బద్దశత్రువుల షేక్‌హ్యాండ్‌ వెనక పొలిటికల్‌ సీక్రెట్ ఏంటి?

బద్దశత్రువుల షేక్‌హ్యాండ్‌ వెనక పొలిటికల్‌ సీక్రెట్ ఏంటి?
x
Highlights

వారిద్దరూ మొన్నటిదాకా రాజకీయ ప్రత్యర్థులు. ఒకరిపై ఒకరు కత్తులు నూరారు. ఒకరిపై మరొకరు గెలిచేందుకు వ్యూహాలు వేశారు. రాజకీయ విమర్శలు చేస్తూ రణరంగంలా...

వారిద్దరూ మొన్నటిదాకా రాజకీయ ప్రత్యర్థులు. ఒకరిపై ఒకరు కత్తులు నూరారు. ఒకరిపై మరొకరు గెలిచేందుకు వ్యూహాలు వేశారు. రాజకీయ విమర్శలు చేస్తూ రణరంగంలా ఎన్నికల్లో తలపడ్డారు. ఎదురుపడితే యుద్ధమే అన్నట్టుగా అటు సోషల్ మీడియాలో, ఇటు నియోజకవర్గంలో పొలిటికల్ వాతావరణాన్ని వేడెక్కించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వారిద్దరికీ సంబంధించిన ఒక దృశ్యం, ఇప్పుడు ఆ ఇద్దరి అనుచరులకు మరోదారి చూపుతోంది.

కరీంనగర్ జిల్లా. హాట్‌హట్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్. మొన్న జరిగిన అసెంబ్లీ, నిన్న హోరాహోరిగా సాగిన పార్లమెంట్ ఎన్నికల తీరే అందుకు నిదర్శనం. ఇక్కడి రాజకీయ నాయకుల్లో గట్టి ప్రత్యర్థులు ఉండడంతో ప్రతి ఎన్నికా, యుద్ధ క్షేత్రాన్నే తలపిస్తోంది. నాయకుల నుంచి కార్యకర్తల దాకా, ఇక్కడ హోరాహోరి సమరమే. మీడియా నుంచి సోషల్ మీడియా దాకా, అన్ని వేదికలూ యుద్ధ వేదికలే. అయితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కనబడిన ఓ దృశ్యం సొంత పార్టీ కార్యకర్తలని ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధక్షేత్రంలో శాంతిపావురంలా కనపడింది.

ఇదే ఆ దృశ్యం. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఆలింగనం. రాజకీయం అనేది శాశ్వత శత్రుత్వానికి దారితీయకూడదని మెసేజ్ ఇచ్చారు ఈ ఇద్దరు నాయకులు. ఇప్పుడీ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో రాజకీయ ప్రత్యర్థులు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు తీవ్రంగానే చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంలో ఏ రాజకీయ ప్రత్యర్థులైనా చేసే పని అదే. అయితే ఈ వాతావరణం మొన్నటి ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంజయ్ ఎంపీగా గెలుపొందారు. దీంతో కరీంనగర్ కేంద్రంగా ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు, ఇప్పుడు ఒకే ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయినట్టయ్యింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి, అధిరికారికంగా వీళ్లిద్దరూ కలవాల్సి వచ్చింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, ఎంపీగా బండి సంజయ్ ఒకే వేదికపై ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే మెసేజ్‌ని కార్యకర్తలకి చెప్పేశారు. రోజూ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్న కార్యకర్తలకు, ఈ దృశ్యం ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆప్యాయంగా పలకరించుకున్న ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులను, రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు అభినందిస్తున్నారు. ప్రజా సమస్యల కోసం కూడా ఇలానే కలిసి పని చేయాలని కోరుకుంటున్నారు. అయితే రాజకీయాల కోసం సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలు మీరు మారండి అంటూ జనం కోరుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories