పాకిస్థాన్‌పై తాలిబన్లు కన్నేశారా.. పాకిస్థాన్‌ను వణికిస్తున్న టీటీపీ..

TTP Red Line for Pakistan
x

పాకిస్థాన్‌పై తాలిబన్లు కన్నేశారా.. పాకిస్థాన్‌ను వణికిస్తున్న టీటీపీ.. 

Highlights

పాకిస్థాన్‌పై తాలిబన్లు కన్నేశారా.. పాకిస్థాన్‌ను వణికిస్తున్న టీటీపీ..

Pakistan: ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారంటే ఇదేనేమో.. కశ్మీరును సొంతం చేసుకోవాలని ఉగ్రవాదాన్ని సృష్టించింది పాకిస్థాన్‌. ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్థాన్‌ ఆక్రమణకు సిద్ధమవుతోంది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో మారణ హోమం సృష్టించాలని పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ, ఆర్మీ కుట్రలు పన్నేవి. అచ్చం అవే ప్లాన్లను ఇప్పుడు తెహ్రికే తాలిబన్‌ పాకిస్థాన్‌-టీటీపీ ఉగ్ర సంస్థ అమలు చేస్తోంది. దాడులు, మానవ బాంబులతో పాక్‌ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మానవబాంబు దాడికి దిగింది. ఒక పోలీసు అధికారి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే రెండు పోలీసు స్టేషన్లను టీటీపీ సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పాకిస్థాన్‌ తాలిబన్లు రెచ్చిపోతున్నారు.

ఉగ్రవాదులకు స్వర్గధామం పాకిస్థాన్. పొరుగు దేశాలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో తనకు తనే సాటి. ఆత్మాహుతి దాడులు ఎలా చేయాలి? ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఇలాంటి పాఠాలు బోధించేందుకు యూనివర్సిటీలాంటిది దాయాది దేశం. కశ్మీరును సొంతం చేసుకోవాలని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి.. మారణ హోమాన్ని సృష్టించింది. ఎన్నో దాడులకు కుట్రలకు పన్నింది. పార్లమెంట్‌పై దాడులు, ముంబై, హైదరాబాద్‌, పుల్వామా ఇలా ఒకటేమిటి వందల దాడులను ఉగ్రవాదులతో చేయించింది. అయితే ఇటీవల కాలంలో భారత్‌ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకుంది. సముద్ర తీరంలోనూ గస్తీని పెంచింది. జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. జమ్ము-కశ్మీర్‌ను, లడక్‌ను వేరుచేసింది. మన దేశంలో ఉగ్రవాదులకు చెక్‌ పడింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం మాత్రం కశ్మీర్‌ లక్ష్యంగా ఇప్పటికీ కుట్రలను పన్నుతోంది. ఉగ్రవాదులతో పాకిస్థాన్‌ ఇన్నాళ్లు ఆడిన ఆటలకు ఇప్పుడు చెక్‌ పడింది. కశ్మీర్‌ లక్ష్యంగా దాయాది దేశం పన్నిన కుట్రలను ఉగ్రవాదులు మాత్రం మరచిపోలేదు. ఇప్పుడు అవే ప్లాన్‌లను సొంత దేశంపై ప్రయోగిస్తున్నారు. నిత్యం బాంబులతో పాటు సుసైడ్‌ బాంబర్లతో దాడులకు దిగుతున్నారు. సుసైడ్‌ దాడులను ప్లాన్‌ వేసిన ఆ పాకిస్థానే... సూసైడ్‌ దేశంగా మారుతోంది. టీటీపీ దాడులతో పాకిస్థాన్‌లో భయాందోళనలు పెరుగుతున్నాయి. అసలు పాకిస్థాన్‌లో దాడులకు దిగుతున్న ఉగ్రవాదులు ఎవరు? ఎందుకు వారు పాక్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?

పాకిస్థాన్‌ను వణికిస్తున్న ఉగ్ర సంస్థ తెహ్రికే పాకిస్థాన్‌ తాలిబన్‌-టీటీపీ ఉగ్రసంస్థ. దీన్నే సింపుల్‌గా పాకిస్థాన్ తాలిబన్‌ అని కూడా పిలుస్తారు. టీటీపీ జెండా, ఎజెండా మాత్రం తాలిబన్లకు సహాయం చేయడం. 2021 ఆగస్టులో తాలిబన్లు కాబుల్‌ను వశపరుచుకోవడంతో అక్కడితో పాకిస్థాన్ తాలిబన్‌ లక్ష్యం పూర్తయ్యింది. అక్కడితో టీటీపీ ఆగిపోలేదు.. ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని ఎంచుకుంది. అది మరేదో కాదు.. పాకిస్థాన్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి సారించింది. పాకిస్థాన్‌ను కూడా తాలిబన్‌ స్టేట్‌గా మార్చేందుకు సిద్ధమైంది. కశ్మీర్‌పై దాడులకు పాకిస్థాన్‌ నేర్పిన విద్యనే.. ప్రయోగిస్తోంది. తాజాగా ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందగా.. మరో నలుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి ఇస్లామాబాద్‌లోని ఐ-10 సెక్టారులోని నైరుతి ప్రాంతంలో జరిగింది. సరిగ్గా ఇది రావల్పిండి సరిహద్దులో ఉంటుంది. అంతేకాదు పాకిస్థాన్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. అక్కడి చెక్‌ పాయింట్‌ వద్ద సుసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చుకున్నాడు. టాక్సిలో ఓ మహిళతో కలిసి సుసైడ్‌ బాంబర్ వెళ్లాడు. అతడిని భద్రతా అధికారులు ఆపేయడంతో దాడికి దిగాడు. కారు అనుమానాస్పదంగా వస్తుండడంతో తనికీల కోసం కారును ఆపేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సుసైడ్‌ బాంబరు కారు వెనుకకు వెళ్లి పేల్చుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. టెర్రరిస్టులు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయినట్టు వివరిస్తున్నారు. అయితే ఈ సుసైడ్‌ బాంబర్‌ దాడి తమదేనని పాకిస్థాన్‌ తాలిబన్లు ప్రకటించారు.

నిజానికి ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వ హయాంలో పాకిస్థాన్‌ తాలిబన్‌ ఉగ్ర సంస్థతో సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో టీటీపీ దాడులకు తెగబడుతోంది. ఇటీవల బీ రెడీ అంటూ టీటీపీ ఇస్లామాబాద్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. భారీ విధ్వంసం, మరిన్ని ఉగ్రదాడులు చేస్తామని పరోక్షంగా చెప్పింది. 12 నెలలుగా పాకిస్థాన్‌లో వరుసబెట్టి భీకర దాడులను టీటీపీ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాక్‌, అప్ఘానిస్థాన్‌ సరిహద్దులోని డ్యూరాండ్‌ లైన్‌ వద్ద టీటీపీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 22న పెషావర్‌లోని పోలీసు పోస్టుపై గ్రనేడ్‌ దాడి చేసింది తామేనని టీటీపీ ప్రకటించింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 23న అప్ఘానిస్థాన్‌ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లోని హస్సన్‌ ఖేల్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పాక్‌ సైనికులు మృత్యువాత పడ్డారు. గత నెలలో ఆరుగురు పాకిస్థాన్‌ పోలీసులను టీటీపీ చంపేసింది. ఈ దాడి ఖైబర్‌ ఫక్తుంఖ్వాలోని లాకీ మార్వాత్‌లో పోలీసు వ్యాన్‌పై జరిగింది. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్టు పాకిస్థాన్‌ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా సైన్యం, పోలీసులను లక్ష్యంగానే ఈ దాడులు జరిగాయి. ప్రతి నెల ఏదో ఒకచోట తాలిబన్‌ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. 2022లో ఆ దేశంలో 51శాతం ఉగ్రదాడులు పెరిగాయి. పాకిస్థాన్‌ వ్యాప్తంగా 250కి పైగా దాడులు జరిగాయి. 434 మందికి పైగా భద్రతాధికారులు, పౌరులు మృతి చెందారు. 725 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే టీటీపీ ఉగ్రవాదులకు ఎవరు సాయం చేస్తున్నారు?

గతేడాది తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్-టీటీపీ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో టీటీపీ చీఫ్‌ నూర్‌వాలీ మెహసూద్‌ ఖైబర్‌ పక్తుంక్వాలోని ఉత్తరాది జోన్‌లో పర్యటించాడు ఈ సందర్భంగా టీటీపీ మద్దతుదారులను ఉద్దేశించి మెహసూద్‌ ప్రసంగించాడు. తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్ ప్రత్యేక సంస్థ కాదని.. అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్ల శాఖగా తెలిపాడు. అంటే టీటీపీ అనేది న్యూ ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్థాన్‌లో భాగంగానే పేర్కొన్నాడు. కొన్ని దశాబ్దాలుగా టీటీపీ ప్రత్యేక సంస్థగానే ప్రకటించుకుంది. కానీ దీన్ని ఎవరూ నమ్మలేదు. దీంతో పాకిస్థాన్‌పై తాలిబన్లు కన్నేసినట్టు తెలుస్తోంది. అఫ్ఘానిస్థాన్‌ను సొంతం చేసుకున్న విధానంలోనే పాకిస్థాన్‌ను కూడా ఆక్రమించేందుకు వ్యూహాన్ని పన్నినట్టుగా స్పష్టమవుతోంది. పాకిస్థాన్‌ అంతటా గందరగోళాన్ని సృష్టించి.. అస్థిరపరిచే ప్లాన్‌ టీటీపీ అమలు చేస్తున్నది. దీంతో ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడని పాకిస్థాన్‌ నిరూపించింది. తాను పాలు పోసి పెంచిన ఉగ్ర సంస్థ... ఇప్పుడు పాకిస్థాన్‌నే కబలిస్తోంది. 1989లో సోవియట్‌ దళాలు అప్ఘానిస్థాన్‌ను వదిలి వెళ్లాయి. పస్తూన్ తెగలను పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సమీకరించి.. యుద్ధ శిక్షణను ఇచ్చింది. వాయువ్య పాకిస్థాన్‌లో పోరాటానికి పస్తూన్‌ తెగలను పంపింది. వారికి ముజాహిద్దీన్‌ దళంగా పేరు పెట్టింది. ఆ తరువాత.. ముజాహిద్దీన్‌ దళం తాలిబన్‌ దళంలో కలిసిపోయింది. అప్ఘానిస్థాన్‌ను అమెరికా సొంతం చేసుకుంది. దీంతో తాలిబన్లకు పాకిస్థాన్‌ వ్యతిరేకంగా మారింది. దీంతో పాకిస్థాన్‌ సృష్టించిన ముజాహీద్దీన్‌ సంస్థే.. పాకిస్థాన్‌ తాలిబన్‌గా మారింది. అప్పటి నుంచి పాకిస్థాన్‌లో అత్యంత క్రూరమైన గెరిల్లా యుద్ధానికి దిగుతోంది. నార్త్‌ వెస్ట్‌ పాకిస్థాన్‌లో టీటీపీకి మంచి గ్రిప్‌ ఉంది. ఇటీవల టీటీపీ రెండు పోలీసు స్టేషన్లకు కూడా సొంతం చేసుకుంది.

టీటీపీ తీరును పరిశీలిస్తే క్రమంగా పాకిస్థాన్‌పై పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కోడి ఆహారం కోసం ఎక్కడికి వెళ్లినా.. తిరిగి సొంత గూటికి వస్తున్న చందంగా.. టీటీపీ నిత్యం దాడులతో పాక్‌ను వణికిస్తోంది. పాక్‌ మాత్రం టీటీపీని ఆపలేకపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories