చంద్రుడిపై కన్నేసిన డ్రాగన్‌ కంట్రీ.. అమెరికా కంటే ముందుగానే జాబిలిపై...

China Plans More Moon Missions After Finding New Lunar Minera
x

చంద్రుడిపై కన్నేసిన డ్రాగన్‌ కంట్రీ.. అమెరికా కంటే ముందుగానే జాబిలిపై...

Highlights

Moon Missions: యుద్ధం, వాణిజ్యం.. ఏదైనా.. అమెరికాతో పోటీకి డ్రాగన్‌ కంట్రీ సై అంటోంది.

Moon Missions: యుద్ధం, వాణిజ్యం.. ఏదైనా.. అమెరికాతో పోటీకి డ్రాగన్‌ కంట్రీ సై అంటోంది. ఆర్టిమిస్‌ మిషన్‌ ద్వారా చంద్రుడిపై మళ్లీ కాలు పెట్టి.. ఏకంగా కాలనీలను కట్టేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే అమెరికా కంటే ముందే చంద్రుడిపై పాగా వేసేందుకు మిషన్‌ చాంగ్‌తో చైనా షాక్‌ ఇస్తోంది. నేలపైనే కాదు.. చంద్రుడిపైనా.. అమెరికాతో పోటీకి పడుతోంది. 2030లోగా ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చంద్రుడిపై మట్టి, రాళ్లను సేకరించి ఆరు కొత్త ఖనిజాలను గుర్తించిన బీజింగ్ దకూడుగా వ్యవహరిస్తోంది. మళ్లీ చంద్రుడిపై ప్రయోగాలనకు సిద్ధమవుతోంది. నింగి, నేలా కాదు చంద్రుడిపైనా అమెరికాతో ఫైట్‌కు డ్రాగన్ ఉవ్విల్లూరుతోంది.

ఇప్పటివరకు ప్రపంచం ఎన్నో భయంకరమైన యుద్ధాలను చూసింది. ఇప్పటికీ ఉక్రెయిన్ వంటి యుద్ధాన్ని ఆధునిక ప్రపంచం చూస్తోంది. యుద్ధం దేశాల సరిహద్దులను ఏనాడో దాటింది. యుద్ధం కొత్త మలుపు తీసుకోబోతోంది. ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రదేశం అమెరికాతో ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీ పోటీ పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు భూ గ్రహం ఆవలకు విస్తరించింది. పరిశోధనల పేరిట ఏకంగా జాబిల్లిని సొంతం చేసుకునేందుకు అమెరికా, చైనా తహతహలాడుతున్నాయి. తామే ముందు సొంతం చేసుకోవాలని ఆగ్రదేశం ఆర్టిమిస్‌-1 పేరిట ఇప్పటికే ప్రాజెక్టును ప్రకటించింది. చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆర్టిమిస్‌ను చేపట్టింది. జాబిలి పైకి చేపడుతున్న ఈ యాత్రలో శక్తిమంతమైన రాకెట్‌తో సహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు ఆగస్టు 29న తొలిసారి ప్రయోగం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. కానీ ఇంధన లేకేజీ కారణంగా వాయిదా పడింది. ఈనెల 3న మరోసారి ప్రయోగానికి సిద్ధం చేయగా మళ్లీ ఆదే సమస్యతో వాయిదా వేసింది. అయితే సమస్యలను అధిగమించి ఆర్టిమిస్‌-1ను విజయవంతం చేయాలని అమెరికా తీవ్రంగా శ్రమిస్తోంది.

నిజానికి చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో నీటి ఆనవాళ్లు ఉన్నట్టు ఎప్పుడో నిర్ధారించారు. దీంతో ఆ ప్రాంతంపై నాసా ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై మనిషి అడుగు పెట్టేందుకు అనువుగా ఉండే 13 ప్రాంతాలను నాసా గుర్తించింది. 2025 నాటికి చంద్రుడిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు ఆర్టిమిస్‌ ప్రాజెక్టును మూడు భాగాలుగా విభజించింది. ఆర్టిమిస్‌-1 ప్రయోగం ద్వారా మానవ రహితంగానే చంద్రుడి కక్షలోకి వెళ్లి రానున్నది. 2024లో చేపట్టే ఆర్టిమిస్‌-2లో మనుషులను పంపేలా అమెరికా ప్లాన్‌ వేసింది. 2025లో ఆర్టెమిస్‌-3లో చంద్రుడిపై కాలుమోపేలా సిద్ధం చేసింది. అంటే మూడేళ్లలో జాబిలిని సొంతం చేసుకోవాలన్న లక్ష్యాన్ని అమెరికా నిర్ధేశించుకుంది. దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ చంద్రుడిపై ప్రయోగాలను అమెరికా ముమ్మరం చేసింది. వచ్చే పదేళ్లలో అక్కడ ఏకంగా కాలనీలను కట్టేందుకు నాసా సిద్ధమవుతోంది. అమెరికా ఏం చేసినా ఇటీవల చైనా కాపీ కొడుతోంది. అవి ఆయుధాలైనా యుద్ధ విమానాలైనా నౌకలైనా కాపీ కొట్టడమే కాదు అమెరికాకు గట్టి సవాల్‌ కూడా విసురుతోంది. ప్రపంచ ఆదిపత్యం నీది కాదు నాది అంటూ డ్రాగన్‌ రంకెలేస్తోంది. చంద్రుడిపై మనిషి దిగేందుకు అణువుగా ఉన్నాయని గుర్తించిన ఆ 13 ప్రాతాలనే ఇప్పుడు చైనా టార్గెట్‌ చేసింది. అమెరికా కంటే ముందే జాబిల్లిని సొంతం చేసుకునేందుకు డ్రాగన్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

ఇప్పటికే జలాలు, నేలపై ఆధిపత్యం సాధించాలని డ్రాగన్ కంట్రి ప్రయత్నాలను ముమ్మర చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 80కి పైగా దేశాలకు భారీగా అప్పులు ఇచ్చిన తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆయా దేశాల పరిధిలో పోర్టులను తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని యత్నిస్తోంది. అమెరికాకు చెక్‌ పెట్టేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. అమెరికాకు వ్యతిరేక దేశాలన్నింటిని ఒకతాటిపైకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటి దేశాలతో జట్టు కడుతోంది. ఇక నింగిలోనూ ఆధిపత్యం వహించేందుకు ఏకంగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు భూమికి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడిపై డ్రాగన్‌ కన్నేసింది. అమెరికా కంటే ముందే అక్కడ పాగా వేసి ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడిపై మెల్లగా తన ముద్రను వేసేందుకు బీజింగ్‌ దూసుకెళ్తోంది. 2020లో జాబిలిపై పరిశోధనలకు చైనా చాంగ్‌-5 మిషన్‌ను పంపింది. ఇందులో భాగంగా ద్వారా చంద్రుడిపై రాళ్లను, అక్కడి మట్టిని బీజింగ్‌ సేకరించింది. దీంతో చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించిన మూడో దేశంగా చైనా అవతరించింది. ఇప్పటివరకు చంద్రుడిపై నమూనాలను కేవలం అమెరికా, రష్యా మాత్రమే సేకరించాయి. చండ్రుడిపై నీటి ఆనవాళ్లతో పాటు ఆరు కొత్త కనిజాలను కూడా చైనా గుర్తించింది.

ఇక చైనా అమెరికాకు పోటీని ఇవ్వగలదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే అమెరికాను మించి చైనా చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1960 నుంచి 1972 వరకు సోవియట్‌ రష్యాతో పోటీ పడి అమెరికా అంతరిక్ష పరీక్షలను నిర్వహించింది. రష్యా కంటే ముందే చంద్రుడిపై కాలు పెట్టి చరిత్ర సృష్టించింది. ఆ తరువాత అమెరికా చంద్రుడిపై ఎలాంటి ప్రయోగాలు చేపట్టలేదు. కానీ.. విశాల విశ్వంపై మాత్రం పరిశోధనలను ఆపలేదు. అంటే 50 ఏళ్లకుపైగా చంద్రుడిపై పరిశోధనలను అమెరికా ఆపేసింది. ఇదే డ్రాగన్‌కు ప్లస్‌ పాయింట్‌ అని నిపుణులు చెబుతున్నారు. 2020 నుంచి చైనా చంద్రుడిపై పరిశోధనలను ముమ్మరం చేసింది. వాషింగ్టన్‌తో కేవలం వాణిజ్య యుద్ధానికే బీజింగ్‌ పరిమితం కాలేదు. నింగి, నేలా ఎక్కడైనా అమెరికాతో పోటీకి డ్రాగన్ కంట్రీ సై అంటోంది. కానీ.. చైనా అంతరిక్ష సాంకేతికత.. అమెరికా కంటే.. ఏమంత పెద్దగా అభివృద్ధి చెందలేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఈ లెక్కన అమెరికా కంటే ముందే చంద్రుడిపై చైనా అడుగు పెట్టడం అనుమానమే అని చెబుతున్నారు. కానీ అమెరికాకు సాధ్యం కాని అంతరిక్ష కేంద్రాన్ని చైనా సొంతంగా నిర్మించుకుంటుందంటే డ్రాగన్‌ను అంత తక్కువగా లెక్కేయొద్దని మరికొందరు చెబుతున్నారు. ఏదైమనా అమెరికా మాత్రం అప్రమత్తమైంది. ఆర్టిమిస్‌-1ను సారి పక్కగా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

జాబిలిపై ప్రయోగాలకు భారత్ కూడా శ్రీకారం చుట్టింది. 2019 జులైలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 మిషన్‌ తుది మెట్టుపై విఫలమయ్యింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ విక్రమ్‌ క్రాష్‌ ల్యాండ్‌ అవడంతో భూమితో సంబంధాలు తెగిపోయాయి. నిజానికి ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇది ఆలస్యమైంది. చంద్రుడిపై భారత్‌ కూడా తన ముద్రను వేయాలని ఉవ్విల్లూరుతోంది. తాను కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడగలనని భారత్‌ నిరూపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories