Top
logo

చైనా వైఖరితో కరోనా టీకా పరిశోధనలకు సమస్యలు

చైనా వైఖరితో కరోనా టీకా పరిశోధనలకు సమస్యలు
X
Representational Image
Highlights

అమెరికాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ తయారుచేసిన వేక్సిన్‌ల పరీక్షలు మొదలయ్యాయి.

అమెరికాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ తయారుచేసిన వేక్సిన్‌ల పరీక్షలు మొదలయ్యాయి. ఈ వేక్సిన్‌ను మే నెలలో మానవులపై ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ,కాన్ సైనో బయాలజీస్ తయారు చేస్తున్న నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్ వేక్సిన్ పరిశోధనలు రెండో దశకు చేరుకున్నాయి. బీజింగ్ అడ్వాన్స్‌డ్ బయో టెక్నాలజీ, నోవియో సంస్థలు సంయుక్తంగా చేసిన టీకాల అభివృద్ధి క్లినికల్ ట్రయల్ దశకు చేరుకుంది. చైనాకు చెందిన మరో రెండు సంస్థలు కూడా ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ మెల్ బోర్న్, నెదర్లాండ్స్ కు చెందిన రాడ్‌బజౌడ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ తో పాటు మసాచుసెట్స్ వర్శిటీలు సంయుక్తంగా ఆస్ట్రేలియాలో పరిశోధనలు జరుపుతున్నాయి. జర్మనీకి చెందిన బయోన్‌టెక్,చైనాకు చెందిన పూసన్ ఫార్మా, ఫైజర్ సంస్థలు సంయుక్తంగా ఆర్ఎన్ఏ ఆధారిత వేక్సిన్ ను పరీక్షించేందుకు అనుమతులు పొందాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం టీకా వచ్చేలోపు ప్రివెన్షన్ ట్రీట్ మెంట్ లను ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు వేక్సిన్ ను అభివృద్ధి చేయగా మానవులపై ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. ఈ టీకా 80 శాతం ఫలితం ఇస్తోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం కొనసాగుతోన్న వేళ..బ్రిటన్ కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రయోగాలు ఊరట కలిగిస్తున్నాయి.‌ కరోనావైరస్ పై పోరాటానికి వ్యాక్సిన్ తయారు చేసిన ఈ యూనివర్శిటీ.. మానవ ప్రయోగాలను ప్రారంభించింది. ‌ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ నేతృత్వంలోని ఆక్స్ఫర్డ్ బృందం ట్రయల్స్ నిర్వహిస్తుండగా ఈ ట్రయల్ ప్రోగ్రాం కోసం దాదాపు 187 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

చింపాజీల్లోని అడెనో వైరస్ తో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్ తొలిదశలో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వారిపై వేక్సిన్ ను ప్రయోగించనుంది. రెండో దశలో 55 నుంచి 70 ఏళ్ల మధ్య వారిపై ప్రయోగాలు జరపనున్నారు. కరోనాలోని స్పైక్ ప్రొటీన్ ను అడెనో వైరస్ లో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు మానవశరీరంలో అవి కరోనాతో పోరాడతాయని తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారుచేసిన వేక్సిన్‌ను దాదాపు 5 వందల మంది వాలంటీర్లపై ప్రయోగం చేసి శాస్త్రవేత్తలు ప్రాథమిక అంచనాకు వస్తారని తెలుస్తోంది. ప్రయోగం విజయవంతం అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన మొదటి దేశం యూకే కానుందన్నారు బ్రిటీష్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్. మరో 22 మిలియన్ పౌండ్లతో లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో రెండవ టీకా ప్రాజెక్టుకు నిధులు సమకూర్చినట్లు తెలిపారు.

వాక్సిన్ తయారీపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా తీరుతో పరిశోధనలు గందరగోళంగా అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాల మధ్య సమన్వయం ముఖ్యమని చెబుతున్నారు. వీలైనంత త్వరగా వాక్సిన్ ప్రయోగాలు జరగకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు.

చైనా నుంచి‌ కరోనా వైరస్‌పై పూర్తి సమాచారం అందకపోవటంపై పరిశోధకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా మూలాలపై ఎలాంటి సమాచారం బయటకు వెళ్లొద్దని అక్కడి ప్రభుత్వంతో సహా యూనివర్శిటీలు ఆదేశాలు ఇచ్చాయి. ఇది కరోనా టీకా కోసం జరిగే పరిశోధనలపై ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు.

పరిశోధనల్లో విజ్ఞానాన్ని పంచుకునే వాతావరణం కల్పించాలని సూచించారు సింగపూర్ కు చెందిన వైరాలజిస్ట్ ఆస్టే జాన్. చైనా లాంటి దేశాలు సమాచారాన్ని కట్టడి చేసే చర్యలు తీసుకుంటే సమస్యాత్మకంగా మారుతుందని అంటువ్యాధుల పరిశోధకురాలు సారా కోబే అంటున్నారు. ఇక కరోనా వైరస్ టీకా కనుగొని దానిపై పట్టు సాధించాలనే కుట్రతోనే చైనా ఆంక్షలు విధిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అయితే చైనా మాత్రం ఎటువంటి అపోహలు సృష్టించొద్దన్న కారణంతో సమాచార కట్టడికి చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.

మరోవైపు ప్రయోగాలు పెరిగే కొద్దీ టీకా పరిశోధనలకు అవకాశాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. విస్తృత పరిశోధనలు జరగాలంటే సమన్వయం ముఖ్యమంటున్నారు. కొవిడ్ సమాచారం వేగంగా మారుతుండటంతో పరిశోధనలు మార్చుకునేలా సిద్ధంగా ఉండాలంటున్నారు.

Web TitleCoronavirus Updates Problems with covid-19 vaccine research with China attitude
Next Story