నీకు కొంచెం కూడా మానవత్వం లేదా.. ఇమ్రాన్‌‌కు కర్రు కాల్చి వాతపెట్టిన పాక్ సుప్రీం కోర్టు

Pakistan Supreme Court Slams PM Imran Khan in Army School Massacre Case
x

నీకు కొంచెం కూడా మానవత్వం లేదా.. ఇమ్రాన్‌‌కు కర్రు కాల్చి వాతపెట్టిన పాక్ సుప్రీం కోర్టు

Highlights

Pakistan: మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌‌ఖ‌ాన్‌కు అవెవీ పట్టినట్టు లేవు.

Pakistan: మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌‌ఖ‌ాన్‌కు అవెవీ పట్టినట్టు లేవు. ఒకవైపు ఇంటాబయటా తనపై రచ్చరచ్చ సాగుతున్నా, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా, తుడిచేసుకునిపోతున్న ఇమ్రాన్‌‌కు, ఆ దేశ సుప్రీంకోర్టు కర్రుకాల్చి వాతపెట్టినంత పని చేసింది. ఈడ్చి ఒకటి ఇచ్చింది.

పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తీరుపై తీవ్రంగా స్పందించింది. స్కూల్‌ పిల్లల ఉసురుతీసిన ఉగ్రవాద సంస్థతో చర్చలేంటని నిలదీసింది. ఒక ప్రధానిగా మీకు బాధ్యత, కనీసం మానవత్వంలేదా అంటూ లాగి లెంపకాయి ఇచ్చింది. పాకిస్తాన్‌ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్తాన్‌తో, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న మరుసటిరోజే, ఆ సంస్థ చేసిన ఊచకోతపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై ఈ ఉగ్రసంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది స్కూల్‌ విద్యార్థులు, టీచర్లు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు ఇమ్రాన్‌ ఖాన్. ప్రశ్నల వర్షం కురిపించి, ఒక రకంగా ఇమ్రాన్‌ను కుళ్లబొడిచింది న్యాయస్థానం.

చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా అని ఇమ్రాన్‌ను క్వశ్చన్‌ చేసింది పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం. 'మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు' అని ఇమ్రాన్‌‌ ఖాన్‌ను నిలదీశారు సీజే అహ్మద్‌. ఆనాడు తాము అధికారంలో లేమని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థికసాయం చేశామని ఇమ్రాన్‌ బదులివ్వడం పట్ల కూడా కోర్టు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రుల గాయాలపై కారం రాసినట్టుగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి సీరియస్‌ అయ్యారు.

కేవలం సుప్రీం కోర్టు మాత్రమే కాదు, ఇమ్రాన్‌ ఖాన్‌‌ నిర్ణయం పట్ల, బాధిత కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. పసిపిల్లల ప్రాణాలు తీసిన హంతక ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరపడమేంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. వారిని పట్టుకుని, ఉరికంబం ఎక్కించాల్సిందిపోయి, టీలు, బిస్కెట్లు, బిర్యానీలతో మంతనాలు జరపడమేంటని రగిలిపోతున్నారు.

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ఎన్నో ఘనవిజయాలు అందించిన కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా ఇమ్రాన్‌ఖాన్‌ను ఇప్పటికీ అభిమానిస్తారు జనం. దేశానికి కూడా అదేరీతిలో సేవ చేస్తాడని నమ్మారు. ఎన్నో ఏళ్లు పోరాటం కూడా చేసిన ఇమ్రాన్, తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఉగ్రవాదాన్ని రూపుమాపుతానని చెప్పారు. దేశాన్ని అభివృద్ది పథాన నడిపిస్తానని హామి ఇచ్చారు. కానీ చెప్పిన మాటలకు, చేతలకు అస్సలు పొంతనలేదు. అందరు ప్రధానుల్లాగే, అపసవ్యదిశలో పాకిస్తాన్‌ను నడుపుతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్. అభివృద్ది మాటేమో గానీ, ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిరుద్యోగం పెరిగింది. సరిహద్దుల్లో భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకే ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. ఖజానాలో డబ్బుల్లేక ప్యాలెస్‌‌ను అద్దెకుపెట్టారు. కార్లు, గుర్రాలు, బర్రెలు, వేలానికి పెట్టాడు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను మరింత అవమానకరంగా మార్చేశాడు.

పాకిస్తాన్‌లో తిష్టవేసిన ఉగ్రసంస్థలను అసలు టచ్‌ చెయ్యడంలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడేలా, లాబీయింగ్‌ చేశారు. చివరికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌‌తోనూ కయ్యం పెట్టుకున్నాడు. ఐఎస్‌ఐలో తనకు అనుకూలమైన వారికే పదవులివ్వాలని, పంతం పెట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూపోతే, పాకిస్తాన్‌ను మరో 20 ఏళ్లు వెనక్కుతీసుకెళ్లడాడని, అక్కడి ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు తలంటుపోసింది. పిల్లలను దారుణంగా చంపేసిన ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకోకుండా, వారితో ముచ్చట్లేంటని కసురుకుంది. ఇన్ని తిట్లు, విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇమ్రాన్‌ఖాన్‌లో మాత్రం మార్పు రావడం లేదని, అక్కడి ప్రతిపక్ష పార్టీలు, జనం ఈసురోమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories