విచిత్రం: పెట్రోల్ కంటే నీళ్లే ఖరీదు.. లీటర్ వాటర్ బాటిల్ రూ. 224! ఈ దేశం పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

విచిత్రం: పెట్రోల్ కంటే నీళ్లే ఖరీదు.. లీటర్ వాటర్ బాటిల్ రూ. 224! ఈ దేశం పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!
x
Highlights

వెనిజులాలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. అక్కడ పెట్రోల్ ధర కంటే పాలు, నీళ్ల ధరలే ఎక్కువగా ఉన్నాయి. లీటర్ వాటర్ బాటిల్ ఏకంగా రూ. 223 పలుకుతోంది.

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం అది. కానీ అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే.. బండిలో పెట్రోల్ కొట్టించుకోవడం కంటే, లీటర్ మంచి నీళ్ల బాటిల్ కొనడమే భారంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనిజులా (Venezuela) దేశం ఇప్పుడు ఇలాంటి వింత పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ధరల పట్టిక చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

వెనిజులాలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన భారతీయ కరెన్సీలో లెక్కగడితే అక్కడ ధరలు ఇలా ఉన్నాయి:

  • లీటర్ పెట్రోల్: రూ. 45.10 (చాలా చౌక)
  • లీటర్ పాలు: రూ. 160.60
  • లీటర్ మంచి నీళ్ల బాటిల్: రూ. 223.70
  • లీటర్ వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405 వరకు

ఎందుకీ దుస్థితి?

నికోలస్ మదురో అరెస్టు తర్వాత ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. అమెరికా విధించిన ఆంక్షల వల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ పతనానికి ప్రధాన కారణాలు ఇవే:

చమురుపైనే అతిగా ఆధారపడటం: వ్యవసాయం, తయారీ రంగాలను పూర్తిగా విస్మరించి కేవలం చమురు ఎగుమతులపైనే బతకడం ఆ దేశాన్ని దెబ్బతీసింది.

నిర్వహణ లోపం: నైపుణ్యం లేని వారికి కీలక పదవులు కట్టబెట్టడం వల్ల చమురు ఉత్పత్తి కూడా క్షీణించింది.

కరెన్సీ ముద్రణ: ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం విచ్చలవిడిగా నోట్లను ముద్రించింది. దీనివల్ల కరెన్సీకి విలువ లేకుండా పోయి 'హైపర్ ఇన్‌ఫ్లేషన్' (అతి ద్రవ్యోల్బణం) ఏర్పడింది.

చేతిలో కట్టల కొద్దీ నోట్లు ఉన్నా..

ప్రస్తుతం వెనిజులాలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలన్నా సంచుల కొద్దీ కరెన్సీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి. స్థానిక కరెన్సీకి విలువ లేకపోవడంతో లావాదేవీలన్నీ కష్టతరంగా మారిపోయాయి. సామాన్యులు తాగునీటి కోసం కూడా తమ సంపాదనలో సింహభాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories