భీకరంగా కరోనా రెండో దశ.. ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

భీకరంగా కరోనా రెండో దశ.. ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌
x
Highlights

కరోనా కేసులు పెరుగుతుండటంపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు...

కరోనా కేసులు పెరుగుతుండటంపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు నెల రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. కేబినెట్‌ సమావేశంలో ఈ విషయమై జరిగిన చర్చిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌ 2 వరకు ఇది కొనసాగనున్నట్లు తెలిపారు. దేశంలో మరోసారి కరోనా ఉధృతి పెరగటంతో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామని మీడియాకు వెల్లడించారు. వచ్చే డిసెంబర్‌లో క్రిస్మస్‌ నాటికి ఈ ఆంక్షలను మళ్లీ సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ముప్పు తప్పిందని ఊరట పొందినంతలోపే యూరోప్‌ను కరోనా మళ్లీ వణికిస్తోంది. మొదటి దశ కంటే భీకరంగా కొవిడ్‌ రెండో దశ విరుచుకుపడుతోంది. అక్టోబర్‌ 29న ఒక్క రోజే 2.5 లక్షల మంది వైరస్‌ బారినపడటమే దీనికి నిదర్శనం. తొలి దశ తీవ్రంగా ఉన్న మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనూ ఈ స్థాయిలో పాజిటివ్‌లు రాలేదు. అప్పట్లో రోజువారీ మొత్తం యూరప్‌ కేసులు 35 వేలకు మించలేదు. ప్రస్తుతం దాదాపు పది రెట్లు ఎక్కువ కావడం ప్రజలను మరింత కలవరపెడుతోంది. యూకే వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అక్టోబర్ 31న ఒక్కరోజులోనే బ్రిటన్‌‌లో 22 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

యూరప్‌లో కరోనా వ్యాప్తికి భిన్న కారణాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. నిపుణులు మాత్రం రెండు ప్రధాన కారణాలను పేర్కొంటున్నారు. ఒకటి వేసవిలో కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు జాగ్రత్త చర్యలను విస్మరించి విస్తృతంగా ప్రయాణాలు చేయడం మొదటి కారణమైతే, ప్రస్తుత శీతాకాలంలో ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం. చిన్నవైన, వెలుతురు సరిగా లేని ఇళ్లలో ఒకరికి వైరస్‌ సోకినా మిగతా వారికి వ్యాపిస్తూ కేసులు పెరుగడం రెండో కారణంగా నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ తాజా విజృంభణ నేపథ్యంలో రోగులు, మరణాలు పెరుగుతుండటంతో బ్రిటన్‌ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది.

యూరోప్‌లో ప్రస్తుతం ఉన్నది కొత్త రూపు సంతరించుకున్న కరోనాగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిని స్పెయిన్‌లో జూలై నెలలోనే గుర్తించారు. ఆ దేశాన్ని సందర్శించిన లక్షలాది మంది ప్రజల ద్వారా యూరప్‌ అంతటా వ్యాపించిందని పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories