గాంధీభవన్‌‌లో బీసీ సమరమేంటి?

గాంధీభవన్‌‌లో బీసీ సమరమేంటి?
x
Highlights

తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడట అన్నట్టుంది కాంగ్రెస్‌ తీరు. అధికారపక్షంపై ఆందోళనలకు ఒక్కరూ ఒక్కపట్టాన రారుగానీ, ఎన్నికలనగానే,...

తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడట అన్నట్టుంది కాంగ్రెస్‌ తీరు. అధికారపక్షంపై ఆందోళనలకు ఒక్కరూ ఒక్కపట్టాన రారుగానీ, ఎన్నికలనగానే, తానంటే తానంటూ ముందుకు దూకుతున్నారట. యుద్ధంలో తలో దిక్కున తూటాలు పేలుస్తున్న నేతలు, ఇప్పుడు మరో సమరానికి సై అంటున్నారట. గాంధీభవన్‌లో కొత్త లొల్ల మళ్లీ షురూ అయ్యింది. ఆలూ లేదు సూలు లేదు అల్లుడిపేరు సోమలింగం అనే సామెత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చినట్లు అతుకుతోందనడానికి, నిత్యం సవాలక్ష నిదర్శనాలు. అందులో మరొకటి ఇప్పుడు రచ్చరచ్చ చేస్తోంది.

అసలే రాష్ట్రంలో పార్టీకి గడ్డుకాలం కొనసాగుతోంది. కాని ఆపార్టీలో వివాదాలు మాత్రం పుష్కలంగా తెరమీదకు వస్తూనే వున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీలో ఎవ్వరికివారే ముట్టడిలకు పిలుపునివ్వడంపై మాటల యుద్దం కొనసాగింది. పార్టీ అధినేతలపై సొంతపార్టీ నేతలు విమర్శలు చేశారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బిసి నేతలకే టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ తెరమీదకు రావడంతో గాంధీభవన్‌లో రభస పీక్స్‌కు చేరుతోంది.

కష్టకాలంలోనైనా నేతలు కలిసి పనిచేస్తే, ఇలాంటి ఎన్నికల్లోనైనా గట్టెక్కవచ్చని పార్టీనేతలు ఆలోచిస్తున్న సమయంలో, కొందరు సీనియర్లు బీసీ నినాదం ఎత్తుకున్నారు. గడ్డు సమయంలో ఇదేం తీరని మండిపడుతున్నారు కొందరు. అయితే ఇప్పటికే పార్టీలో సీనియర్లు చాలామంది అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చవిచూడ్డంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం భారీగానే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవ్వరికి వారు సీనియర్లు సైతం తాము బరిలో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సైలెంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, ఇటీవల పార్టీలో యాక్టీవ్‌గా పనిచేస్తూ మహబూబ్ నగర్ పట్టభద్రుల టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక వరంగల్ నుంచి పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, రెండు స్థానాల్లో, రెండు టిక్కెట్లూ బీసీ నేతలకే ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుండటం సిగపట్ల కుంపట్లు రాజేస్తోంది. ఇప్పటికే పిసిసి కార్యవర్గంలో కీలక పదవులు ఓసిలకు ఉన్నందున, ఈ రెండు టిక్కెట్లు బీసీలకు కేటాయించి, బీసీలను కాంగ్రెస్ వైపు వచ్చేలా ప్లాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టభద్రుల స్థానం కూన శ్రీశైలంగౌడ్ కు, వరంగల్ స్థానాన్ని పొన్నాల లక్ష్మయ్యకు ఇవ్వాలంటున్నారట.

ఇదే అంశాన్ని గాంధీభవన్ లో జరిగిన ముఖ్య సమావేశంలో పార్టీ సీనియర్ నేత విహెచ్ లేవనెత్తినట్టు తెలిసింది. ఇప్పటికే టిఆర్ఎస్ బిసిలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, బిసి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకుంటుంటే, కాంగ్రెస్ మాత్రం పట్టించుకోవడంలేదని విహెచ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే, కరోనా కష్టకాలంలో ఎన్నికల వ్యయం భరించే నేతలను కాకుండా సామాజిక వర్గాలకు టిక్కెట్టు ఇస్తే గెలవడం అంతఈజీ కాదనే వాదన సైతం పార్టీలో వినిపిస్తోంది. బలంగా ఉన్న టిఆర్ఎస్, బిజేపిలను ఈ రెండు స్థానాల్లో ఎదుర్కొవాలంటే, ఆర్థికపరిపుష‌టి ఉన్న నేతలకే ఇవ్వాలనే యోచనలో పార్టీ ముఖ్యనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా బీసీ డిమాండ్, ధనం డిమాండ్‌తో, గాంధీభవన్‌ దద్దరిల్లుతోంది. ఎమ్మెల్సీ స్థానంలో గెలుస్తారో లేదో కానీ, టికెట్‌ కోసమైతే, సిగపట్లు పడుతున్నారు ఖద్దరు నేతలు. చివరికి ఏం తేలుతుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories