Top
logo

కరోనా పై వూహాన్ విజయానికి కారణమిదే!

కరోనా పై వూహాన్ విజయానికి కారణమిదే!
X
Wuhan
Highlights

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న అతిపెద్ద సంక్షోభం కరోనా. కంటికి కనిపించని ఈ వైరస్...

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న అతిపెద్ద సంక్షోభం కరోనా. కంటికి కనిపించని ఈ వైరస్ సృష్టిస్తోన్న బీభత్సంతో దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ కు భయపడి నిర్బంధంలో తలదాచుకుంటున్నాయి. ఓ చిన్న నగరంలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తోన్న ఈ వైరస్ ఎలా పుట్టింది...?

వుహాన్..ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసింది. చైనా మ్యాప్ లో ఎక్కడో ఉండే వుహాన్.. ప్రపంచదేశాలకు ముచ్చెటమలు పట్టించింది. కరోనా వైరస్ పుట్టింది ఇక్కడే ఒకరి నుంచి వేలాది మందికి వ్యాపించింది ఇక్కడే. డ్రాగన్ ని దడదడలాడించిన వైరస్ చివరకు ప్రపంచాన్నే షేక్ చేస్తోంది.

లక్షల మందిని పట్టిపీడిస్తోన్న ఈ కరోనా వైరస్ జన్మ స్థానం చైనాలోని వుహాన్ నగరం. హుబే ప్రావిన్స్ లోని ఈ నగరంలోని ఓ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. మొదటగా ఈ వైరస్ 57 సంవత్సరాల మహిళకు సోకిందని అధికారులు గుర్తించారు. 2019 డిసెంబర్ 10న జలుబు, జ్వరంతో బాధపడిన ఆ మహిళ ఇంజెక్షన్ చేయించుకున్నా తగ్గకపోవడంతో.. డిసెంబర్ 16న వూహాన్ యూనియన్ హెల్త్ కమిషన్ కు వెళ్ళగా పరిశీలించి హాస్పిటల్ కు తరలించారు.

కరోనాను వూహాన్ లో డిసెంబర్ నెల చివరలో గుర్తించామని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. అప్పట్లో దీనిని 'న్యూమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్' గా భావించినట్టు తెలిపింది. కరోనా వైరస్ ను గుర్తించిన తర్వాత 2019 డిసెంబర్ 30న వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ తన పరిధిలోని అన్ని మెడికల్ ఇనిస్టిట్యూట్లకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. న్యూమోనియా ఆఫ్ అన్ నౌన్ కాజ్ తో అడ్మిట్ అయిన పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అందులో సూచించింది. ఆ తర్వాత డిసెంబర్ 31 న కరోనా వైరస్ 27 మందికి వచ్చిందని ప్రకటిస్తూ జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక జనవరి 3న కరోనా వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సమాచారం ఇచ్చింది చైనా. జనవరి 11న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది. నెల రోజుల వ్యవధిలోనే చైనాలో 6 వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. దాంతో జనవరి 23న లాక్ డౌన్ ను ప్రకటించింది అయితే అప్పటికే చైనీస్ న్యూ ఇయర్ హాలీడేస్ కోసం అప్పటికే 50 లక్షల మందికిపైగా జనం సిటీని వదిలి వెళ్లిపోయారు. దాంతో వైరస్ మరింత విస్తరించింది.

జనవరి చివరినాటికి కరోనా ఇతర దేశాలకు కూడా విస్తరించటంతో అప్రమత్తమైంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చైనాలో కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయంటూ జనవరి 30న గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ నలభై రోజుల్లో ఓ ప్రళయాన్నే సృష్టించింది. రోజుకు వేల కేసులతో వుహాన్ సిటీ చిగురుటాకులా వణికింది. అక్కడితో ఆగకుండా చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించటం ప్రారంభించింది కరోనా. దాంతో రెండు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ మహమ్మారిని లాక్ డౌన్ అస్త్రంతో అంతం చేసింది చైనా.

76 రోజుల నిర్బంధం. స్తంభించిన జనజీవనం.. నిలిచిన రాకపోకలు.కఠిన నిర్ణయాలతో కరోనాను జయించిన వుహాన్ సిటీ

రోజురోజుకూ వేలకొద్దీ కేసులు పెరుగుతూనే ఉండటంతో వుహాన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం జనవరి 23 నుంచి వుహాన్ నగరాన్ని నిర్బంధించింది. ఆ తర్వాత హుబె ప్రావిన్స్ లోని దాదాపు 15 నగరాలను లాక్ డౌన్ చేసింది చైనా ప్రభుత్వం. లాక్ డౌన్ తో ప్రావిన్స్ పరిధిలో ఏకంగా 60 మిలియన్ల జనాభా ఇళ్లకే పరిమితమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే చైనా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో క్రమంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించారు.

మొదట లాక్ డౌన్ అమలులో ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది చైనా ప్రభుత్వం. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఎక్కువగా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఫిబ్రవరి 17 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంపై నిపుణులు చేసిన హెచ్చరికలతో అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. స్వేచ్ఛా ప్రపంచానికి అలవాటు పడిన ప్రజలను రోజుల తరబడి ఇంట్లో బందీలుగా ఉంచటం కష్టమైనప్పటికీ ఆ విషయంలో సక్సెస్ ఫుల్ కాగలిగింది చైనా ప్రభుత్వం.

రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటినుంచి ఒక్కరు బయటకు వెళ‌్లాలంటూ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అదీ ఒకసారి మాత్రమే. ఇక క్రిటికల్ ఏరియాలో అయితే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు టెక్నాలజీని కూడా వాడింది చైనా. ఇలా ఏకంగా 76 రోజులు వుహాన్ నగరాన్ని కఠిన నిర్బంధంలో ఉంచింది చైనా.

అయితే లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో వైద్య సేవల గురించి ఆలోచించలేకపోయింది అక్కడి ప్రభుత్వం. రవాణా స్తంభించటంతో వైద్య సేవలకు కావాల్సిన మెడికల్ కిట్స్ సరఫరా నిలిచిపోయింది. రోగుల్ని తరలించటం కూడా కష్టంగా మారింది. దీంతో కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఆర్మీని రంగంలోకి దింపిన ప్రభుత్వం మెడికల్ కిట్స్ పంపిణీ చేసింది.

కేవలం లాక్ డౌన్ ని సక్సెస్ చేయటమే కాకుండా కరోనా టెస్టులను కూడా వేగవంతం చేసింది చైనా. ఇంటింటికి వైద్య సిబ్బందిని పంపి పరీక్షలు చేయించింది. అనుమానితులపై నిఘా పెట్టడం.. బాధితులను క్వారంటైన్ కు తరలించడం లాంటి చర్యలను పకడ్బందీగా అమలు చేసింది. ఇలా చైనా విధించిన లాక్ డౌన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వైరస్ ప్రభావాన్ని తగ్గించటంలో ఇదే కీలక పాత్ర పోషించింది.

చైనా తీసుకున్న నిర్ణయాలతో కరోనాను జయించిన వుహాన్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. 76 రోజుల లాక్ డౌన్ సంకెళ‌్ల నుంచి విముక్తి పొందింది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావటంతో వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది చైనా ప్రభుత్వం. దాంతో వుహాన్ లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎయిర్ వేస్, రైళ్ల సర్వీసులను పునరుద్ధరించారు. 11 వారాల తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేయటంతో వుహాన్ లోని షాపింగ్ మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాయి.

మొదట్లో చైనా లాక్ డౌన్ విధించటంపై కాస్త వ్యతిరేకత వచ్చింది. వైరస్ ను అడ్డుకునేందుకు సోషల్ డిస్టన్స్ ఎంతమేరకు ఉపయోగపడుతోందనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ మందు లేని ఈ మహమ్మారిని తరిమేందుకు లాక్ డౌన్ యే అసలైన సమాధానం అని నిరూపించింది చైనా. కరోనాను చైనానే సృష్టించిందంటూ అభియోగాలు మోసినా చివరకు కరోనాపై పోరాటానికి మార్గదర్శనం చేసింది.


Web TitleChina's Wuhan lifts coronavirus lockdown
Next Story