్చే ఓట్లు ఎన్నివుంటాయోనని ఇటు తెలుగుదేశం- అటు వైసీపీ నాయకులు లెక్కలేసుకుంటున్నారు. పదివేలకు పైగా మెజారిటీతో తిరిగి గెలుపు తనదేనని చినరాజప్ప ధీమాగా చెబుతున్నారు. అయితే మెజారిటీ తగ్గినప్పటికీ విజయం తమదేనంటూ వైసీపీ అభ్యర్ధిని తోట వాణి గట్టిగా చెప్పుకుంటున్నారు. జనసేన చీల్చుకునే ఓట్లు తెలుగుదేశానికే నష్టమన్న అంచనాలో వైసీపీ వుంటే, ఆ ఓట్లు వల్ల వైసీపీకే దెబ్బఅని తెలుగుదేశం నాయకులు లెక్కలేస్తున్నారు.

పెద్దాపురంలో ఈసారి 81.69 శాతం ఓట్లు పోలయ్యాయి. అంతకు ముందు ప్రజారాజ్యం టైమ్‌లో అంటే, త్రిముఖ పోటీలో తెలుగుదేశం అభ్యర్ధి బొడ్డు భాస్కరరామారావుపై ప్రజారాజ్యం అభ్యర్థి పంతం మోహన్‌ గాంధీ 3వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మూడో స్థానంలో వున్న కాంగ్రెస్‌ అభ్యర్ధి తోట గోపాలకృష్ణకు 36వేల 519 ఓట్లు అప్పట్లో వచ్చాయి.

ఇలా పోలైన పోలింగు సరళిని కూడిలు తీసివేతలు వేసుకుంటూ గెలుపు ధీమాగా ఉన్నారు ప్రధాన పార్టీల నాయకులు. బెట్టింగులు కూడా పెద్దాపురం అసెంబ్లీ విజయావకాశాలు, మెజారిటీల మీద ఎక్కువ మంది కాస్తున్నారు. పెద్దాపురం కోటలో రారాజు ఎవరో తెలియాంటే మే 23వరకూ వేచిచూడాల్సిందే.

Next Story