భవిష్యత్ యుద్ధాలకు సన్నాహకంగా భారత్ పై ట్రయల్ ?

భవిష్యత్ యుద్ధాలకు సన్నాహకంగా భారత్ పై ట్రయల్ ?
x
Highlights

భారత్ పట్ల చైనా మరోసారి తన వికృత రూపాన్ని ప్రదర్శించింది. మొదట నేపాల్ ను భారత్ పైకి ఎగదోసింది. ఆ తరువాత సరిహద్దుల వద్ద కవ్వింపులకు పాల్పడింది. ఈ రెండు...

భారత్ పట్ల చైనా మరోసారి తన వికృత రూపాన్ని ప్రదర్శించింది. మొదట నేపాల్ ను భారత్ పైకి ఎగదోసింది. ఆ తరువాత సరిహద్దుల వద్ద కవ్వింపులకు పాల్పడింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఎదురుదెబ్బలు చవిచూసింది. నేపాల్ ఒక్కసారిగా చల్లబడింది. మరో వైపున చైనా సైతం సరిహద్దుల వద్ద అంతా ప్రశాంతమే అని ప్రకటించింది. ఈ రెండు ఉదంతాలు కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం చైనా వేసిన ఈ ఎత్తుగడల వెనుక వ్యూహాల గురించి.

యావత్ ప్రపంచం ఒక వైపున కరోనాతో అల్లాడిపోతోంది. ప్రపంచానికి ఈ వైరస్ ను అంటగట్టిన చైనా మాత్రం దాని బారి నుంచి ఇప్పటికే బయటపడింది. అదే అదునుగా తన సామ్రాజ్య విస్తరణకు దూకుడుగా ముందుకు సాగింది. హాంకాంగ్, తైవాన్ లను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసింది. పనిలోపనిగా భారత్ పై కూడా కయ్యానికి కాలు దువ్వింది. నిజానికి ఇవన్నీ వేర్వేరు సంఘటనలు కాదు వాటన్నిటి వెనుక చైనా లక్ష్యాలు మరెన్నో ఉన్నాయి.

1962 నాటి యుద్ధం తరువాత చైనా, భారత్ ల మధ్య కొన్ని దశాబ్దాలుగా పెద్దగా గొడవలేమీ జరుగలేదు. చిన్నపాటి సరిహద్దు తగాదాలు మాత్రం చోటు చేసుకున్నాయి. 2017లో డోక్లాం సంఘటన తరువాత ఆ స్థాయిలో రెండు దేశాల సైనికుల మధ్య బాహాబాహీ మాత్రం ఇప్పుడే చోటు చేసుకుంది. మధ్యలో అటు పాకిస్తాన్ ను, ఇటు నేపాల్ ను రెచ్చగొట్టిన ఉదంతాలు కూడా జరిగాయి. నేపాల్ విషయానికి వస్తే యుద్ధానికైనా సిద్ధం అంటూ రంకెలు వేసిన నేపాల్ ఒక్కసారిగా మాట మార్చింది. భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను చేరుస్తూ రూపొందించిన పటం విడుదలను వాయిదా వేసింది. దౌత్యపరంగా ఇది భారత్ కు ఓ పెద్ద విజయమే. నేపాల్ లో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగనంత వరకూ అది భారత్ కు మిత్రదేశంగానే ఉండింది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అది చైనా చెప్పుచేతుల్లోకి వెళ్లింది. నేపాల్ ను రెచ్చగొట్టిన చైనా ఆ తరువాత తానే నేరుగా రంగంలోకి దిగింది. లద్దాఖ్ వద్ద సిక్కిం వద్ద కయ్యాలు ప్రారంభించింది.

భారత్ విషయానికి వస్తే మొదటి నుంచి అది చైనాతో స్నేహసంబంధాలే కోరుకుంది. అమెరికా వైపు మొగ్గు చూపినప్పటికీ ఆ ప్రభావం చైనాతో సంబంధాలపై పడకుండానే జాగ్రత్తపడింది. అంతకంటే ముందు నుంచే చైనా అన్ని విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా సైనికంగా భారత్ ను అష్టదిగ్బంధం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్ పొరుగుదేశాల్లో తన ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు ఇలా పలు దేశాలకు అప్పులిచ్చి వాటిని రుణాల ఊబిలోకి దింపింది. ఆయా దేశాలను తన సైనిక స్థావరాలుగా మార్చుకునే ప్రయత్నాలు చేసింది. చైనా వ్యూహాన్ని గమనించిన భారత్ తక్షణం జాగ్రత్త పడింది. తూర్పు దేశాలతో స్నేహసంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా చైనా పొరుగుదేశాలతో ఆర్థిక, సైనిక సంబంధాలు పెంచుకోవడం ప్రారంభించింది. అంతేగాకుండా మోడీ ప్రభుత్వం కొన్నేళ్లుగా చైనా సరిహద్దుల్లో సైనిక మౌలిక వసతులను మెరుగుపర్చడం ప్రారంభించింది. బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక భారత్ తీసుకున్న చర్యలు చైనాకు కంటగింపుగా మారాయి.

ఇక అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, దాని మిత్ర రాజ్యాలతో సహా పలుదేశాలు చైనాకు వ్యతిరేకంగా మారిపోయాయి. కరోనా వైరస్ ను తమకు అంటగట్టిన తీరును ఆ దేశాలు జీర్ణించుకోలేకపోయాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో నిజాలను చెప్పడంలో చైనా దురుద్దేశపూర్వకంగా వ్యవహరించిందని అవి భావిస్తున్నాయి. అందుకే పరిహారాల కోసం ఒత్తిడి ప్రారంభించాయి. వాణిజ్య యుద్ధం ప్రకటించాయి. చైనా కంపెనీలను డీలిస్టింగ్ చేయడాన్ని అమెరికా ప్రారంభించింది. చైనా కంపెనీలపై వివిధ నిబంధనల పేరిట ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచ్ఛన్న యుద్ధం కూడా ప్రారంభమైంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల్లో చైనా ప్రాబల్యంపై నిరసన మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో కీలకపదవి భారత్ కు దక్కింది. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మరో వైపున కరోనా వైరస్ పై స్వతంత్ర విచారణ తీర్మానానికి 62 దేశాలతో పాటు భారత్ కూడా మద్దతు పలికింది. చివరకు అమెరికా, దాని మిత్రరాజ్యాలు చైనా పై యుద్ధం ప్రకటిస్తాయా అనే వరకూ వ్యవహారం వెళ్లింది. ఈ నేపథ్యంలో చైనా యావత్ ప్రపంచంలో తన మిత్రదేశాలేంటో తేల్చుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. అందుకు హాంకాంగ్ లో ప్రత్యక్ష పాలన, తైవాన్ స్వాధీనం, భారత్ తో కయ్యం లాంటి అంశాలను ఎంచుకున్నట్లుగా ఉంది. ఈ మూడు అంశాల్లోనూ చైనాకు భంగపాటు ఎదురవుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో జట్టు కడితే ఇబ్బందులు తప్పవనే హెచ్చరిక చేసేందుకే భారత్ తో సరిహద్దు తగాదాను తెరపైకి తెచ్చింది చైనా. భారత్ మాత్రం ఈ విషయంలో చైనా ఒత్తిళ్లకు తలొగ్గలేదు. గతంలో ఎన్నడూ లేనంత స్పష్టమైన ధోరణి అనుసరించింది. సరిహద్దుల విషయంలో రాజీ లేదనే సందేశాన్ని ఇచ్చింది. అంతకంటే బలమైన సందేశం కూడా అందులో ఉంది. అవసరమైతే అమెరికా, ఆస్ట్రేలియాతో చేతులు కలుపుతామనే సందేశం కూడా అందులో ఉంది. దాంతో చైనా వెనక్కు తగ్గక తప్పలేదు. చైనా వెనుకడగు వేయడం తాత్కాలికమే కావచ్చు ఎందుకంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చైనా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ యుద్ధం ఎవరితోననే విషయంలో స్పష్టత లేకున్నా బహుశా అది అమెరికా, దాని మిత్రరాజ్యాలతో భారీ యుద్ధమే అయి ఉంటుంది. ఆ యుద్ధానికి సన్నాహకంగానే భారత్ పై చిన్నపాటి యుద్ధానికి చైనా సిద్ధపడి ఉండవచ్చు. చిన్నపాటి యుద్ధం చేయడం ద్వారా తన సైనిక సన్నద్ధతను పరీక్షించుకుందామని కూడా చైనా భావించి ఉండవచ్చు.

భారత్ తో యుద్ధానికి సైతం సిద్ధమైన చైనా ఒక్కసారిగా వెనుకడుగు వేసింది. చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రకటించింది. మరో వైపున ఈ అంశంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమేనంటూ అమెరికా ముందుకొచ్చింది. నేపాల్ ఒక్కసారిగా మాట మార్చడం చైనా తన దూకుడు తగ్గించుకోవడం కూడా వ్యూహాత్మకమే కావచ్చు. ఎప్పటికైనా చైనా నుంచి భారత్ కు ముప్పు తప్పదు. అదే సమయంలో చైనాతో కలసి జీవించడం కూడా తప్పదు. అందుకు అనుగుణంగా భారత్ తన వ్యూహాలను రూపొందించుకోవాల్సిన సందర్భం వచ్చింది.

తాజా వివాదంలో చైనా వెనుకడుగు వేసింది అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన అది భారత్ కు విజయమని చెప్పలేం. డోక్లాం నాటి నుంచి కూడా భారత్ చైనాతో మరింత దృఢంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల పట్ల భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తాజా సంఘటన గుర్తు చేసింది. నిజానికి సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖపై రెండు దేశాల సైనిక దళాలకు స్పష్టమైన అవగాహన ఉంది. కాకపోతే ఆ అవగాహనను ఒక దేశం మరో దేశంతో పంచుకోవాలి. తమ సరిహద్దులేవో అవి చెబితే అభ్యంతరాలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవచ్చు. చైనా మాత్రం వ్యూహాత్మకంగానే ఈ విధమైన యంత్రాంగాన్ని నీరుగార్చింది. పశ్చిమ సెక్టార్ లో మ్యాప్ లను ఇచ్చిపుచ్చుకోవడాన్ని కూడా చైనా నిరోధించింది. తూర్పు సెక్టార్ లోనూ అదే విధంగా చేసింది. దాని ఫలితంగానే లద్దాఖ్, సిక్కిం ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు చెలరేగాయి. మిడిల్ సెక్టార్ లో మాత్రం మ్యాప్ లను ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ కొనసాగింది. తాజాగా చైనా నేపాల్ ను రెచ్చగొట్టి ఆ పటాలపై కూడా వివాదాన్ని లేవనెత్తింది. ఏమైతేనేం ఒక్కటి మాత్రం నిజం 1962 నాటి పరాభవాన్ని మరోసారి పొందేందుకు భారత్ ఇప్పుడు సిద్ధంగా లేదు. అంతేకాదు భారత సైనిక దళాలకు ప్రభుత్వం మరింతగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సరిహద్దులను కాపాడుకోవడంలో ప్రజల ఆకాంక్షలకు పట్టం కడుతోంది.

ఇతర దేశాల భూభాగాలు మనకు అవసరం లేదు కానీ అటు పాకిస్థాన్ ఆక్రమణలో పీఓకేను, చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను మాత్రం తిరిగి పొందాల్సిన అవసరం ఉంది. తాజాగా సరిహద్దులో శాంతి నెలకొందని సంబరపడే సమయం కాదిది. చైనాకు దీటుగా మన సైన్యాన్ని ఆధునికీకరించుకోవాల్సిన సందర్భం ఇది. చైనా తన సైనికుల సంఖ్యను తగ్గించుకున్నా బాగా ఆధునీకరించింది. ఇటీవలే సైన్యంలో కొన్ని సంస్కరణలు చేపట్టారు. వాటిని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. చైనాను పూర్తిగా విశ్వసించలేం. ఎప్పటికప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories