1965, 1971 యుద్ధ జ్ఞాపకాలు నెమరేసుకుంటున్న ప్రజలు

1965, 1971 యుద్ధ జ్ఞాపకాలు నెమరేసుకుంటున్న ప్రజలు
x
Highlights

యుద్ధవాతావరణంతో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ స్థానిక అధికారులు సౌండ్‌ సిస్టమ్‌లను...

యుద్ధవాతావరణంతో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ స్థానిక అధికారులు సౌండ్‌ సిస్టమ్‌లను ఉపయోగించి హెచ్చరిస్తున్నారు. సరిహద్దు మొత్తం సైన్యం గస్తీ పెంచింది. కవాతులు నిర్వహిస్తోంది.

నియంత్రణ రేఖను ఆనుకుని 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో 333 గ్రామాలున్నాయి. ఇండో-పాక్‌ మధ్య తాజా ఘర్షణపూరిత వాతావరణాన్ని ముందుగానే పసిగట్టిన ప్రజలు బయల్దేరి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. బ్యాంకులు, ఏటీఎంలు, అప్పులిచ్చేవారి వద్దకు డబ్బుల కోసం పరుగులు తీశారు. ఇందులో ప్రత్యేకించి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. యువకులు మాత్రం భారత సైన్యానికి తోడ్పాటు నందించేందుకు కొందరు గ్రామాల్లోనే ఉండడం విశేషం.

సరిహద్దు గ్రామాల్లోని ప్రజలంతా గుంపులు గుంపులుగా వీధుల్లో గుమికూడి ఉన్నపళాన ఎక్కడికెళ్లాలనే దానిపై చర్చించుకుంటున్నారు. మహిళలు నెత్తిన మూటలు పెట్టుకుని 1965, 1971 నాటి యుద్ధ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. వాహనాలు, ఎడ్ల బండ్లు, ద్విచక్రవాహనాలు, ట్రక్కులు, ఇలా ఏది దొరికితే దానిపైన ప్రయాణం సాగించారు. గ్రామీణ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం, సైన్యం కొన్ని వాహనాలు సమకూర్చింది.

ఏ సమయంలోనైనా యుద్ధం ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో సదా సిద్ధంగా ఉండాలని సరిహద్దు జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్‌లు, హోంశాఖ విభాగాలకు ఆదేశాలు అందాయి. సరిహద్దు గ్రామాల్లోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో మెషీన్‌గన్లను అందుబాటులో ఉంచారు. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా అధికారులతో పాటు పోలీసులు, బీఎస్‌ఎఫ్‌, ఆర్మీ అధికారులు మొత్తం కలిసి సమీక్షలు నిర్వహించారు. పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని అందుకు టెర్రరిస్టు సంస్థలను ఉసిగొల్పే ప్రమాదం ఉందని నిఘా సంస్థల నుంచి సమాచారం అందడంతో కేంద్రం అప్రమత్తమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories