ఈసారి పులివెందుల్లో ఏం జరగబోతోంది?

ఈసారి పులివెందుల్లో ఏం జరగబోతోంది?
x
Highlights

వైఎస్‌ అంటే పులివెందుల. పులివెందుల అంటే వైఎస్‌ అన్నంతగా ఆ నియోజకవర్గం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని...

వైఎస్‌ అంటే పులివెందుల. పులివెందుల అంటే వైఎస్‌ అన్నంతగా ఆ నియోజకవర్గం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని సెగ్మెంట్‌ ఏదైనా ఉందంటే, అది పులివెందులే. పులివెందుల వైఎస్ఆర్‌ ఫ్యామిలీ కంచుకోట. ఇందులో ఎవరికీ డౌట్ లేదు. అయితే ఈసారి పులివెందులపై చంద్రబాబు ఎన్నడూలేనంతగా దృష్టిపెట్టారు. అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పులివెందులకు కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత తనదేనంటు చెప్పుకున్నారు. బాబు ఇంతగా దృష్టిపెట్టిన పులివెందులలో ఈసారి ఏం జరగబోతోంది గెలవడం కష్టమని తెలిసినా చంద్రబాబు వ్యూహమేంటి? ఈసారి పులివెందుల్లో ఏం జరగబోతోంది?

పులివెందులతో వైఎస్‌ ఫ్యామిలీకి నాలుగు దశాబ్దాల అనుబంధం. ఇక్కడి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీతో వైఎస్‌ కుటుంబ సభ్యులను గెలిపిస్తూ వస్తున్నారు పులివెందుల జనం. ఇక్కడ వై ఎస్‌ అంటారే తప్ప, వై నో అనే మాటే లేదు. అంతగా వైఎస్‌ కుటుంబంతో మమేకమైంది పులివెందుల. ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ రంగప్రవేశంతో ఆ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా ప్రజలు మాత్రం వైఎస్‌ కుటుంబం వెంటే నడుస్తూ వస్తున్నారు. ఇందుకు 2011 ఉప ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

మొదటి నుంచి టీడీపీ ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్‌ రెడ్డి నాలుగుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు సాధించాలని వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు, చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచిస్తారన్నది టీడీపీ ధీమా. కాగా ప్రతి ఎన్నికల్లోను పులివెందుల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీస్తుంటాయి.

పులివెందుల నియోజకవర్గంలో ప్రారంభం నుంచి కాంగ్రెస్‌ ఆధిపత్యమే. 1962లో స్వతంత్య్ర అభ్యర్ధిగా బాలిరెడ్డి గెలుపొందారు. 1978లో రాజకీయ ప్రవేశం చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తొలి విజయం కైవసం చేసుకున్నారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నా ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులదే విజయం. 1978 వరకూ బసిరెడ్డి, బాలిరెడ్డిల మధ్య పోరు అన్నట్లుగా సాగుతూ వచ్చింది. 1978లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలో దిగి, 20వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్టీఆర్‌ ప్రభంజనంలో కూడా పులివెందుల ప్రజలు వైఎస్‌కే నీరాజనం పలికారు.

1989లో వైఎస్‌ వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా, 47వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. 1991 ఉప ఎన్నికల్లో వైఎస్‌ పురుషోత్తంరెడ్డి 97వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. 1994లో వైఎస్‌ వివేకానందరెడ్డి, 1999, 2004, 2009లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పోటీ చేశారు. 2004లో 40వేలు, సీఎం హోదాలో 2009లో పోటీ చేసినప్పుడు 69వేల మెజార్టీతో వైఎస్‌ గెలుపొందారు. ఇలా ఆరుసార్లు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు వైఎస్ఆర్.

వైఎస్‌ మరణం తర్వాత 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ విజయలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 81వేల ఓట్ల మెజార్టీతో పురుషోత్తంరెడ్డి రికార్డు దగ్గరికి చేరారు. 2014లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పోటీ చేసి 75వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా తొలుత కాంగ్రెస్‌ అభ్యర్థులకు, ఆ తరువాత వైఎస్‌ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఎదురేలేదని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.

ఇక ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు పరిస్ధితి దారుణం. పోటీ చేయాలంటే చేయాలన్నట్టుగా అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటాయి.

1985లో పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి దేవిరెడ్డి సదాశివరెడ్డి పోటీ చేశారు. 30వేల ఓట్లు దక్కడంతో, అంతే మెజార్టీతో వైఎస్‌ఆర్‌ గెలుపు సాధించారు. ఆ తరువాత 2014 వరకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తూనే ఉన్నారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా ఎస్‌వీ సతీష్ కుమార్‌రెడ్డి 32వేల ఓట్లు దక్కించుకున్నా, 30వేల మెజార్టీతో వైఎస్‌ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా సతీష్‌కు 2004లో 34వేలు, 2009లో 35వేల ఓట్లు లభించాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన రవీంద్రనాధరెడ్డికి కేవలం 11వేల ఓట్లే లభించాయి. 2014లో మళ్లీ సతీష్ కుమార్‌రెడ్డే పోటీ చేయగా 50వేల ఓట్లు సాధించారు. ఇలా నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్‌రెడ్డి ఓటమి పాలవుతూ వస్తున్నారు. మొత్తంగా ఎనిమిదిసార్లు పులివెందులలో వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది.

వైఎస్ఆర్ సీఎం అయ్యాక పులివెందుల అభివృద్ది, సాగునీటి ప్రాజెక్టులు పరుగులు తీశాయి. దీంతో పులివెందుల అభివృద్దిపై వైఎస్ఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తొంది. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు జగన్, ఇప్పుడు సీఎం అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో పులివెందలలో మరింత మెజారిటీతో విజయం ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల ముందే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం, నియోజకవర్గంలో ఆయనకు వ్యక్తిగతంగా పెద్దఎత్తున పరిచయాలుండటంతో, ఆయన లోటు ఎంత మేరా ఉంటుందన్నది కూడా చర్చనీయాంశమైంది.

అయితే ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు, పులివెందులపై ఎన్నడూలేనంతగా ఫోకస్‌ పెట్టారు. ఇక్కడ పసుపు జెండా ఎగరడం కష్టమని తెలిసినా, వీలైనంత వరకూ జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది బాబు వ్యూహం. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా కృష్ణా జలాలతో పులివెందులను సస్యశ్యామలం చేశామని ప్రచారం చేశారు. స్వయంగా చంద్రబాబు పులివెందులలో పెద్ద ఎత్తన రోడ్‌ షో నిర్వహించారు. వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా వాగ్భాణాలు సంధించారు.

అయితే, 2014 ఎన్నికల్లో టీడీపీ కొంత బలం పుంజుకుని, గత ఎన్నికల కన్నా 20 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకోవడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని జిల్లా నేతలు చెబుతున్నారు. అయితే వైఎస్‌ కుటుంబం కంచుకోటలో పాగా వేయడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకుల మాట. ఇక్కడ గెలవడంపై బాబు దృష్టిపెట్టకపోయినా, వీలైనంత వరకూ జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి, మిగతా నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టిపెట్టకుండా చేయడమే వ్యూహమన్నది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ.

మొత్తానికి పులివెందులలో జగన్‌ గెలుపు ఖాయం. అయితే మెజారిటీ పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది ఇప్పుడు పాయింట్. మరి సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన జగన్‌కు జనం అత్యధిక మెజారిటీతో విజయాన్నిస్తారా లేదంటే మెజారిటీ తగ్గించి, ఆ మేరకు టీడీపీ అభ‌్యర్థి సతీష్‌కు ఓట్లు పెంచుతారా లెట్స్ సీ వాట్‌ హ్యాపెన్ ఇన్‌ పులివెందుల.

Show Full Article
Print Article
Next Story
More Stories