Pahalgam Attack: 'మోదీ అబద్ధాలు చెబుతున్నారు...' మరోసారి నోరు పారేసుకున్న పాకిస్థాన్!

Pahalgam
x

Pahalgam: 'మోదీ అబద్ధాలు చెబుతున్నారు...' మరోసారి నోరు పారేసుకున్న పాకిస్థాన్!

Highlights

Pahalgam Attack: పహల్గాం దాడికి నేరుగా సంబంధం ఉన్న ఉగ్రవాదులపై భారత్ ఇప్పటికే తీవ్ర చర్యలు తీసుకుంటోంది.

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌పై ఆరోపణలు మోపుతూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో పాకిస్తాన్ పాత్రను నిరూపించేందుకు రష్యా, చైనా, ఇతర పాశ్చాత్య దేశాలతో కూడిన అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పత్రికా సమావేశంలో అభిప్రాయపడ్డారు.

రష్యా ప్రభుత్వ మద్దతు గల వార్తా సంస్థ రియా నొవోస్తీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ, "భారత్ లేదా మోదీ నిజం చెబుతున్నారా, లేదా అబద్ధం చెబుతున్నారా అనే విషయాన్ని అంతర్జాతీయ దర్యాప్తు బృందం తేల్చాలి" అని అన్నారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా మద్దతు పలికినట్లు తెలిపారు. దాడి గురించి పాకిస్తాన్ ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలు అవసరమని, ఖాళీ ఆరోపణలు వల్ల ప్రయోజనం లేదని ఆసిఫ్ చెప్పారు. పహల్గాం దాడి బాధ్యతను పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.

ఇదిలా ఉండగా, స్కై న్యూస్‌తో ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఖాజా ఆసిఫ్ పాకిస్తాన్ గతంలో ఉగ్రవాద సంస్థలను మద్దతు ఇచ్చిన విషయాన్ని అంగీకరించారు. "అమెరికా, పాశ్చాత్య దేశాల కోసం మూడుపదులకాలంగా మేము ఈ చెడు పనిలో పాల్గొన్నాం," అని పేర్కొన్నారు.

పాకిస్తాన్ గతంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా మరియు 9/11 తర్వాత అమెరికా పక్షాన ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చిందని ఆయన వివరించారు. దీనివల్లే పాకిస్తాన్‌కు తీవ్రమైన నష్టం వాటిల్లిందని కూడా గుర్తించారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేసిన తాజా వ్యాఖ్యలు, భారత్‌లో ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి. పహల్గాం దాడికి నేరుగా సంబంధం ఉన్న ఉగ్రవాదులపై భారత్ ఇప్పటికే తీవ్ర చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో అంతర్జాతీయ సమాజం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు మద్దతు తెలుపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories