బ్రిటన్‌ ప్రధాని లిజ్‌కు మరో ఎదురు దెబ్బ.. హోంమంత్రి పదవికి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా

UK Home Secretary Suella Braverman Resigns | Telugu News
x

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌కు మరో ఎదురు దెబ్బ.. హోంమంత్రి పదవికి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా

Highlights

Suella Braverman: రాజీనామా లేఖలో లిజ్‌ ట్రస్‌పై సంచలన వ్యాఖ్యలు

Suella Braverman: భారత్‌పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సుయెల్లా బ్రేవర్మన్‌ బ్రిటన్‌ హోంమంత్రి పదవికి రాజీనామా చేసింది. దీంతో ప్రధాని లిజ్‌ ట్రస్‌ ట్రస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రస్‌ ఆర్థిక విధానాలపై బ్రేవర్మనర్‌ నిప్పులు చెరిగారు. భారతీయ సంతతికి చెందిన బ్రేవర్మన్‌ లండన్‌లోని మినిస్టీరియల్‌ కమ్యూనికేషన్‌ కోసం తన ప్రైవేటు ఇమెయిల్‌ను వినియోగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో హోంశాఖ మంత్రి పదవికి బ్రేవర్మన్‌ రాజీనామా చేశారు. అయితే ఇటీవల భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రవేటు ఇమెయిల్ వ్యవహారం ఆమె కొంప ముంచాయి. దీనికి తోడు లిజ్‌ ట్రస్‌ తన పదవిని కాపాడుకునేందుకు మంత్రులతో రాజీనామాలు చేయిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

మినిస్టీరియల్‌ కమ్యూనికేషన్‌ కోసం ప్రైవేటు ఇమెయిల్‌ ఇవ్వడం సాంకేతిక తప్పిదంగా బ్రేవర్మన్‌ పేర్కొన్నారు. తాను చేసిన పొరబాటుకు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్టు రిజైన్‌ లెటర్‌లో తెలిపారు. హోం మంత్రిగా తాను కేవలం 43 రోజులు మాత్రమే పని చేసినట్టు బ్రేవర్మన్‌ తెలిపారు. ట్రస్‌తో ముఖాముఖి సమావేశం అనంతరమే రాజీనామా లేఖను బ్రేవర్మన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మేనిఫెస్టోలో ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ ఇచ్చిన హమీలను ఉల్లంఘిస్తున్నారంటూ రాజీనామా లేఖలో ఆరోపించారు. బ్రేవర్మన్‌ మంత్రిపదవికి రాజీనామా చేయడం లిజ్‌ ట్రస్‌కు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా లిజ్‌పై బ్రేవర్మన్‌ ఆరోపించడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని చెబుతున్నారు.

మరోవైపు లిజ్‌ ట్రస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని లిజ్‌ ట్రస్‌ తేల్చి చెప్పారు. ప్రస్తుత సవాళ్లను తన ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాజా పార్లమెంట్‌ సమావేశాల్లో కొందరు ఎంపీలు ఆమెకు వ్యతిరేకంగా నినదించారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఆమె ఇంకా ఎందుకు పదవిలో ఉన్నారని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కెయిర్‌ స్టార్మెర్ ప్రశ్నించారు. తాను ఎదురొడ్డి పోరాడే వనితనని ట్రస్‌ కౌంటర్ ఇచ్చారు. బరి నుంచి పారిపోయే రకం కాదని స్పష్టం చేశారు. మరోవైపు ఇంధన కొరతను అధిగమించేందుకు షేల్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలన్న ట్రస్‌ సర్కారు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం పార్లమెంట్‌లో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. ఇది కూడా అవిశ్వాస తీర్మానం లాంటిదే.

తాజా తీర్మానాన్ని 70 మంది సభ్యులున్న కన్జర్వేటివ్‌ పార్టీ ఓడించడం ఖాయం. అయితే సొంత పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు పార్టీ విప్‌ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి లిజ్‌ ట్రస్‌ మినీ బడ్జెట్‌ తీవ్ర విమర్శల పాలైంది. సంపన్నులకు పన్ను కోతలు విధించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. దీంతో దేశంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి లిజ్‌ ట్రస్ రాజీనామా చేయాలంటూ పలువురు సొంతపార్టీలోనే డిమాండ్లు చేస్తున్నారు. అధికారం చేపట్టిన ఆరువారాల్లోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేతగా ఆమె నిలిచిపోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories