వానలు లేవు.. వరదలు ముంచుతున్నాయి!

వానలు లేవు.. వరదలు ముంచుతున్నాయి!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ పరిస్థతి విచిత్రంగా మారింది. పెద్దగా వర్షాలు కురవడం లేదు. కానీ, ప్రధాన నదులు వరదలతో ఊళ్ళని ముంచుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు వంటి ఉపనదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. అదేవిధంగా కృష్ణా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థతి విచిత్రంగా మారింది. పెద్దగా వర్షాలు కురవడం లేదు. కానీ, ప్రధాన నదులు వరదలతో ఊళ్ళని ముంచుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు వంటి ఉపనదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. మంగళవారం ఉధృతి కొద్దిగా తగ్గినప్పటికీ, ఇంకా ప్రమాదకర స్థాయిలోనే గోదారి ఉరకలేస్తోంది.

మునిగి పోయిన దేవీపట్నం..

దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. ఊరికి చుట్టూ ఉన్న రహదారులన్నీ నీట మునగడంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. బాధితులకు ప్రభుత్వ సిబ్బంది భోజనాలు పంపిణీ చేశారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్‌ వాటర్‌తో చింతూరు–వీఆర్‌ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దిగువున కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ముమ్మరంగా సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్‌పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. ఆ జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వీరవరంలో రెండు, చింతూరులో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి మొత్తం నాలుగు బృందాలతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు చేపట్టింది. రంపచోడవరం కేంద్రంగా 30 మంది సిబ్బందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, 90 మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక శాఖ విభాగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సీజన్‌లో మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా పోతోంది. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ కారణంగా దేవీపట్నం పరిసర గ్రామాలను వరద ముంచేసింది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి.

కొద్దిగా తగ్గినా ఇంకా ప్రమాదకరస్తాయిలోనే గోదావరి..

ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని, అప్పటి వరకూ వరద పరిస్థితి కొనసాగుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నుంచి 14,81,674 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ గోదావరి జలాలు 2,479 టీఎంసీలు సాగరంలో కలిసిపోయాయి. సోమవారం 128 టీఎంసీలు సముద్రంలోకి చేరిపోయాయి.

కృష్ణానది ఉరకలు..

గోదావరి పరిస్థితి అలా ఉండగా, ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉప నదులైన భీమా, తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.34 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 884.60 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2.17 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి సాగర్‌ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 587.90 అడుగుల్లో 306.04 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో 20 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 308.71 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. మంగళవారానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

వంశధార ఉధృతి..

ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 30,975 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ గొట్టా బ్యారేజీ నుంచి 53.31 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories