అంతరిక్ష ఆక్రమణకు సిద్ధమవుతున్న డ్రాగన్ కంట్రీ.. చైనా తీరుతో ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా..?

Chinas Plans to go to the Moon
x

అంతరిక్ష ఆక్రమణకు సిద్ధమవుతున్న డ్రాగన్ కంట్రీ.. చైనా తీరుతో ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా..?

Highlights

China Space Station: డ్రాగన్ కంట్రీ చైనా అంతరిక్ష ఆక్రమణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికాను మించి స్పేస్ స్టేషన్ నిర్మాణంలో కీలక ముందడుగులు వేస్తోంది.

China Space Station: డ్రాగన్ కంట్రీ చైనా అంతరిక్ష ఆక్రమణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికాను మించి స్పేస్ స్టేషన్ నిర్మాణంలో కీలక ముందడుగులు వేస్తోంది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ అయిన డ్రాగన్ ఈ మిషన్‌లో ఏ మేరకు సక్సెస్ అవుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో ఏమాత్రం తేడా వచ్చినా ఊహించని ఉపద్రవం తప్పదన్న అంచనాలు ప్రపంచ దేశాలను సైతం భయపెడుతున్నాయి. ఇందుకు గతంలో చైనా ఫెయిల్యూర్ మిషన్స్ కూడా ఓ కారణమే. ఇంతకూ, డ్రాగన్ కంట్రీ అంతరిక్ష ఆక్రమణకు ఎందుకింతలా పరితపిస్తోంది..? 1970 నుంచి డ్రాగన్ అంతరిక్ష పరిశోధనల్లో ఏం సాధించింది..? 2045 నాటికి చైనా ఏం సాధించాలనుకుంటోంది..?

ప్రపంచాన్ని శాసించాలని కంకణం కట్టుకున్న డ్రాగన్ కంట్రీ అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అంటోంది. రీసెంట్‌గా అంతరిక్ష ఆక్రమణకు రంగం సిద్ధం చేసుకుంది. మరికొన్ని సంవత్సరాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పక్కనపెట్టే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని ఆక్రమించే దిశగా డ్రాగన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షంలో నిర్మించేందుకు తలపెట్టిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ పనులను వేగవంతం చేస్తోంది. 2045 నాటికి ఖగోళ శక్తుల్లో ఒక్కటిగా నిలవాలనే లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా టార్గెట్స్ ఇలా ఉంటే ప్రపంచ దేశాల్లో మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇందుకు కారణం డ్రాగన్ ఫెయిల్యూర్ మిషన్లే. గతంలో ఎన్నో పరిశోధనల్లో విఫలమైనా డ్రాగన్ కంట్రీ జనం నెత్తిన రాకెట్ శకలాలు పడి భారీగా మరణాలు సంభవించడానికి కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రాగన్ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణం ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. అసలు, అంతరిక్ష పరిశోధనల్లోకి డ్రాగన్ కంట్రీ ఎప్పుడు అడుగు పెట్టింది..? తియాంగాంగ్‌ నిర్మాణంతో చైనా సాధించేదేంటి..?

చైనా తొలిసారి 1970లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. అమెరికా, సోవియట్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ తర్వాత అంరిక్షంలోకి అడుగుపెట్టిన దేశంగా నిలిచింది. ఇక గత 10ఏళ్లలో బీజింగ్ 200 రాకెట్లును ప్రయోగించింది. ఇప్పటికే మానవరహిత వాహనాన్ని చంద్రుడిపైకి పంపడంలోనూ విజయం సాధించింది. తియాంగాంగ్‌ మిషన్‌లో భాగంగా తాజాగా పంపిన షెన్‌ఝూ-14తో కలిపితే మొత్తం 14 మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చింది. అంతరిక్షంలో చైనా చేపట్టిన స్పేస్‌ సెంటర్‌ పేరు టియాంగాంగ్‌. దీనికి సంబంధించిన తొలి మాడ్యూల్‌ను 2021 ఏప్రిల్‌లో అంతరిక్షంలోకి చేర్చింది. దీనికి మరిన్ని మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు.. అక్కడ సైన్స్‌ ల్యాబ్‌లను కూడా నిర్మించనుంది. వచ్చే ఏడాది స్పేస్‌ టెలిస్కోప్‌ ఝంటియాన్‌ను కూడా అంతరిక్షంలోకి చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక తియాంగాంగ్‌లో సొంతంగా విద్యుత్తు, ప్రొపెల్షన్‌, లైఫ్‌ సపోర్టింగ్‌ వ్యవస్థలతో పాటు వ్యోమగాములు నివసించేందుకు క్వార్టర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. తాజా నిర్మాణంతో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగలిగిన, స్పేస్‌ స్టేషన్‌ నిర్మించిన మూడో దేశాంగా చైనా నిలుస్తుంది. గతంలో సోవియట్‌ యూనియన్, అమెరికాలు దేశాలు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాయి.

మరోవైపు తియాంగాంగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత చైనా కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకుంది. మరికొన్ని సంవత్సరాల్లో భూమి సమీపంలోని గ్రహ శకలాల నుంచి నమూనాలు సేకరించాలని భావిస్తోంది. దీంతోపాటు 2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు అడుగుపెట్టేలా ఏర్పాట్లు చేసుకొంటోంది. 2022లో తియాంగాంగ్‌ నిర్మాణం పూర్తిచేయడం, 2025 నాటికి గ్రహశకలాల నమూనాల సేకరణ, 2030 నాటికి మార్స్‌పై నుంచి నమూనాలను భూమికి చేర్చడం, గురు గ్రహంపైకి మానవరహిత వాహనం పంపడం, చంద్రుడి పైకి చైనా వ్యోమగాములు పంపడం, 2035 నాటికి పునర్వినియోగ రాకెట్ల తయారీ, 2040 నాటికి అణుశక్తితో పనిచేసే స్పేస్‌ షటిల్‌ తయారీ, 2045 నాటికి కీలక అంతరిక్ష శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చైనా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ షినూవా పేర్కొంది. మరోపక్క ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కూడా చంద్రుడిపైకి యాత్రలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా కూడా మరోసారి చంద్రుడిపై యాత్రకు సిద్ధమవుతుండగా భారత్‌, జపాన్‌, ద.కొరియా, రష్యా, యూఏఈ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌ 2030 నాటికి స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని భావిస్తోంది.

ఇదంతా ఒకెత్తయితే చైనా అంతరిక్ష ప్రయోగాల్లో భద్రతను లైట్ తీసుకుంటుందనే విమర్శలు ఎక్కువే. చాలా సందర్భాల్లో డ్రాగన్ ప్రయోగాలు విఫలమై రాకెట్లు, వాటి శకలాలు జనావాసాలపై పడి బీభత్సం సృష్టించిన సందర్భాలూ ఎన్నో గతేడాది అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం ప్రయోగించిన లాంగ్‌మార్చ్5బీ రాకెట్ పని చూర్తయ్యాక దాని శకలాలు ఎలాంటి నియంత్రణ లేకుండా భూవాతావరణంలోకి దూసుకొచ్చి మాల్దీవుల సమీపంలో కుప్పకూలాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా చైనాకు చెందిన గుర్తుతెలియని రాకెట్ శిథిలాలు మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పడినట్టు వార్తలొచ్చాయి. గతంలో సైతం లాంగ్‌మార్చ్ బీ శ్రేణి రాకెట్‌తో చైనా ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌లోని జనావాసాలపై పడి బీభత్సం సృష్టించాయి.

ఇటు చైనాలోని జిచాంగ్‌ వేదికపై భారీగా రాకెట్‌ ప్రయోగాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామాలను హెచ్చరించి ఖాళీ చేయించడం సర్వ సాధారణమైపోయింది. అమెరికా, ఇతర దేశాల రాకెట్‌ బూస్టర్లు సాధారణంగా సముద్రంలో కూలతాయి. కానీ, చైనా రాకెట్‌ బూస్టర్లు భూభాగాలపై పడుతుంటాయి. ఇక 1996లో ఫిబ్రవరి 15వ తేదీన లాంగ్‌మార్చ్‌ 3బీ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించింది. ఇది సమీపంలోని మైలిన్‌ అనే గ్రామంపై పడి పదుల సంఖ్యలో మరణించారని వార్తలొచ్చాయి. కానీ, చైనా మాత్రం ఆరుగురు చనిపోయారని, 57 మంది గాయపడినట్టు ప్రకటించింది. ఇదే ఘటనపై అమెరికా ఏజెన్సీలు మాత్రం కనీసం 200మంది చనిపోయినట్లు చెబుతున్నాయి. అయితే, ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసినవి మాత్రమే కానీ చైనా చాలా ప్రయోగాల్లో పూర్తిగా విఫలమైందన్నది అమెరికా ఏజెన్సీలు చెబుతున్న మాట.

సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే డ్రాగన్ కంట్రీ స్పేస్ స్టేషన్ నిర్మాణం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. చైనా 2045లోగా అనుకున్నది సాధిస్తే.. ఆ తర్వాత డ్రాగన్ తీరు ఎలాంటి ఉపద్రవాలను మోసుకొస్తుందో అన్న భయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో డ్రాగన్ కంట్రీ అంతరిక్ష ప్రయోగాలపై ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్కమాటలో ఇప్పటికే చిన్న దేశాల పాలిట శాపంగా పరిణమిస్తున్న డ్రాగన్ కంట్రీ అంతరిక్షంలోనూ తాను అనుకున్నది సాధిస్తే ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆందోళన కనిపిస్తోంది. ప్రధానంగా భారత్ సహా పలు దేశాలపై హ్యాకింగ్ కుట్రలకు తెరలేపుతున్న డ్రాగన్ అంతరిక్షంపై పట్టు సాధిస్తే మరిన్ని కుట్రలకు తెరలేపుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories