రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌ బలగాల దెబ్బకు..

Russia Ukraine Updates
x

రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌ బలగాల దెబ్బకు..

Highlights

Russia Ukraine Updates: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

Russia Ukraine Updates: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 44 రోజులకు పైగా యుద్ధం చేస్తున్న రష్యాకు ఐక్యరాజ్య సమితి షాక్‌ ఇచ్చింది. బుచా నగరంలో మారణహోమానికి నిరసనగా మానవ హక్కుల మండలి నుంచి రష్యాను వెలివేసింది. తమకు వ్యతిరేకంగా ఓటేస్తే.. శత్రువులుగా భావిస్తామని రష్యా బెదిరించినప్పటికీ.. 93 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటేశాయి. ఈ ఓటింగ్‌లో రష్యాకు 24 దేశాలు మద్దతు పలికాయి. భారత్‌తో సహా 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మానవ హక్కుల మండలి నుంచి రష్యాను ఐక్యరాజ్య సమితి గెంటేసింది.

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది. అయినా ఇప్పటికీ ఆ రాజధాని నగరం కీవ్‌లో మాత్రం రష్యా సైన్యం అడుగుపెట్టలేకపోయింది. ఉక్రెయిన్‌ బలగాల గెరిల్లా పోరాటాల దెబ్బకు మాస్కో సేనలు విలవిలలాడాయి. గత్యంతరం కీవ్‌ పరిసరాలతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు తిరుగుముఖం పట్టాయి. మరికొన్ని నగరాలను రష్యా సైన్యం పూర్తిగా ధ్వంసం చేశాయి. అక్కడ శిథిలా ప్రాంతాల్లో తినడానికి తిండి కూడా లేకపోవడంతో రష్యా సేనలు వెనక్కి మళ్లాయి. అయితే దీనికి రష్యా కలరింగ్‌ ఇచ్చుకుంది. మానవతా దృక్పతంతోనే ఆయా ప్రాంతాలను ఖాళీ చేస్తున్నట్టు మాస్కో ప్రకటించింది. ఆయా ప్రాంతాలను ఖాళీ చేయడంతో ఉక్రెయిన్‌ బలగాలు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పుతిన్‌ సేనల సాగించిన దారుణ మారణకాండలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుచా నగరంలోని రష్యా సైన్యం ఊచకోత ప్రపంచానికి తెలిసింది.

బూచా నగరం ఊచకోతపై ప్రపంచ దేశాలు రష్యా సైన్యం తీరును ఖండించాయి. అమెరికా, ఐరోపా సమాఖ్యతో పాటు దేశాలు మాస్కోపై మరిన్ని ఆంక్షలను విధించాయి. బుచా నరమేధంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించాలని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా నిన్న మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వం తొలగింపుపై తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలిలో తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, 24 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్‌ సహా 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మానవ హక్కుల మండలి నుంచి రష్యా తొలగింపు ఖరారైనట్టేనని యూఎన్‌ వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్‌లు శాంతియుత మార్గంలో హింసకు ముగింపు పలకాలని మరోమారు భారత రాయబారి తిరుమూర్తి స్పష్టం చేశారు. అందుకే తాము ఓటింగ్‌కు అన్ని తీర్మానాల్లోనూ ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు మూర్తి తెలిపారు.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, చెర్నీహైవ్‌ ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనుదిరిగాయి. అయితే డాన్‌బాస్‌ ప్రాంతంపై పట్టు సాధించేందుకు రష్యా సైన్యం కదిలినట్టు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణమే డాన్‌బాస్‌ ప్రాంతం నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఉక్రెయిన్‌ బలగాలు హెచ్చరిస్తున్నాయి. తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యం భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు బుచా నగరం ఉచకోత తరహా ఘటనలు పునారవృతం కాకుండా కాపాడుకోవడానికి పాశ్చాత్య దేశాలు తమకు ఆయుధాలు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ కోరుతోంది. తాజాగా అస్ట్రేలియా ఆధునిక యుద్ధ వాహనాలను ఉక్రెయిన్‌కు అందించింది. ఇప్పటికే అమెరికా భారీగా ఆయుధ, ధన సాయం అందించింది. మరోవైపు రష్యాను కట్టడి చేసేందుకు మరిన్ని ఆంక్షలను విధించింది. తాజాగా పుతిన్‌ కూతుళ్లను లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రకటించింది. రష్యాను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఆ దేశంతో సాధారణ వాణిజ్య సంబంధాలను కూడా తెంచుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి భారత్‌ ఇంధనం, ఇతర వస్తువల దిగుమతిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories