Delta Variant: ప్రపంచ దేశాలకు పొంచివున్న మరో ముప్పు

Delta Variant: యూరప్‌లో డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం అధికంగా ఉందన్న WHO * యూరప్‌లోని 19 దేశాల్లో 68.3శాతం డెల్టా కేసులు

Sandeep Eggoju
Published on: 27 July 2021 11:25 AM IST
Delta Variant is More Prevalent in Europe Says WHO
X
డబ్ల్యూహెచ్ఓ (ఫైల్ ఇమేజ్)

Delta Variant: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ ప్రభావం చాలా దేశాల్లో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూరప్‌లో డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం అధికంగా ఉందని WHO హెచ్చరించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ బలంగా ప్రబలే ప్రమాదముందని సూచించింది.

జూన్‌ 28 నుంచి జులై 11 మధ్య కాలంలో యూరప్‌ దేశాల్లో నమోదైన కేసుల్లో డెల్టా వేరియంట్‌వే అధికంగా ఉన్నట్లు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ వెల్లడించింది. ముఖ్యంగా యూరప్‌లోని 28 దేశాల్లో కనీసం 19 దేశాల్లో డెల్టా రకం ప్రభావమే ఎక్కువగా ఉందని సీడీసీ నిపుణులు కనుగొన్నారు. ఈ 19 దేశాల పాజిటివ్‌ కేసుల్లో సరాసరిగా 68.3శాతం కేసులు డెల్టా వేరియంట్‌ కేసులే ఉన్నట్లు గుర్తించారు. డెల్టా వేరియంట్‌ విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందుతుందనే నిర్ధారణకు వచ్చారు. దాదాపు అన్ని యూరప్‌ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇంకోపక్క.. అమెరికాలోనూ డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 83శాతం ఇవే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా చైనా వూహాన్‌ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ సోకిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వెలువడుతున్నట్లు ఒక అధ్యయనం తేల్చింది. డెల్టా వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి రావడం, మరణం ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటాయని మరో పరిశోధన పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా డెల్టా రకం మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story