Top
logo

చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ రానుందా.. మరో రకం కరోనా పుట్టేందుకు చైనా పరోక్షంగా సహకరిస్తోందా ?

చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ రానుందా.. మరో రకం కరోనా పుట్టేందుకు చైనా పరోక్షంగా సహకరిస్తోందా ?
X
Highlights

ఈ రోజు మనం మాట్లాడుకుందాం చైనా గబ్బిలాల మార్కెట్ల గురించి. చైనాలో కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గనే లేదు...

ఈ రోజు మనం మాట్లాడుకుందాం చైనా గబ్బిలాల మార్కెట్ల గురించి. చైనాలో కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గనే లేదు అంతలోనే గబ్బిలాల మార్కెట్ల గేట్లు తెరుచుకున్నాయి. వాటిని తినేందుకు చైనీయుల నోళ్ళు కూడా తెరుచుకున్నాయి. నిజానికి ఇలాంటి జంతు మార్కెట్లే కరోనా వైరస్ పుట్టుకలో కీలకపాత్ర వహించాయని అంతా భావిస్తున్నారు. అలాంటి సమయంలో చైనా గబ్బిలాల మార్కెట్లను మళ్లీ ఎందుకు ఓపెన్ చేసిందనేదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

కరోనా వైరస్ పుట్టిందే గబ్బిలాల మార్కెట్ నుంచి అని అంటారు. అంతే కాదు ఆ వైరస్ పురుడు పోసుకుంది గబ్బిలాల నుంచే అని కూడా చెబుతారు. ఒక్క మనిషి మాంసం తప్ప దేన్నయినా చైనా వాళ్ళు ఆబగా తినేస్తుంటారు. గబ్బిలాలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, పాములు, కప్పలు, తేళ్లు దేన్నీ వదిలిపెట్టరు. ఇలాంటి ఆహార అలవాట్లే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. చైనా తమది బలమైన ప్రభుత్వమని చెప్పుకుంటుంది. మరి అలాంటి ప్రభుత్వం సైతం జంతుమార్కెట్లను ఎందుకు నియంత్రించలేకపోతున్నది ? చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ రానుందా ? మరో రకం కరోనా పుట్టేందుకు చైనా పరోక్షంగా సహకరిస్తోందా ? ఇలాంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

చైనా అనగానే మొదట గుర్తుకొచ్చేది వారి ఆహార అలవాట్లే. మనం కూరగాయలను కొనుక్కున్నంత తేలిగ్గా వారు రకరకాల జంతువులను వెట్ మార్కెట్లలో కొనుక్కుంటారు. ఈ మార్కెట్లలో మనిషి మాంసం తప్ప అన్ని రకాల జంతువుల మాంసాలు లభిస్తాయి. చాలా చోట్ల సజీవంగానే ఆ జంతువులను అమ్ముతుంటారు. గబ్బిలాలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, పాములు, కప్పలు, తొండలు, అలుగు, తేళ్లు ఇలా అన్ని రకాలూ అక్కడ దొరుకుతాయి. సాధారణంగా ఈ మార్కెట్లను వెట్ మార్కెట్లు గా వ్యవహరిస్తుంటారు. అందుకు కారణం మాంసం తాజాగా ఉండేందుకు భారీ స్థాయిలో ఐస్ ఉపయోగిస్తుంటారు. దుకాణాలను శుభ్రం చేసేందుకు నీళ్ళను బాగా వాడుతుంటారు. దాంతో ఆ మార్కెట్లు ఎప్పుడూ తడి తడిగానే ఉంటాయి. అందుకే వాటిని వెట్ మార్కెట్ అంటుంటారు. కరోనా వైరస్ మాత్రమే కాదు ఆ తరహాకే చెందిన సార్స్ అనే వైరస్ కూడా ఇలాంటి మార్కెట్లలోనే పుట్టిందని చెబుతారు. గత 50 ఏళ్లలో పుట్టుకొచ్చిన రకరకాల వైరస్ లలో సుమారు 60 శాతం జంతువుల నుంచి వచ్చినవే. అడవి జంతువుల నుంచి పుట్టుకొచ్చిన వైరస్ లు కూడా అధికంగానే ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఈ తరహా వెట్ మార్కెట్లే.

చైనాలో వెట్ మార్కెట్లు మళ్లీ తెరుచుకునేందుకు ఓ ప్రధాన కారణం కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిందని అక్కడి వారు భావించడమే. రక రకాల జంతుమాంసాలు వారి రోజువారీ ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. వాటిని తినందే వారికి పూట గడవదు. ఓ మూడు నెలలుగా నోళ్ళు కట్టేసుకున్న చైనా ప్రజలు ఇప్పుడు మళ్లీ వెట్ మార్కెట్ బాట పట్టారు. ప్రజల నుంచి డిమాండ్ బాగా ఉన్న నేపథ్యంలో ఈ వెట్ మార్కెట్ లను నియంత్రించడం చైనా ప్రభుత్వానికి సాధ్యపడడం లేదు. ఒక వైపున యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో వణికిపోతున్నది. ఇప్పటికే సుమారు పది లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపున చైనాలోనూ ఈ వైరస్ ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పదుల సంఖ్యలో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. అంతే కాదు కరోనా వైరస్ తన ప్రస్తుత రూపాన్ని మార్చుకొని కొత్త రూపంతో రెండో దఫా చైనాను ముంచెత్తగలదన్న వార్తలూ వస్తున్నాయి. ఈ తరహా మార్కెట్ల కారణంగా మనుషుల నుంచి కొన్ని వైరస్ లు జంతువులకు సోకే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవేవీ చైనాకు పట్టడం లేదు. కరోనా వైరస్ రావడానికి ముందు ఎలా పని చేశాయో ఇప్పుడు అదే విధంగా ఆ వెట్ మార్కెట్లు పని చేస్తున్నాయి. మొత్తం మీద ఈ వెట్ మార్కెట్ల వ్యవహారం అంతా కూడా మాఫియా తరహాలో సాగుతుంటుంది. ప్రభుత్వం కూడా ఈ మాఫియాను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నదన్న విమర్శలూ ఉన్నాయి.

చైనా వారి ఆహార అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఆ ఒత్తిళ్ల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. చైనాలో ఓ నగరంలో కుక్కలు, పిల్లుల మాంసాన్ని నిషేధించారు. కరోనా విషయంలో యావత్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన చైనా ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకునేందుకూ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి.


వెట్ మార్కెట్ లో కుక్కలు, పిల్లులు లాంటి వాటిని పెద్ద పెద్ద బోన్లలో పెట్టి అమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో వాటిని వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేసి చంపుతారు. ఇరుకైన స్థలాల్లో కుక్కి ఊపిరాడనీయకుండా చేస్తారు. మరుగుతున్న నీళ్ళలో వేస్తారు. ఈ విధమైన చిత్రహింసలకు వ్యతిరేకంగా NO TO DOG MEET లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఓ వెలుగురేఖ కనిపిస్తోంది. చైనాలోని షెన్ జెన్ నగరపాలక సంస్థ కుక్కలు, పిల్లుల మాంస విక్రయాలను నిషేధించింది. భారీగా జరిమానాలను ప్రకటించింది. మే నెల నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే ఏదో ఒక్క నగరం ఈ తరహా చర్య తీసుకున్నంత మాత్రాన లాభం లేదు. యావత చైనాలోనూ ఇలాంటి నిషేధాలు రావాలి. అప్పుడు మాత్రమే చైనాతో పాటుగా యావత్ ప్రపంచం వైరస్ ల ముప్పు నుంచి కొంతమేరకైనా బయటపడగలగుతుంది.

కరోనా వైరస్ విషయంలో తప్పు మీద తప్పు చేసింది చైనా. దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తోంది. కరోనా వైరస్ ను పుట్టించిన చైనా దానికి పరిష్కారాలను అమ్ముకుంటోంది. అంతర్జాతీయ సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటోంది. వైద్య ఉపకరణాల కోసం మొన్నటి వరకూ అమెరికా పై ఆధారపడిన దేశాలు ఇప్పడు ఒక్కసారిగా చైనా వైపు చూస్తున్నాయి. వివిధ దేశాలకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలను చైనా భారీగా విక్రయిస్తోంది. ఒక్క స్పెయిన్ కే సుమారుగా 3500 కోట్ల రూపాయల విలువైన వస్తువులను అమ్మింది. ఇతర దేశాలకూ వాటిని జోరుగా విక్రయిస్తోంది. కాకపోతే చైనా మాల్ అంటేనే నాసి రకం. ఈ తరహా ఉపకరణాలు ప్రమాదకరమైన లోపాలతో ఉన్నట్లుగా స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్ లాంటి దేశాలు గుర్తించాయి. మొన్నటి వరకూ సిల్క్ రూట్ పేరిట భారీ రహదారి ప్రాజెక్ట్ చేపట్టిన చైనా ఇప్పడు మరో సిల్క్ రూట్ గురించి ఆలోచిస్తోంది. ఇటలీ దాకా హెల్త్ సిల్క్ రూట్ నిర్మించాలనుకుంటోంది. ఇటీవలే ఆ విషయమై ఇటలీలో చర్చలు కూడా జరిపింది. వైరస్ బూచి చూపెట్టి యావత్ ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. మొదట్లో రక్షణ ఉపకరణాలను విరాళంగా ఇస్తున్న చైనా ఆ తరువాత వాటిపై బేరసారాలు చేస్తోంది.

ప్రపంచీకరణకు అమెరికా లాంటి దేశాలు బాట వేస్తే ఆ అవకాశాన్ని చైనా సొమ్ము చేసుకుంది. అన్ని దేశాలకూ ఇదో గుణపాఠంగా మారింది. దాంతో గ్లోబలైజేషన్ స్థానంలో లోకలైజేషన్ కు ప్రాధాన్యం పెరిగింది. కరోనా ప్రభావంతో భారత్ లోనూ వైద్యరంగంలో ఒక్కసారిగా అనేక వినూత్న ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద చైనా కరోనా యావత్ ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. సాధారణ ప్రజానీకాన్ని ఇంట్లోంచి బయటకు రాకుండా కూడా చేసింది.

ఎవరి ఆహార అలవాట్లు వారివే. అందులో విమర్శించడానికేమీ ఉండదు. కాకపోతే నాగరిక సమాజానికి అభ్యంతరం కాని రీతిలో అవి ఉండాలి. పర్యావరణానికి చేటు చేసేవిగా, జంతు ప్రపంచానికి హాని చేసేవిగా మాత్రం ఉండకూడదు. ఈ భూగోళం మనిషిది మాత్రమే కాదు. సమస్త జీవరాశికి దానిపై హక్కు ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గౌరవించాలి. అప్పుడు మాత్రమే కరోనా వైరస్ లాంటి ఉపద్రవాల నుంచి మనం బైటపడగలుగుతాం. మరి ఈ విషయంలో చైనా ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.Web TitleIs Coronavirus Second wave ready to affect in China
Next Story