నల్లగొండ సమస్యలు తీర్చే వారెవరు!!

నల్లగొండ సమస్యలు తీర్చే వారెవరు!!
x
Highlights

ఇక నల్లగొండ పార్లమెంట్‌ చరిత్రను చూస్తే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండతో పాటు ఇదివరకు మిర్యాలగూడ నియోజకవర్గం ఉండేది. కానీ 2009లో జరిగిన పునర్విభజన...

ఇక నల్లగొండ పార్లమెంట్‌ చరిత్రను చూస్తే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండతో పాటు ఇదివరకు మిర్యాలగూడ నియోజకవర్గం ఉండేది. కానీ 2009లో జరిగిన పునర్విభజన సమయంలో మిర్యాలగూడ కనుమరుగై నల్లగొండతో పాటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. దీనికి తోడు మిర్యాలగూడ కూడా నల్లగొండలో కలిసిపోయింది. నల్లగొండ పార్లమెంటులో 2009, 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మరి ప్రస్తుతం నల్లగొండ ఎంపీ పరిధిలో ఇన్నాళ్ల కాలంలో పరిష్కారం కాని సమస్యలేంటి? కొత్తగా వచ్చిన ప్రాజెక్టులేంటి?

నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజుర్‌నగర్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2009, 2014లో ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి విజయం సాధించారు. నిజానికి నల్లగొండ పార్లమెంటు పరిధి కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానం. 2014లో రాష్ట్ర్రమంతా టీఆర్ఎస్ గాలి వీచినా నల్లగొండ పార్లమెంటులో మాత్రం కాంగ్రెస్ విజయాన్ని గులాబీ అడ్డుకోలేకపోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో హేమహేమీలుగా పేరొందిన నాయకులు ఇక్కడి వారే కావడం విశేషం.

రాజకీయంగా చాలా భిన్నంగా చెప్పుకునే నల్లగొండ పార్లమెంటు పరిధిలో సమస్యలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. కేంద్రస్ధాయిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులు ఏవి కూడా నల్లగొండ పార్లమెంటు గడప తొక్కలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే మొదటగా నిర్మితమైన బీబీనగర్, నడికుడి రైల్వేలైన్ సింగిల్ లైన్‌గానే ఉంది. డబ్లింగ్ కోసం ఆశగా ఎదురుచూస్తుంది. దీని కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి మోక్షం లేదు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఉంది. ఇక నల్లగొండ నుంచి గుంటూరు జిల్లా మాచర్లకు కొత్త రైల్వే లైను ప్రతిపాదనలు అటకెక్కాయి. చారిత్రాక నేపథ్యం ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు దేవరకొండ, సూర్యాపేట, కొదాడ నియోజకవర్గాల్లో రైలుకూత వినే పరిస్ధితి ఎపుడని స్ధానికులు ఎదురుచూస్తున్నారు. మిగతా జిల్లాలలో పోలిస్తే భౌగోళికంగా ఉన్న పరిస్ధితులతో నల్లగొండ పార్లమెంటు పరిధిలో చాలా బిన్నమైన పరిస్ధితులని చెప్పవచ్చు. ఒక్క సాగర్ మాత్రమే పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా ఉంది. ఖమ్మం, కోదాడల మీదుగా, హుజుర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండల మీదుగా జడ్చర్ల వరకు సాగే హైవే నిర్మాణం ఎపుడనేది ప్రశ్న. భూసేకరణ, పనులు చాలాచోట్ల మొదలే కాలేదు.

ఎంపీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి అయ్యాక నల్లగొండ, మిర్యాలగూడలలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటులో ఆయన పాత్ర కీలకం అని చెప్పవచ్చు. వైద్యపరంగా చూస్తే నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎక్కువగా హైదరాబాద్, ఖమ్మం, విజయవాడలకు వెళ్తాంటారు. దీంతో నల్లగొండ, సూర్యాపేటలలో రాష్ట్ర్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లకు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనేది ఎన్నికల ప్రచారాస్త్రం. ఈరెండు మెడికల్ కాలేజ్‌ల వల్ల నల్లగొండ పార్లమెంటు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవే. ఇక పాస్‌పోర్ట్ సేవాకేంద్రాన్ని నల్లగొండలో ఏర్పాటు చేశారు.

నల్లగొండ పార్లమెంటులో గుండెకాయలాంటి రైల్వే లైను అభివృద్దితో పాటు జాతీయ రహదారుల నిర్మాణం త్వరగతిన పూర్తయితే నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల అభివృద్దికి బాటలు పడినట్లే. ఇక నాగార్జునసాగర్‌ను పర్యాటకంగా పూర్తి స్ధాయిలో అబివృద్ది చేయాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories