Top
logo

Saliva based corona Test: తక్కువ ఖర్చులో..సులభంగా కరోనా నిర్ధారణ పరీక్షలు! అమెరికా ముందడుగు!

Saliva based corona Test:  తక్కువ ఖర్చులో..సులభంగా కరోనా నిర్ధారణ పరీక్షలు! అమెరికా ముందడుగు!
X
Saliva based corona Test:
Highlights

Saliva based corona Test: పెట్రేగిపోతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడం నెలలు గడుస్తున్నా సాధ్యం కావడం లేదు. ప్రపంచం తీరుతెన్నులనే మార్చివేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాల కోసం విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Saliva based corona Test: పెట్రేగిపోతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడం నెలలు గడుస్తున్నా సాధ్యం కావడం లేదు. ప్రపంచం తీరుతెన్నులనే మార్చివేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాల కోసం విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా విషయంలో ఇప్పటివరకూ పెద్ద ఇబ్బందికర అంశం వ్యాధి నిర్ధారణ పరీక్షలు. ఖర్చుతో కూడుకున్న పరీక్షలు కావడంతో చాలా మంది కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి. పైగా కరోనా పరీక్షల కోసం శాంపిల్ సేకరణా క్లిష్టమైన విషయం. కరోనా నిర్ధారణ కోసం ఇప్పటివరకు గొంతు, ముక్కు ద్వారా నమూనాలు (స్వాబ్‌) సేకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనికోసం ప్రత్యెక శిక్షణా అవసరం అవుతోంది. అంతే కాకుండా నమూనాలు సేకరించే సమయంలో ఆరోగ్య సిబ్బందీ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు తేలికగా..చవకగా నిర్వహించే వీలున్న పద్ధతులపై పరిశోధనలకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

ఈ విషయంలో అమెరికాలోని కొన్ని సంస్థలు పెద్ద ముందడుగు వేశారు. వైరస్‌ను వేగంగా గుర్తించడానికి కొత్త పరీక్షా విధానాన్ని కనుగొన్నారు. ఇందులో భాగంగా వ్యక్తుల లాలాజలం(ఉమ్మి) సేకరించి టెస్టులు చేయనున్నారు. ఈ విధానానికి అమెరికాలో అనుమతి ఇచ్చారు. ఈ కొత్త విధానం ద్వారా వేగంగా, కచ్చితత్వంతో వైరస్ నిర్ధారణకు అవకాశం ఉండటంతో.. కొవిడ్ టెస్టుల సామర్థ్యాన్ని భారీగా పెంచవచ్చు. దీంతో పాటు పరీక్షలకయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. అత్యంత తేలికగా నమూనాలు సేకరించి, పరీక్షించే ఈ విధానం రానున్న రోజుల్లో కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణలో ప్రముఖ పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికాలో ఈ కొత్త విధానంలో మొత్తం 4 పరిశోధనలు జరుగుతుండగా.. వీటిలో ఒక పరిశోధన ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి సమానంగా ఫలితాలను ఇస్తోంది. తాజాగా దానికి ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది.

సురక్షితం.. వేగవంతం..

ఈ కొత్త పద్ధతిలో శాంపిల్‌ తీసుకోవడం సురక్షితం. హాని చాలా తక్కువ. ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించే సమయంలో తుమ్ము, దగ్గు వలన వైరస్‌ బయటకు వస్తుంది. సేకరించే వారికి అది ప్రమాదకరం. ఈ కొత్త విధానంలో అలాంటి ప్రమాదం ఉండదు. తమకు వైరస్ సోకింది అని అనుమానం ఉన్న వారే స్వయంగా శాంపిల్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. దీంతో సిబ్బందికి ఇబ్బంది తప్పుతుంది. అదీ కాకుండా ఇప్పుడు సేకరిస్తున్న స్వాబ్ పద్ధతిలో శాంపిల్స్ ను కనిష్ట ఉషోగ్రతల వద్ద భద్రపరచాల్సి వస్తోంది. ఈ కొత్త విధానంలో ఆ అవసరం ఉండబోదని తెలుస్తోంది. ఇది అతి పెద్ద అనుకూలాంశం.

అమెరికాలో లాలాజలంతో పరీక్షించే నాలుగు రకాల పద్ధతులకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. అయితే, వాటి ఫలితాల్లో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నిపుణులు అభివృద్ధి చేసిన 'సలైవా డైరెక్ట్‌' అనే పధ్ధతి కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని గుర్తించారు. దీంతో ఈ పరీక్షా విధానానికి అనుమతి ఇచ్చారు. ఎమర్జెన్సీ వినియోగంలో భాగంగా ఈ కొత్త విధానానికి అనుమతి ఇచ్చినట్టు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ఈ విధానం వల్ల కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతో పాటు పరీక్షల్లో కీలకమైన రియేజెంట్ల లోటును భర్తీ చేయవచ్చని ఎఫ్‌డీఏ కమిషనర్‌ స్టీఫెన్‌ హాన్‌ తెలిపారు.

అమెరికా వ్యాప్తంగా కొన్ని వారాల్లోనే ఈ నూతన పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కు ద్వారా తీసుకొనే నమూనాల కంటే ఈ నూతన పద్ధతిలో తక్కువ హాని ఉంటుందని.. 90 శాతం కచ్చితమైన ఫలితం వస్తోందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణలో ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కరోనా నిర్ధారణ పరీక్షల విధానాన్ని మార్చివేస్తుందని సలైవా డైరెక్ట్‌ అభివృద్ధిలో భాగమైన పరిశోధకులు నాథన్‌ గ్రూబౌగ్‌, అన్నే వైలి అన్నారు.

Web TitleUS FDA authorises use of Covid-19 saliva test for faster detection of cases
Next Story