Winter Storm : గడ్డకట్టుకుపోతున్న అగ్రరాజ్యం..10 లక్షల ఇళ్లలో కరెంట్ కట్, 10 వేల విమానాలు రద్దు

Winter Storm : గడ్డకట్టుకుపోతున్న అగ్రరాజ్యం..10 లక్షల ఇళ్లలో కరెంట్ కట్, 10 వేల విమానాలు రద్దు
x
Highlights

గడ్డకట్టుకుపోతున్న అగ్రరాజ్యం..10 లక్షల ఇళ్లలో కరెంట్ కట్, 10 వేల విమానాలు రద్దు

Winter Storm : అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం మంచు గుప్పిట్లో విలవిలలాడుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్న ఈ భయంకరమైన శీతాకాల తుపాను అమెరికన్ల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. గడ్డకట్టే చలి, ఆకాశం నుంచి కురుస్తున్న మంచు కుప్పలు కోట్లాది మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. విద్యుత్ లైన్లు తెగిపోవడంతో లక్షలాది ఇళ్లు అంధకారంలో మునిగిపోగా, వేలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.

అమెరికా వ్యాప్తంగా శీతాకాల తుపాను సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఒక నివేదిక ప్రకారం.. దేశంలోని తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం వరకు దాదాపు రెండు వంతుల భూభాగం మంచు కింద కూరుకుపోయింది. విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినడంతో సుమారు 10 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతల వల్ల హీటర్లు కూడా పని చేయని పరిస్థితి నెలకొంది. వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రరాజ్యం గతి తప్పి స్తంభించిపోయింది.

జాతీయ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. మిసిసిపీ, టెక్సాస్, లూసియానా, కెంట్కీ, జార్జియా, వర్జీనియా, అలబామా వంటి రాష్ట్రాలు ఈ తుపాను ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించి ఉన్న ఈ తుపాను ప్రభావం దాదాపు 21.3 కోట్ల మందిపై పడుతోంది. ఎక్కడ చూసినా అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రాబోయే మరికొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దాదాపు 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీని రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. "ప్రజలారా.. సురక్షితంగా ఉండండి, అనవసరంగా బయటకు రావద్దు" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఆహారం, ఇంధనం స్టాక్ చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరోవైపు విమాన ప్రయాణాలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 10,000 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు ఆహారం, నిద్ర లేక నానా అవస్థలు పడుతున్నారు. భారీగా కురుస్తున్న మంచు వల్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటం వల్ల మరిన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చలి పులి దాటికి అమెరికా ఎప్పుడు కోలుకుంటుందోనని ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories