బ్రిటన్‌ ప్రధాని రేసులో రిసీ సునక్‌‌.. బ్రిటన్‌ ప్రధాని బోరీస్‌ జాన్సన్‌కు పదవీ గండం

British finance Minister Rishi Sunak wife Charges of Tax Evasion
x

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిసీ సునక్‌‌.. బ్రిటన్‌ ప్రధాని బోరీస్‌ జాన్సన్‌కు పదవీ గండం

Highlights

Rishi Sunak: రిషీ సునక్‌‌పై భార్యకు సంబంధించిన వివాదాలు

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో విందు నిర్వహించిన ఘటన ఆయన మెడకు చుట్టుకుంది. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దిగిపోక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన వారసుడిగా ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి, భారత సంతతికి చెందిన రిషీ సునక్‌ పేరు వినిపిస్తోంది. ప్రధాని రేసులో ఉన్న రిషికి ఇటీవల భార్య తరఫు వ్యవహారాలు తలనొప్పిగా మారాయి. ఏకంగా పదవిని అడ్డుకునే సూచనలు కనిపిస్తున్నాయట

ఏడాదిన్నర క్రితం బ్రిటన్‌లో కోవిడ్‌ మహమ్మారి కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో 10 డౌన్‌ స్ట్రీట్‌లోని అధికారిక నివాసంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సహచరులతో కలిసి మద్యంతో విందు నిర్వహించారు. ఈ ఘటన ఇప్పుడు ప్రధాని మెడకు చుట్టుకుంది. దీనిపై రెండ్రోజుల క్రితం దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు కూడా చెప్పారు. అయినా బోరిస్‌ దిగిపోవాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీనేకాకుండా సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన దిగిపోక తప్పదని బ్రిటన్ మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయమై ఆన్‌లైన్‌లో జోరుగా బెట్టింగులు కూడా ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. బోరిస్‌ దిగిపోతే ఆయన వారసుడు ఎవరన్న చర్చ బ్రిటన్‌లో జోరుగా సాగుతోంది. ఈ చర్చలో ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషీ సునక్‌ పేరు బలంగా వినిపిస్తోంది.

భారతీయ సంతతికి చెందిన రిషీ సునక్‌ ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక శాఖమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్వయాన అల్లుడు రిషీ సునక్‌. బ్రిటన్‌ ప్రధాన మంత్రి రేసులో రిషీ సునక్‌ ముందు వరుసలో ఉన్నారు. తాజాగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బోరిస్‌ క్షమాపణలు చెబుతున్న సమయంలో రిషీ అక్కడ లేకపోవడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రధానిపై వస్తున్న ఆరోపణలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే రిషీ సభకు గైర్హాజరైనట్టు చెబుతున్నారు. దీనిపై అక్కడి మీడియాలో పలు విశ్లేషనాత్మక కథనాలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలను రిషీ కొట్టిపడేస్తూ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. తాను ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని బోరిస్‌ క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించారు. అయితే రిషి చెప్పిన కారణం పేలవంగా ఉందని అక్కడి మీడియా తెలిపింది.

ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రిషి సునక్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యాపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆంక్షలను విధిస్తుంటే మీరు మాత్రం ఇన్ఫోసిస్‌ ద్వారా లాభాలు పొందుతున్నారా? అంటూ రిషీ సునక్‌ను అక్కడి మీడియా ప్రశ్నించింది. ఇన్ఫోసిస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని రిషీ స్పష్టం చేశారు. అందులో తన భార్యకు వాటాలు ఉన్నాయని ఆమె ప్రజాప్రతినిధి కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ కూడా రష్యాలో కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో వివాదం రిషీ మెడకు చుట్టుకుంది. ఆయన భార్య అక్షతా మూర్తి తొమ్మిదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్నా పన్ను చెల్లించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బ్రిటన్‌లో ఓ వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీ డైరెక్టర్‌ హోదాలో తనకు లభించే ఆదాయంపైన మాత్రమే ఆమె పన్నులు చెల్లిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని ఆమోదించదు. దీంతో అక్షత ఇప్పటికీ భారత్‌లో పన్నులు చెల్లిస్తున్నారు.

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ ఎల్సిన్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ప్రధాని తప్పుకుంటారన్న మీడియా కథనాల నేపథ్యంలో బెట్‌ఫెయిర్‌ అనే ఆన్‌లైన్‌ సంస్థ బెట్టింగ్‌ నిర్వహిస్తోంది. బోరిస్‌ తప్పకుంటే ప్రధాని రేసులో రిషి సునక్‌కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉందని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే రిషిపైనా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తరువాతి స్థానంలో విదేశాంగ సెక్రటరీ లిజ్‌ ట్రస్‌, కేబినెట్‌ మంత్రులు మైకెల్‌ గోవ్‌, ఒలివర్‌ డోడెన్‌ ఉన్నారు. వారితో పాటు విదేశాంగ మాజీ సెక్రటరీ జరేమీ హంట్‌, భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌, హెల్త్‌ సెక్రటరీ సజిద్‌ జావిద్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

రిషిపై విమర్శలు ఉన్నా అది పెద్ద సమస్య కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీలో రిషీకి మంచి పట్టు ఉందని.. అన్ని కలిసొస్తే.. ఆయనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories