US Iran War : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా మోజ్తబా ఖమేనీ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

US Iran War : ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీని ఎంచుకుంది. అమెరికా ఆమోదం లేకపోతే ఇరాన్ నాయకత్వం ఎక్కువ కాలం నిలబడలేదని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

CR Reddy
Published on: 9 March 2026 7:37 AM IST
Mojtaba Khamenei
X

 Mojtaba Khamenei

US Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన వారం రోజుల్లోనే, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని ఇరాన్ తన తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంచుకుంది. అయితే ఈ ఎంపికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తదుపరి నాయకత్వాన్ని మేమే నిర్ణయిస్తామన్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మోజ్తబా ఖమేనీ నాయకత్వాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను ఒక అసమర్థుడైన నాయకుడిగా అభివర్ణించిన ట్రంప్, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే వినాశనం తప్పదని హెచ్చరించారు. మమ్మల్ని సంప్రదించకుండా నాయకుడిని ఎంచుకుంటే వారి పదవీకాలం ముగిసినట్టే అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా చూడటమే మా లక్ష్యమని, పదే పదే ఇక్కడికి వచ్చి యుద్ధం చేసే ఉద్దేశం మాకు లేదని ఆయన అన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోతే తప్ప ఎలాంటి ఒప్పందాలు ఉండవని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ ఇరాన్ మా దారిలోకి వస్తే, ఆ దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మారుస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు.

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అంతే దీటుగా బదులిచ్చింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని, అవసరమైతే చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ అగ్రశ్రేణి అధికారి అలీ లారీజానీ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. "మా నాయకుడిని, మా ప్రజలను చంపినందుకు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. మేము నిర్దయాక్షిణ్యంగా ప్రతీకారం తీర్చుకుంటాం" అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

యుద్ధం నేపథ్యంలో పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ విచారం వ్యక్తం చేశారు. తమ పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు. అయితే, విదేశాంగ మంత్రి అరాగ్చీ దీనిని సమర్థిస్తూ.. ఇరాన్ కావాలని పొరుగు దేశాలను లక్ష్యం చేసుకోలేదని, ఆ దేశాల సరిహద్దుల్లో ఉన్న అమెరికా బలగాలనే తాము టార్గెట్ చేశామని చెప్పారు. అమెరికా దుందుడుకు చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, అమెరికా అధ్యక్షుడే ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం కాస్తా, అణ్వాయుధాల యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళన పెరుగుతోంది.

CR Reddy

CR Reddy

Next Story