ఆక్స్‌ఫామ్ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఆక్స్‌ఫామ్ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
x
Highlights

సంపన్నులు రోజు రోజుకు మరింత సంపన్నులుగా ఎదుగుతుంటే.. పేదవారు మాత్రం మరింత పేదవారుగా మిగిలిపోతున్నారు.. భారత దేశ ఆర్థిక స్థితి గతులపై విశ్లేషించిన...

సంపన్నులు రోజు రోజుకు మరింత సంపన్నులుగా ఎదుగుతుంటే.. పేదవారు మాత్రం మరింత పేదవారుగా మిగిలిపోతున్నారు.. భారత దేశ ఆర్థిక స్థితి గతులపై విశ్లేషించిన ఆక్స్ ఫామ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇది.. బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన కులాలు అధికంగా ఉన్న ఈ దేశంలో సంపన్నులే అధికారం చెలాయిస్తున్నారా? పేదలకు ఏం కావాలో వారే నిర్ణయిస్తున్నారా? ఇది మన భారతీయ వ్యవస్థకు మేలు చేస్తుందా? ఎదుగుదల పురోగమనానికి సంకేతం.. కానీ మనదేశం అభివృద్ధి మాత్రం మూడడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి జరుగుతోందా? ఏళ్లు గడుస్తున్నా మన పురోగమనం ఎక్క డ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోందా? మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మూస ధోరణిలో ఉంటున్నాయా? మన అభివృద్ధి మందగమనానికి అసలు కారణాలేంటి?

భారతదేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదుగుతున్నారని, పేదలు మరింత పేదలుగా మిగిలిపోతున్నారని ఆక్స్ ఫామ్ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. దేశంలో ఉన్న 10 శాతం మంది సంపన్నుల దగ్గర దేశ సంపదలో 77.4 శాతం నిక్షిప్తమై ఉందని, మిగిలిన పేదలు 60 శాతంలో 4.8 శాతం సంపదను కలిగి ఉన్నారని ఆ అధ్యయనం పేర్కొంది. స్విట్జర్లాండ్ లోని వాల్డ్ ఎకనామిక్ ఫోరం అయిదురోజుల సదస్సు సందర్భంగా ఆక్స్ ఫామ్ సంస్థ ఈ డాక్యుమెంట్ ను విడుదల చేసింది. గత ఏడాది భారతీయ సంపన్నులు రోజుకు 2,200 కోట్ల చొప్పున ఆస్తులు పెంచుకున్నారని, దేశంలోని అగ్రశ్రేణి సంపన్నులు 39 శాతం ధనికులుగా ఎదగగా అట్టడుగు వర్గాల పేదలలో కేవలం 3 శాతం మంది మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకున్నారని ఆ సంస్థ లెక్క గట్టింది.కోట్ల సంఖ్యలో ఉన్న అట్టడుగు వర్గాల వారు 2004 నుంచీ పేదలుగానే మిగిలిపోయారు. దీనికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ అభిప్రాయపడింది. దేశ సంపద కొందరు సంపన్నుల దగ్గరే నిలిచిపోతోందని, పేదలు కనీసం ఒక పూట తిండికి, లేదా వైద్యానికీ చేతిలో రూపాయి లేకుండా మిగిలిపోతున్నారని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ తారతమ్యం ఇలాగే కొనసాగితే.. సమీప భవిష్యత్తులో దేశ సామాజిక, ప్రజాస్వామిక పునాదులు కుప్పకూలిపోతాయని సూచించింది. ఆక్స్ ఫామ్ లెక్కల ప్రకారం దేశంలోని పదిశాతం సంపన్నుల దగ్గర 77 శాతం జాతీయ సంపద పేరుకు పోతుంటే వారిలో ఒక శాతం దగ్గర కనీసం 51 శాతం సంపద ఉండిపోతోంది. అంటే దేశంలో 50 శాతం జనాభా దగ్గరున్న సంపద కేవలం 9 మంది కోటీశ్వరుల దగ్గరుంటోంది.

మనదేశంలో మొత్తం 119 మంది కోటీశ్వరులున్నారు.. గత ఏడాది కొత్తగా 18 మంది సంపన్నుల లిస్టులో చేరారు.. వీరి మొత్తం సంపద400 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 28 లక్షల కోట్లు దాటింది.. ఇక 2018 నుంచి 2022 వరకూ రోజుకు 70 మంది చొప్పున కోటీశ్వరులు తయారవుతారని కూడా ఆక్స్ ఫామ్ స్టడీ లెక్కలు కట్టింది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పేదలను మరింత పేదలుగా, సంపన్నులను మరింత సంపన్నులుగా తయారు చేయడం దేశానికి ప్రమాదకర సంకేతాలనిస్తోందంటున్నారు ఆర్థిక నిపుణులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం, ప్రజారోగ్యం, పరిశుభ్రత, మంచినీటి సరఫరా కోసం 2 లక్షల 8 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాయని ఇది కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ రెండు లక్షల కోట్ల సంపద కన్నా తక్కువేనని ఆ అధ్యయనం తేల్చింది. ప్రభుత్వాలు ఆరోగ్యరంగం, విద్య లాంటి కీలక రంగాలకు తగినన్ని నిధులు కేటాయించకుండా వదిలేయడం, సంపన్నుల పన్ను ఎగవేతను పట్టించుకోకపోవడం వల్లనే ఈ అసమతుల్యత ఏర్పడుతోంది. సంపన్నులు, కార్పొరేషన్లు తమ ఆదాయం బాగా పెరిగి లాభాల బాట పట్టినా.. పన్నులు మాత్రం ఏళ్లతరబడి ఒకే విధంగా అతి తక్కువగా కడుతుండటం కూడా ఈ తేడాలకు కారణమవుతోంది. మనదేశంలో టీచర్లు లేని స్కూళ్లు, మందులు లేని ఆస్పత్రులే మన పేదరికం కొనసాగడానికి, ఆదాయం పెరగకపోవడానికి కారణాలు.. ఉత్పాదక రంగానికి తగినన్ని పెట్టుబడులు లేనప్పుడు ఉత్పత్తి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories