డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇంతలో బాంబు పేలుడు: పెళ్లిలో మృత్యుఘోష.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇంతలో బాంబు పేలుడు: పెళ్లిలో మృత్యుఘోష.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
x
Highlights

Pakistan Wedding Suicide Blast Video: పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రాంతంలో పెళ్లి వేడుక విషాదాంతమైంది.

Pakistan Wedding Suicide Blast Video: పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రాంతంలో పెళ్లి వేడుక విషాదాంతమైంది. ఖురేషి మోర్ సమీపంలోని ప్రభుత్వ మద్దతుదారు, శాంతి కమిటీ అధిపతి నూర్ అలం మొహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అతిథులంతా నృత్యం చేస్తూ వేడుకగా గడుపుతున్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు దుర్మరణం చెందగా, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

కుప్పకూలిన ఇంటి పైకప్పు.. పెరిగిన ప్రాణనష్టం:

పోలీసుల కథనం ప్రకారం.. వేడుకలో డాన్స్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఆ ఇంటి పైకప్పు పూర్తిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాయపడిన వారిలో శాంతి కమిటీ నేత నూర్ అలం మొహసూద్ కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

టిటిపి (TTP) పనేనా?

ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు. అయితే, ఈ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న తెహరిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. బన్ను జిల్లాలో ఇటీవల శాంతి కమిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రభుత్వ స్పందన:

ఈ దాడిని ఖైబర్ ఫఖ్తుంక్వా ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రిది మరియు గవర్నర్ ఫైసల్ కరీం తీవ్రంగా ఖండించారు. శాంతి కమిటీ సభ్యులే లక్ష్యంగా ఉగ్రవాదులు బరితెగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories