ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా..? అవిశ్వాస తీర్మానంపై...

Pakistan Political Crisis Opposition Demanding Imran Khan Resign | Pakistan Live Updates
x

ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా..? అవిశ్వాస తీర్మానంపై...

Highlights

Pakistan - Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ కూడా విశ్వాసాన్ని వదులుకుంది...

Pakistan - Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ఇస్లామాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ ర్యాలీలో రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అక్రమ విదేశీ విరాళాలు పొందారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక రోజు ముందు ఆయన ర్యాలీలో ప్రసంగించనున్నారు. పాక్ ప్రధానిపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ్టి ర్యాలీలో తన రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే, అదే సందర్భంలో ముందస్తు ఎన్నికలను ప్రకటించి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపే అవకాశాలు ఉన్నాయి.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ కూడా విశ్వాసాన్ని వదులుకుంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా ఆర్మీని విభజించాలని ఆయన ప్రయత్నాలు చేశారని ఆర్మీ గర్రుగా ఉంది. అంతేకాదు, ఆర్మీ చీఫ్ జనరల్ పదవీ కాలాన్ని పొడిగించడానికి ఇమ్రాన్ కావాలనే తాత్సారం చేశారనే కోపం ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధం అయ్యాయి. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకే చెందిన కనీసం రెండు డజన్ల చట్టసభ్యులు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఓటు వేస్తామని స్పష్టంగా ప్రకటించారు.

దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ధరల పతనానికి ఇమ్రాన్ ఖాన్ కారణం అని పేర్కొంటూ పీఎంఎల్ఎన్, పీపీపీ పార్టీలకు చెందిన సుమారు 100 మంది చట్టసభ్యులు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సభాధ్యక్షుడికి వినతి చేశారు. 342 సభ్యుల నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిలవాలంటే కనీసం 172 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, ఖాన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మూడు మిత్ర పార్టీలూ ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తామన్నట్టుగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. కాగా, కనీసం 24 మంది పీటీఐ సభ్యులు ఇప్పటికే తిరుగుబాటును ప్రకటించారు.

ఈ అవిశ్వాస తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ, దాన్ని ప్రవేశపెట్టకుండానే సభను వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఫిబ్రవరి 14న మరణించిన ఓ చట్ట సభ్యునికి నివాళిగా మార్చి 28వ తేదీ వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అదే సందర్భంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే కనీసం మూడు నుంచి ఏడు రోజులపాటు దానిపై చర్చించి ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని, అది ఇప్పుడు సాధ్యపడదని పేర్కొన్నారు. కాబట్టి, వచ్చే సెషన్‌లోనే ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.

కాగా, విదేశాల నుంచి నిషేధిత చోట్ల నుంచి పీటీఐకి ఫండింగ్ వచ్చిందని, అక్రమ సొమ్ము వచ్చి చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు దీనికి సబంధించిన రిపోర్టు సమర్పించారు. ఈ వ్యవహారం కూడా తీవ్రరూపం దాల్చింది. ఈ అక్రమ సొమ్ముకు సంబంధించిన కేసులో సోమవారం ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories