సార్వత్రిక ఎన్నికలకు సైరా సయ్యా? లేదంటే నైయ్యా?

సార్వత్రిక ఎన్నికలకు సైరా సయ్యా? లేదంటే నైయ్యా?
x
Highlights

మరి సైరా దారెటు..చిరంజీవి ముందున్న మార్గాలేంటి. ఎన్నికల క్రాస్‌ రోడ్స్‌లో, ఏ రూట్‌‌ను ఎంచుకుంటారు. లేదా సైలెంట్‌గానే ఉండిపోయి, సినిమాలకే...

మరి సైరా దారెటు..చిరంజీవి ముందున్న మార్గాలేంటి. ఎన్నికల క్రాస్‌ రోడ్స్‌లో, ఏ రూట్‌‌ను ఎంచుకుంటారు. లేదా సైలెంట్‌గానే ఉండిపోయి, సినిమాలకే పరిమితమవుతారా? ఇన్‌ఫ్రంట్‌ చిరంజీవి ఆప్షన్స్ ఏంటి?

ప్రస్తుతం చిరంజీవి, సైరా సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరాలో, చిరంజీవి టైటిల్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. సమ్మర్‌లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అదే టైంలో ఎన్నికలు కూడా. దీంతో ఈ సినిమా సక్సెస్ అయితే, చిరంజీవి కూడా అదే ఊపుతో వచ్చి, ప్రచారంలో పాల్గొంటారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రజారాజ్యం స్థాపించి, దాన్ని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగానూ చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. కానీ 2014 తర్వాత కాంగ్రెస్‌కు అసలు టచ్‌లో లేరు. సినిమాల మీదే దృష్టిపెట్టారు. తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తీశారు. ఆ తర్వాత సైరా మొదలుపెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ కనీసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన స్టేట్ మెంట్లు ఇవ్వడం లేదు చిరంజీవి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా కోరినా చిరంజీవి స్పందించలేదని తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసినా, చిరంజీవి ఇంకా దాన్ని పునరుద్ధరించుకోలేదట. ఈ పరిణామాలను చూస్తుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా?..దూరమైతే ఎందుకు దూరమైనట్టు?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌‌ను, వంద అడుగుల గొయ్యి తీసి పాతేశారు జనం. అక్కడిప్పుడు రఘువీరా రెడ్డి ఏక్‌ నిరంజన్‌లా పార్టీని నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌ ఉద్దండ నాయకులంతా, వైసీపీ, టీడీపీ, బీజేపీలంటూ తలో దిక్కూ తరలిపోతున్నారు. సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌కు మంచిరోజులు కనపడ్డంలేదు. అందుకే కాంగ్రెస్‌ తరపున ఎంత పోరాడినా, అడవికాచిన వెన్నెలే అనుకుంటున్నారు చిరంజీవి. దాని పునరుజ్జీవానికి కృషి చేయాలని, పార్టీ కీలక పదవులు ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేసినా చిరంజీవి అటువైపు చూడ్డంలేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు స్కోపేలేదని లెక్కలేస్తున్న చిరంజీవి, అటువంటప్పుడు ప్రచారం చేయడం ఎందుకు, పరువు తీసుకోవడం ఎందుకని భావిస్తున్నారు. సో, కాంగ్రెస్‌ తరపున చిరంజీవి ప్రచారం చేసే అవకాశమే లేదనుకోవాలి.

జనసేన. తమ్ముడు పవన్ కల్యాణ్‌ స్థాపించిన పార్టీ. ఒకే ఒక్కడుగా ముందుకెళుతున్నారు పవన్. ఈ సమయంలో పవన్‌కు చిరంజీవి జతయితే తిరుగే ఉండదని సహజంగానే మెగా అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఎందుకనో ఇద్దరూ కలవడం లేదు. చాలా సందర్భాల్లో అన్నయ్యను తలచుకున్నారు పవన్ కల్యాణ్. ప్రజారాజ్యంలో అన్నయ్యను తప్పుదోవ పట్టించారని, మోసం చేశారని, చిరును వెనకేసుకొచ్చారు. దీంతో చిరంజీవి జనసేనలోకి వస్తారని, కనీసం ప్రచారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ సందడి కనిపించడం లేదు. మరి పవన్‌ కల్యాణ్‌, అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించలేదా లేదంటే అసలు జనసేనలోకి వెళ్లడమే చిరుకు ఇష్టంలేదా? ఇద్దరూ జట్టుగా వెళ్లడం అంత మంచిదికాదనుకుంటున్నారా?

చిరంజీవి జనసేనలోకి వెళ్లకపోవడానికి కూడా చాలా కారణాలున్నాయని అర్థమవుతోంది. ఎందుకంటే, ప్రజారాజ్యం వైఫల్యం జనం మర్చిపోలేదు. అదే పార్టీలో నాడు యువరాజ్యం అంటూ పవన్ హడావుడి చేశారు. కానీ ఆల్ ఆఫ్‌ సడెన్‌గా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ఇప్పుడు చిరు గనుక జనసేనలోకి వెళితే, పవన్‌ కల్యాణ్‌కే ఇబ్బంది. జనం నుంచి ప్రశ్నలు ఎదురుగాక తప్పదు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉంటే జనసేన కాస్త మరో ప్రజారాజ్యం కాకతప్పదని, ప్రత్యర్థి పార్టీలు విమర్శించే ఛాన్సుంది.

అంతేకాదు, చిరంజీవి పార్టీలోకి వస్తే, పవన్ కంటే చిరుకే పెద్ద పోస్ట్ ఇవ్వాలి. ఇద్దరి మధ్యా హోదా తారతమ్యాలు తప్పవు. చిరుతో పాటు చాలామంది మళ్లీ జనసేనలోకి వచ్చేస్తారు. అది పవన్‌కు నచ్చదు. అంతేకాదు, అసలు పవన్‌ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, కింగ్‌ అవుతుందో, కింగ్ మేకర్‌ అవుతుందో, తెలీదు. అందుకే ఇప్పుడు జనసేనలోకి వెళ్లడం, మళ్లీ ప్రజారాజ్యాన్ని ఎందుకు గుర్తు చేయడం, తమ్ముడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటున్న చిరు, గట్టున నిలబడి అంతా సైలెంట్‌గా చూద్దామనుకుంటున్నారు. అంటే, చిరు సెకండ్ ఆప్షన్‌, జనసేన కూడా కాదనుకోవాలి.

సరే చిరు కాంగ్రెస్‌కు దూరమే, జనసేనకూ ఆమడ దూరమే, మరి ఈ సార్వత్రిక సమరంలో చిరంజీవి ఏం చెయ్యబోతున్నారన్నదే అభిమానులు, కార్యకర్తలను తొలిచేస్తున్న ప్రశ్న. టీడీపీ తరపున ప్రచారం చేసే ఛాన్స్ లేదు. వైసీపీకీ సేమ్ డిస్టెన్స్. బీజేపీ వైపు అస్సలు చూసే అవకాశమే లేదు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి సైలెంట్‌గా ఉండే అవకాశముందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజారాజ్యం విఫలం, కాంగ్రెస్‌ పతనం, ఇలా అన్ని అనుభవాలు అయిపోయాయ గనుక, దాదాపు రాజకీయాలకు గుడ్‌ బై చెప్పినట్టేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే, సినిమాల జోష్ పెరిగాక, మరోసారి పాలిటిక్స్ వైపు చిరు చూపు మరలే అవకాశముందని, ఇప్పడు మాత్రం మౌనమేనంటున్నారు విశ్లేషకులు. చూడాలి, రానున్న కాలం చిరుకు ఎలాంటి దారి చూపిస్తుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories