సార్వత్రిక ఎన్నికలపై టీఆర్ఎస్‌ పోస్ట్‌మార్టం

సార్వత్రిక ఎన్నికలపై టీఆర్ఎస్‌ పోస్ట్‌మార్టం
x
Highlights

ఎన్నికేదైనా గులాబీ సేనదే గెలుపు. అసెంబ్లీ ఎన్నికల నుంచి స్పీడ్‌ అందుకున్న కారు ఎదురే లేకుండా దూసుకుపోయింది. వరుస విజయాలతో జోరుమీదున్న కారు స్పీడ్‌కు...

ఎన్నికేదైనా గులాబీ సేనదే గెలుపు. అసెంబ్లీ ఎన్నికల నుంచి స్పీడ్‌ అందుకున్న కారు ఎదురే లేకుండా దూసుకుపోయింది. వరుస విజయాలతో జోరుమీదున్న కారు స్పీడ్‌కు సార్వత్రిక ఎన్నికలు బ్రేక్ వేశాయి. 16 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్‌ కేవలం 9 స్థానాల్లోనే విజయం సాధించడంపై కేసీఆర్‌ ఆలోచన ఎలా ఉంది..? సొంత పార్టీ నేతలపైనే అధినేత ఆగ్రహంగా ఉన్నారా..? పార్టీకి వ్యతిరేకంగా కోవర్టులు పనిచేస్తున్నారని అనుమానిస్తున్నారా..?

సారు, కారు, పదహారు స్లోగన్‌‌తో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న టీఆర్ఎస్‌కు మిగిలింది 9 స్థానాలే. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ 7 స్థానాలను ఎగరేసుకుపోవడం అధికార పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుచుకున్న ఎంపీ సెగ్మెంట్ల‌లో టీఆర్ఎస్ నాయ‌కులు ఏర‌కంగా ప‌ని చేశారనే దానిపైనే కేసీఆర్‌ దృష్టి పెట్టారు. దీనిపై కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఆరా తీస్తున్నారు. అన్ని రకాల సమాచారం అందుకున్న అధినేత సొంత పార్టీ ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరే ఈ విపత్కర పరిణామానికి కారణమని భావిస్తున్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల‌ను గెలిపించే బాధ్య‌త ఎమ్మెల్యేల‌దే అని కేసీఆర్ గట్టిగా చెప్పారు. అందుకు ఎమ్మెల్యేలు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక్క‌డే కేసీఆర్ లెక్క త‌ప్పిందని చెబుతున్నారు. ఎమ్మెల్యేల విజయంలో కేసీఆర్‌దే కీలక పాత్ర. ఎమ్మెల్యే అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటెయ్యాలని కేసీఆర్‌ అప్పట్లో ప్రచారం చేశారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు గట్టెక్కారు. కానీ అలా రెండోసారి గెల్చిన ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత ఉండటమే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ కొంప ముంచిందనే ప్రచారం సాగుతోంది.

కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలను అంతగా సీరియస్‌గా తీసుకోలేదనే విషయంపై కూడా కేసీఆర్‌ ఆరా తీశారు. ముఖ్యంగా నల్గొండలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం కోసం కారు పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సహకరించారనే ప్రచారం నడుస్తోంది. ఇక నిజామాబాద్‌లో కవిత పరాజయానికి కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరే కారణమని తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి స్థానాల్లో సీనియర్లను పక్కనపెట్టి వారసులకు సీట్లు ఇవ్వడంతో ప్రత్యర్థుల విజయానికి సహకరించారనే వాదన వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బపై సీరియస్‌గా ఉన్న కేసీఆర్‌ వ్యతిరేకంగా పనిచేసిన కేడర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories